Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయన ఇంటిపేరు 'శ్రీధిరాలు', అమ్మానాన్నలు పెట్టిన ఒంటి పేరు 'వేంకటాచారి'. శ్రీధిరాల వేంకటాచారి నవంబరు 11, 1946న ఖమ్మం జిల్లా దమ్మగూడెం మండలం నందుల చలక గ్రామంలో పుట్టారు. తల్లితండ్రులు శ్రీమతి సీతమ్మ, శ్రీ లక్ష్మీనారాయణ. యస్.యస్.యల్సి చదువుకుని ఎస్.జి.బి.టి ఉపాధ్యాయునిగా మూడున్నర దశాబ్దాలకు పైగా విద్యాదానం చేసిన వీరు కవి, రచయిత. సంగీతంపై ఆసక్తితో హార్మోనియం సాధన చేశారు.
సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొనడమే కాక రచనా వ్యాసంగం పట్ల తనకున్న ఆసక్తితో పద్యం, గేయం, వచన కవిత్వం రాశారు శ్రీధిరాల వేంకటాచారి. 'హృదయవీణ' వీరి కవితా వాహిని. ఇదే కాక 'ఉపాధ్యాయ శతకము' పేరుతో ఉపాధ్యాయుల కరదీపికను పద్యాల్లో రాశారు. శ్రీధిరాల మరో రస 'హృదయ వీక్షణ'. ఇవేకాక వీరు రాసిన వాటిలో 'శ్రీహనుమత్శతకము', 'గిరిజన శతకము', 'వరకట్న శతకము', 'గిరిజన శతకము' వంటివి ఉన్నాయి.
బాలల కోసం శ్రీధిరాల వేంకటాచారి రాసిన కథల సంపుటి 'అమ్మమ్మ కథలు'. తన అమ్మమ్మ తనకు బాల్యంలో చెప్పిన కథలను నేటి మన పిల్లలకోసం తన బాధ్యతగా అందించారు శ్రీధిరాల. అమ్మమ్మ కీర్తిశేషులు నాంపల్లి దేవమ్మను యాది జేసుకుంటూ 'నీవు చెప్పిన కథలను - నెమరువేసి/ బాల సాహిత్యము తీర్చి - భద్రముగను / అచ్చువేయించినాడను - ముచ్చటగను' అంటూ అమ్మమ్మకు అందుకొమ్మని అందిస్తారు రచయిత. అందులోనూ అక్షరాలు నేర్వని జానపద సరస్వతి తన అమ్మమ్మ తనకు జానపద, హాస్య, నీతి, నైతిక మాల్యాంకనము మొదలగు విషయాలను తనకు కథలుగా చెప్పిందని, దానిని అందించాలన్న కోరిక తన మిత్రుడు శ్రీనివాసరాజు రచనల వల్ల కలిగిందని అందుకు అక్షరరూపమే తన 'అమ్మమ్మ కథలు' అంటారు.
'అమ్మమ్మ కథలు' లో శ్రీధరాల వేంకటాచారి ఇరవై ఒక్క కథలు పొందుపరిచారు. వీటిలో ఇరవై కథలు తనకు తన అమ్మమ్మ చెప్పగా, ఒక కథ పొరుగూరు నుండి వచ్చిన ఒక నానమ్మ చెప్పిన కథ. ఇందులోని కథలన్నీ సరదాగా ఉంటాయి. పిల్లలు చదువుకుని ఆనందించేందుకు సహకరించడమే కాక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. రచయిత ప్రతి కథ ప్రారంభంలో ఆ కథ నేపథ్యాన్ని అంటే తన అమ్మమ్మ చెప్పిన సమయ సందర్భాలు లేదా ఇతర వివరాలను చెప్పడం కొత్తగా వుంది. ఇందులో కల్పిత కథలే కాక వందల యేండ్ల కింద జరిగిన కొన్ని సంఘటనలు కథలుగా చూడవచ్చు. అటువంటిదే ఇందులోని ఒక స్థానిక గాథ 'పాలయ్య- కోటయ్య దేవుడు' కథ. ఇది జరిగిన కథ అట. మల్లాది కోటయ్య పులివాతన పడిన కథ యిందులో ఉంది. ధర్మాత్ముడైన ఆయన తన గ్రామం ములకలపల్లిలో ఓ ధర్మసత్రం నెలకొల్పి భోజన వసతి ఏర్పాట్లును పరిశీలించిన ధర్మాత్ముడు ఒకనాడు కోటయ్య తన భార్య గ్రామానికి వెళ్తూ అడవిలో పులి వాత పడతాడు. తరువాత గుర్రం ఆ స్థలానికి అందరిని తీసుకెళ్తుంది. కోటయ్యను దేవుడుగా భావించి అక్కడ దేవాలయాన్ని నిర్మిస్తారు. యిదీ యిందులోని కథ.
