Authorization
Mon Jan 19, 2015 06:51 pm
• అయినంపూడి శ్రీలక్ష్మి, 99899 28562
“చెలిమి చెలమలు ఊరేదాకా, చెలిమి కలములు నిలిచేదాకా,
చెలిమి వెన్నెలలు కాసేదాకా, చెలిమి రాగములు ఒలికేదాకా,
మన్ను మిన్ను ఉండేదాకా, సూర్యుడు చంద్రుడు వెలిగేదాకా,
కాలచక్రము తిరిగే దాకా బతుకమ్మా బతుకు”
బతుకమ్మ అంటే అందరి నోళ్లల్లో నానే కాళోజీ కవిత ఇది. జాతులు తమ సంస్కృతితో అస్తిత్వాన్ని చాటుకుంటే, ప్రజలేమో పండగలతో తమ ఊపిరి ఉత్సవాలని ఉనికిలో చాటుతారు. అందుకే తెలంగాణ బతుకులోని ఆనంద పుష్పోత్సవాలని, చెరువుల్లో తేలిపోతూ కనిపించే సంస్కృతి తెప్పోత్సవాలని ఈ పండుగలో కనుల నిండుగా చూడవచ్చు.
తెలుగువారి బతుకమ్మల కమ్మని ముఖాల వెలుగు నింపు పూలు, మనసులున్న పూలు, తంగెడు పూలు-వాటి విశిష్టతని దశాబ్దాల క్రితమే తలకెత్తుకున్నారు కాళోజీ గారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ పతాకగా, అస్తిత్వపు ప్రతీకగా బతుకమ్మని అందరం కొలుస్తాం. మనిషి బతకడమే కాదు తోటి మనిషిని బతికించుకోవడం కూడా తెలిసుండాలన్న పరమార్థాన్ని, పర్యావరణ హితాన్ని, జీవన చైతన్యాన్ని అందించటమే బతుకు పండగ వైశిష్ఠ్యం.
నిజానికి అందరూ పూలతో దేవుణ్ణి అర్చిస్తారు. కానీ గడ్డిపూలని, పేద పూలని, పల్లె పూలని దేవతను చేసి జనాలందర్నీ సంఘటిత పరచి తమ మనస్సులోని ఆకాంక్షల్ని, కోర్కెల్ని పాటల ద్వారా తెలియపరచే నిజమైన బ్రతుకు పండుగ ఇదే. ఇలా బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనా ఉద్యమంలోనూ, ఆ తర్వాత బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక చిహ్నంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ పండుగ పూలకు, అందులోనూ తంగెడు పూలకు జేజేలు పలికి, అడవి పూలకు అగ్రశ్రేణి ప్రాధాన్యతను కట్టబెట్టింది. దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం తెలంగాణ ప్రభుత్వం తంగెడు పువ్వును రాష్ట్ర పుష్పంగా ప్రకటించి పల్లెపువ్వుకు పట్టాభిషేకం చేసింది. దీనిని అనుసరించి తంగెడు కథా వస్తువుగా వందల మంది కవులు తమ కవితా సృష్టి చేయడం విశేషం.
మామిడి హరికృష్ణ గారు ఓ మారు చెప్పినట్టు ‘కవిత్వం పూల రూపంలో ఉన్న బతుకమ్మ అయితే, బతుకమ్మ అక్షరాల ఆకారంలో ఉన్న కవిత్వం’గా భావిస్తూ తంగేడు కవితాంశంగా వెలువడ్డ సమకాలీన కవుల కవిత్వాల్ని ఒకసారి పరిశీలిద్దాం.
తెలంగాణ రాష్ట్ర కాళోజీ పురస్కార తొలి గ్రహీత డా. అమ్మంగి వేణుగోపాల్ ‘ఒక్కొక పూమొగ్గ నూటొక్క పసుపు వనం, నూటొక్క పూలు వేల తాంబాలాల నిండుదనం’గా వర్ణిస్తారు. ‘తంగెడు పువ్వా తుమ్మెదలెన్నింటికో పాలిచ్చి పంపితివి, పాలు తాగి రొమ్ము గుద్దినాడు వాడు’ అంటారు డా. ఆర్. కమల బతికిన చీకటి రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటారు.
