Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా. కె. దివాకరా చారి; 9391018972
'బతుకమ్మ' పండుగంటే
శిశిర, హేమంత ఋతువుల హేల
ప్రకృతిలో విరగ పూసిన
రంగు రంగుల పూల వసంత కేళి
బతుకమ్మ అంటే
సృష్టికి బ్రతుకును దానం చేసిన
బంగారు తల్లుల ఆనందపు
'ఉయ్యాల' పాట, ఆట
కాల ధర్మం ననుసరించి
పుడమి ఒడలంతా పచ్చదనం
విచ్చుకుని తన్మయత్వంతో
వయ్యారంగా ఒళ్ళు విరుచుకున్నా
నేడు కరోనా మహమ్మారి
కరాళ నృత్యానికి జడిసి
పూబోడులు గడప దాటకున్నారు
సుతారంగా దోసిళ్ళలో తమను తడిమే
సున్నితపు చేతులు తాకలేకున్నందుకు
విచ్చిన పువ్వులన్నీ విలపిస్తున్నాయి
కన్ను మిన్ను కానక
కన్నె మొగ్గలనూ తుంచి
అమానుషంగానలిపేసే
రాక్షసులకు జడిసి,
కామ మధాంధుల ‘కబంద‘
హస్తాలకు చిక్కి
మాన ప్రాణాలను పోగొట్టుకుంటూ
చితిలో కాలి బూడిదవుతున్న
నిర్భాగ్య స్త్రీ మూర్తుల రోదనకు,
తల్లడిల్లిన బ్రతుకుల్ని చూసి
'బతుకమ్మ' కంట కన్నీరు కాలువలై
నేడు కొత్త ' పుష్ప విలాపం ' గా
లోకమంతా ప్రతిధ్వనిస్తోంది