మరో హాస్య కథ, పిల్లలకు కనువిప్పు కలిగించే కథ 'దోసిట్లో పేలాలు'. యిదీ సరదా అయిన కథ. పిల్లల అల్లరితో పాటు కనువిప్పు కలిగించే విధంగా ఎలా చేస్తోరో ఈ కథ తెలుపుతుంది. 'కొంటె పిల్లవాడు - ఎలుగుబంటి' కూడా యిలాంటి కథనే. శ్రీధిరాల గారికి అమ్మమ్మ చెప్పిన ప్రతి కథ ఏదో ఒక అంతర్నిగూఢమైన అంశాన్ని దృష్టిలో ఉంచుకుని చెప్పిందే తప్ప మరొకటి కాదు. విద్య వలన గౌరవం, సంస్కారం, నాగరికత వంటివి అలవడుతాయని, తద్వారా దేనినైనా సాధించవచ్చని చెప్పే కథ 'కారాకు - బీరాకు' కథ. యిందులో యిద్దరు గొర్లు కాసుకుని జీవించే అన్నతమ్ములు ఉంటారు. అందులో పెద్దవాడు బుద్ధిగా పనిచేసుకుని జీవించేవాడు. తమ్ముడు జులాయిగా తిరుగుతూ వెకిలి చేష్టలు చేసేవాడు. ఒకసారి గోల్కొండ నవాబు వ్యాహ్యాళికి మంత్రితో కలిసి వస్తాడు. దారిలో నవాబును తమ్ముడు చూసి, అతని గుర్రానికి అడ్డంగా వెళ్ళి వెకిలిగా నవ్వుతూ 'కూరాకు-కారాకు' అంటూ వెళతాడు. దానికి కోపగించిన నవాబు అతన్ని బంధించమని ఆజ్ఞాపిస్తాడు. మంత్రి వద్దని వారించగా, గట్టిగా బుద్ధి చెబితేనే ఇతరులకు బుద్ధి వస్తుందని చెబుతాడు. అంతలో అన్న వచ్చి తన తమ్ముని తప్పును కాచి క్షమించమని వేడుకుంటాడు. ఒక్కడ రచయిత చెప్పే విషయం ఆసక్తిని కలిగిస్తుంది. అతడు చదువుకోక పోవడం వల్ల ఎలా మాట్లాడాలో తెలియలేదని, అందుకు అతనిని వదిలివేయమని చెబుతాడు. రచయిత దీనిని ఆధారం చేసుకుని చదువు వల్ల కలిగే గొప్పతాన్ని వివరించేందుకు దీనిని ఉపయోగించుకోవడం బాగుంది. ఇదొక్కటే కాదు ప్రతి కథలో ఒక సామాజిక అంశాన్ని చెప్పడం ఈ గోదావరి తీర కథకుని టెక్నిక్. చక్కని కథలను అమ్మమ్మ యాదిలో అందించి వేలది మంది తనలాంటి మనవలు, మనవరాండ్లకు అందించిన శ్రీధిరాల వేంకటాచారికి అభినందనలు. జయహో! బాల సాహిత్యం...
- డా|| పత్తిపాక మోహన్,
9966229548