‘తంగెడు పూలు బంగరి బతుకమ్మల పూలు, తాంబాలాల నిండా పేర్చే తల్లి గౌరమ్మ పూలు’ అని అన్నవరం దేవేందర్ ప్రస్తుతిస్తే, ‘నెత్తినెత్తుకొని ఊరేగించిన తల్లుల కడుపులు పండాలి, సత్తుపిండి పంచినోళ్ళ ఇండ్లల్ల ధాన్యపు రాసులు నిండాలి’ అంటూ బండారి రాజ్ కుమార్ అక్షరాల అక్షింతలు వేసి దీవించారు. చిందం ఆశన్న ‘నీ పూ గుత్తులు బతుకమ్మ మెడలో కట్టిన పుస్తెలు’ అంటూ సరికొత్త ఆలోచనకు తెరతీసారు.
‘నా బాల్యపు పూదోటని రంగురంగుల పుష్పాలుగా మార్చింది నువ్వేకదా, నిన్ను సాగనంపి ఇంటికొస్తుంటే తండ్రి హృదయమే కాళ్ళు బరువౌతాయి’ అన్న సిహెచ్. ఉషారాణి లాగా బ్రతుకు జ్ఞాపకాన్ని పంచుకునేవారు ఎందరో ఉన్నారు.
ఈ ఆశ్వయుజ కాలంలో ప్రకృతి నవ్వుని పచ్చ పచ్చగా అక్షరబద్ధం చేస్తూ డా. దేవరాజు మహారాజు ‘ఇయ్యాల పచ్చదనం పుట్టినరోజు, రైతు కండ్లల్లో సంతోషపు కేరింతలు కనిపించిన రోజు’ అంటుంటే, ‘చెట్లు పిట్టల దుప్పట్లు తియ్యనే లేదు, చెరువు కమలం పెదవులతో నవ్వనే లేదు, మేం మాత్రం తంగెడు పూల మీద మంచు చుక్కల్ని తుడిచే వేకువ తుమ్మెదలు అయ్యేవాళ్లం, పండుగ అక్కలకు బదులు మాకే రెండు వారాలు ముందొచ్చే’దంటూ డా. ఏనుగు నరసింహారెడ్డి అభివర్ణిస్తే, ‘నది మధ్యలో రాత్రి వీడ్కోలు తీసుకొనే బతుకమ్మలు, నెత్తిన దీపాలు పెట్టుకున్న బాతులుగా కదిలిపోయేవి, తల్లి బతుకమ్మ తెలంగాణ బ్రతుకులు మార్చిన పూలవాన’ అంటూ బతుకమ్మ పొద్దుల్లో పల్లె దేహాలన్నీ తాళపు చప్పుళ్ళవుతూ వీడ్కోలు పలికినప్పుడు ఎలా ఉంటుందో ఆత్మగీతంతో ఆలోచింపజేశారు డా. కాంచనపల్లి.
గుడుపల్లి నిరంజన్ ఓ కొత్త ఆలోచనని మనలో రేకెత్తిస్తారు – ‘కులానికో దేవతున్న ఈ దేశంలో పూల దేవతైన బతుకమ్మ ఇంకా వెలివాడలనే ఆవాహన చేసుకోవాల్సి ఉందం’టారు. ‘కవిత తలపై జాగృతమైన బతుకమ్మ, సిగలో తంగెడు నవ్వుతో ఏలె లక్ష్మణ్ కుంచె కన్యగా కనిపించడమే నేటి ఫ్యాషన్’ అంటూ ఆధునిక బతుకమ్మ చిత్రాన్ని మన కళ్ల ముందు కవితగా గీసి చూపిస్తారు జి. నరసింహ స్వామి.
