Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్ అయినా
క్లాస్ అయినా
ఆ కలానికి సిరాలా మారి గాయక గొంతు నుంచి జీవనదిలా ప్రవహించి శ్రోతల వీనులకి ప్రాణం పొయ్యాల్సిందే..
ఆర్తి..భక్తి..సమపాళ్ళ మేళవించిన
అపర అన్నమయ్య..
రాయంచలు..రామచిలుకలు
కోయిలలు..మైనాలు..
కీరవాణిలను పదాల్లో కొలువుదీర్చిన భావుకత్వ సార్వభౌముడు..
హిమగిరి ఒడిలో పుట్టిన పుంభావసరస్వతి..
మాతృభాషకు పట్టంకట్టిన అక్షర విన్యాసాలు,
పద సంపదలు, శ్లేషలు, గమకాలు, అలంకారాలు, హొయలు, భావ వైచిత్రాలు..అక్షరాల్లో పొదగగల సాహితీశిల్పి ..
తెలుగు జిలుగు సొబగులు పాటకు అద్ది..
అనంత భావ తూణీరాలను కలంతో సంధించగల అక్షర సవ్యచాచి..
ధవళవర్ణ వెన్నెల వెలుగులా..
తెలుగు సాహిత్యంలో కొన్ని వేల పాటలు సృజియించి..
సరికొత్త రీతిన..సినీ జగత్తును
మత్తులో..గమ్మత్తులో ఓలలాడించిన చమత్కార గీత రచయిత..
పెదాలపై సులువుగా పల్లవించే పదాలు..
గంభీర నాద ధ్వనులు..రెంటినీ
ఒకేసారి పలికించిన..
భావబ్రహ్మ,
నవరస భావాలను సమ్మిళితం చేసిన గానసౌందర్యోపాసకుడు..
పేరులో సుందరత్వం..
మోములో ప్రశాంత మూర్తిమత్వం..
తేనెలూరు తెలుగు పాటల అచ్చతెనుగు చిరునామా
గీతఝరి..వేటూరి..!
- సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.