హలావత్ సీత్లా నాయక్ ‘శుభాలకు సూచికగా, త్యాగాలకు గుర్తుగా, స్వరాష్ట్ర చరిత నిర్మాణానికి బతుకు నేర్పిన పువ్వుగా భవిత నింపిన పువ్వు’గా దండం పెడితే, ‘ఒళ్ళంత బంగారమై మట్టి సింహాసనంపై మహారాణిలా వెలుగొందుతుందని’ కవితా సంతకం చేస్తారు కందుకూరి శ్రీరాములు.
కందాళై రాఘవాచార్య మరో అడుగు ముందుకేసి ‘రాష్ట్రం వచ్చాక రాచరికం వచ్చింది, అడవిల ఎందుకు పెరట్ల నాటి అమ్మవారికి తంగెడు పూలు రోజూ పెడదాం’ అంటారు. అత్యాచార భారతావనిని గుర్తుచేసుకుంటూ కోడూరి విజయ్ కుమార్ ‘పురుషుల అపరిమిత ఆకలి నుండి లోకాన్ని రక్షించేందుకు స్త్రీలకు చల్లని బ్రతుకునివ్వ’మంటూ వేడుకుంటారు.
కొండి మల్లారెడ్డి ‘గడ్డిపూలు గౌరమ్మలై పూజలందుకుంటాయ్, ఆకాశం చెరువులో ప్రతిబింబిస్తది, చుక్కలన్నీ బతుకమ్మ లౌతాయ్, పూల జాతర సాగి చెరువు కట్టు పూల సింగిడై వెలుస్తుంది’ అంటుంటే, ‘ఈ గడ్డ మీద ఇప్పుడు వీస్తోంది నీ బంగారు నవ్వే, నీ స్వేచ్ఛా కాంతులే’ అని కీర్తిస్తారు కోట్ల వేంకటేశ్వర రెడ్డి.
మామిడి హరికృష్ణ ‘తంగెడు పువ్వు అనంగనే తెలంగాణ మట్టి పువ్వై మెరుస్తది, తెలంగాణ ఆత్మ నిలబడి గెలుస్తది’ అంటారు. మహమ్మద్ వలీ హుసేన్ ‘మనసు మసకేసినప్పుడు తంగెడు పూల కొమ్మ గాలికి ఊగుతూ తనలా విచ్చుకుని నవ్వుకో’మంటూ ఒక సోయందాల సూచికను విసురుతారు.
వనపట్ల సుబ్బయ్య ‘ప్రకృతి వికాసం, అస్తిత్వ పోరు పతాకం, బ్రతుకు పోరాటానికి చైతన్య కెరటం తంగెడు’ అంటూ, ‘తలమీద తాంబాలం నిండా పూల పర్వతం, బతుకమ్మకు ప్రతిరూపం, తెలంగాణ తల్లికి పసిడి కిరీటం’ అంటారు. అయినంపూడి శ్రీలక్ష్మి – తంగెడు అంటే మా అమ్మ పుస్తెలకున్న పచ్చదనం. నా చెల్లి చెంపల కంటిన పుప్పొడి గంధం. బతుకుల్ని పండించిన వెన్నెల సంతకం – అంటూ ‘బతుకమ్మంటే తరతరాల గోసకు ఆఖరి చరణంగా, కొత్త ఉదయానికి మొదటి కిరణంగా, రాళ్ళ నేల నుండి మొలిచిన పచ్చ బొట్టుగా, పోరాడి గెలిచిన ఆత్మ గౌరవ తలకట్టుగా అభివర్ణించారు. ‘వాడిపోని ఈ పుత్తడి పూవు పున్నమి తల్లి కొప్పుల నగిషీ చెక్కిన నగ’ అంటారు నాంపల్లి సుజాత.
బతుకమ్మ నవరాత్రుల్లో తెలంగాణ లోని ఏ ఊరు చూసినా ఇకబెనా లాగే కనిపిస్తూ మురిపిస్తూ ఉంటుంది. దాన్ని గుర్తు చేస్తూ నామాని సుజనాదేవి ‘ఈ పొద్దు ఏ సందు చూసినా, ఏ ఊరు చూసినా, తెలంగాణ అంతా ఒకే కుటుంబం లెక్క మెరిసిపోతుం’దంటారు.
‘ఇది నెత్తిన పెట్టుకునే పువ్వు కాదు, నెత్తి కెత్తుకునే పువ్వు, దేవుండ్లకు పెట్టే పువ్వు కాదు, తానే దేవతైన పువ్వు, ఇది కార్ఖానాలో తయారైన యంత్రపుష్పం కాదు. ఆరుకోట్ల మంది ఆరుగాలం జపించిన మంత్రపుష్పం’ అంటారు నెల్లుట్ల రమాదేవి. అందుకే కాబోలు రేడియం ‘ఎన్ని పువ్వులున్నా నీవు లేని పల్లె లేదు. ఎన్ని పాటలున్నా నీవులేని పల్లె పదం లేదు’ అంటారు. ‘అడవిల పుట్టి, అడవిల మెరిసి, మా ఇంటకొచ్చి మా కడుపున పూరిచ్చిన ఆడబిడ్డవు నీవు, మా బతుకు బతుకున ఊపు ఉయ్యాల నువ్వు’ అంటారు తైదల అంజయ్య.
‘కాలిబాటల్లో ఇరువైపులా సైనిక దళం తీర్గ, చాతి తలాయించి నిలువగల తెగువే తంగేడు, ఆపాదమస్తకం అతిశయించే పవిత్ర తెలంగాణ తపనే తంగేడు’ అంటారు వేణు సంకోజు. ‘తీరొక్క కులాల ఇంతుల పూబంతులను ఎంగిలి పూల అమావాస్యతో ఏకం చేసి, తొమ్మిది రోజుల సరదాలతో ఏకం చేసి ఆలపించే సమైక్యతాగీతాన్ని వీరుల త్యాగాలతో స్మరించే రాగాలతో ఆడి పాడేటి వేడుకోలును’ అంటారు వురిమళ్ళ సునంద.
‘పవిత్ర, సుచిత్ర చరిత్ర చెప్పే పరిమళించే సువర్ణ పుటల తంగేడు పుస్తకమే నా తెలంగాణ’ అంటారు వి.పి. చందన్ రావ్. ‘రెక్కల కట్టమే దిక్కైన సెమట సూరుకు కోలాట కొప్పుల్లా అల్లుకుపోయే పల్లెపదం, ఈ నేలపై పెరిగిన తంగేడే తల్లి తలపై బంగారు కిరీటం, బతుకు దండెం మీద కైతుకాల్ని ఆరేసుకునే సంబురం’ అంటారు పొన్నాల బాలయ్య. ‘బతుకమ్మంటే పువ్వుల నవ్వుల పరిమళాలతో కొలువుతీరే బతుకు పాట, బతుకు ఊసుల రంగవల్లులకు రూపమిచ్చిన దీపిక’ అంటారు వల్లభాపురం జనార్దన.
ఇలా సమాకాలీన కవులు తంగేడు పువ్వును కేవలం పువ్వుగా చూసే ఆలోచనకి పరిమితం కాకుండా పల్లె జీవితంగా, బాల్య జ్ఞాపకంగా, సామూహిక చేతనగా, సంఘటిత స్ఫూర్తిగా, వేడుకగా, విప్లవంగా, వేదనగా, గోసగా, ఆత్మ శ్వాసగా, తిరుగుబాటుగా, సానుభూతిగా, తదనుభూతిగా, నిస్సహాయతగా, ఆశగా, ఆకాంక్షగా, ఆత్మగౌరవంగా, అస్తిత్వంగా, నోస్టాల్జియా గా, మానవ సంబంధాల పునాదిగా, రకరకాల కోణాలలో దర్శించారు. తంగేడు పూలు తెలంగాణ ప్రజల జీవితంలో మమేకమైన తీరును అంతర్భాగమై అంతరంగాలను ప్రభావితం చేసిన ప్రేమను అత్యంత సంవేదనతో సృజనాత్మకంగా వ్యక్తీకరించారు.
అందుకే ఒక్క తంగేడు తెలుగు కవిత్వంలో తీరొక్క ఆలోచనలకు స్ఫూర్తి నిచ్చింది. తీరొక్క భావాల సృష్టికి అక్షర నీరాజనాలని అందించింది.