Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉగాది అంటే వసంత కాలానికి స్వాగతం పలికే కోయిల రాగాలు లాంటిది. ఉగాది రాగానే చెట్లకు పువ్వులు పూస్తాయి. ఉగాదికి స్వాగతం పలుకుతాయి. అన్ని బంధాలను గుర్తుచేస్తూ గుండెల్లో ఆనందాన్ని నింపే గొప్ప సంబరమిది. ఈ సంబరాన్ని చాంద్రమానాన్ని అనుసరించి తెలుగువారు కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా జరుపుకొంటారు. ఉగాది రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని తెలుగు వారి నమ్మకం. ఉగాదిని యుగ ఆది అని కూడా అంటారు. అదే కాలక్రమేణా ఉగాదిగా మారింది. ఈ ఉగాది పండుగ జరుపుకోవడం వెనుక ఒక పురాణ గాధ కూడా ఉంది. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద నుంచి వేదాలు దొంగిలించి సముద్రంలో దాక్కున్నప్పుడు విష్ణుమూర్తి మత్స్య అవతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిoది కూడా చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే. వేదాలను పొందిన బ్రహ్మ ఆరోజు నుంచి సృష్టి చేయడం ప్రారంభించాడు. వేదాలను దొంగలించిన సోమకాసురుని వధించి మత్స్యావతారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభ తరుణాన్ని పురస్కరించుకొని విష్ణువు అభీష్టం మేరకు ఉగాది ఆచరణలోకి వచ్చిందని మాబామ్మ చెప్పింది. చైత్ర శుద్ధ పాడ్యమినాడు బ్రహ్మదేవుడు ఈ విశాల విశ్వాన్ని సృష్టించాడు. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని ప్రతీది.
ఇది కాల ప్రమాణంలో సంవత్సర కాలానికి ప్రారంభమైన అంశం. ఈ ప్రారంభాన్ని తెలుగువారంతా చక్కని పండుగగా ఆచరిస్తారు. ఆ రోజున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వసంత ఆగమ నోత్సవ వేడుకలను నిర్వహించే ఈ ఉత్తమోత్తమమైన రోజున ఎన్నో శుభ సూచకాలు కావాలని కోరుకుంటారు. సుభాన్ని సూచించే ఈ పండుగను మనమే కాకుండా మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, అస్సాం రాష్ట్రాలలో కూడా ఘనంగా జరుపుకుంటారు. మనం చాంద్రమానాన్ని అనుసరించి ఈ పండుగని చేసుకుంటాo. కొన్ని రాష్ట్రాల్లో సౌరమానం ప్రకారం జరుపుకుంటారు. ఈ పండుగను పంజాబ్ లో 'వైశాఖీ' అని కేరళలో 'కొల్ల వర్షం' అని అస్సాంలో 'మేఘ' అని, మహారాష్ట్రలో 'ముడిపదవ' అని పిలుస్తారు. ఈ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు శుభ్ర పరుచుకొని రంగవల్లులతో అలంకరిస్తారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఈ ఉగాది నాడు తప్పనిసరిగా నిర్వహించే ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి.
ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకతతో కూడిన షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగు వారికి ప్రత్యేకం. ఇందులో ఆ సంవత్సరపు వేపపువ్వు, బెల్లం, చింతపండు, మామిడికాయ కారం, ఉప్పు ఇలా ఆరు రుచుల సమ్మేళనం తో కూడిన ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకo. వీటిల్లో తీపి సంతోషానికి మారుపేరు. చింతపండు పులుపుతో కూడి ఆరోగ్యానికి మంచిది. చేదు అంటే చేదు అనుభవాన్ని వేప పువ్వుతో తీసుకొని ఈ సంవత్సరమంతా కూడా మనకి చేదు అనుభవాలు ఎదురైనప్పుడు వాటిని స్వీకరిస్తామని అర్థం. కారం అంటే ఘాటు. ఘాటైన విమర్శలను ఎదుర్కొంటారు, ఘాటైన మాటలు మాట్లాడారని అంటుంటాం. ఉప్పు ఆరోగ్యానికి సంబంధించినది, మరియు తెల్లని వర్ణం కలిగి ఉంది కాబట్టి మన జీవితంలో కూడా తెల్లని వర్ణం ఎంత స్వచ్ఛమైనదో మనందరికీ తెలుసు. వగరు మామిడి పిందెల నుంచి వస్తుంది. మనo ప్రతి అడుగును ఈ అద్భుతమైన పచ్చడితో అనుసంధానం చేసి ఈ పచ్చడిని ఉగాది రోజున తీసుకుంటారు. అంటే మళ్లీ సంవత్సరం దాకా వీటన్నింటినీ సమానంగా స్వీకరిస్తూ వీటితో అన్వయమై మనమంతా ఉంటామని చెప్పడమే ఈ ఉగాది సారాంశం. అలాగే మనం రోజూ ఉదయాన్నే వేప చిగుళ్లు తింటే సంవత్సరం మొత్తం అనేక వ్యాధుల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తాం.
ఈ ఉగాది రోజు సంవత్సరం లో జరిగే ముఖ్యమైన, అద్భుతమైన సంఘటనలు జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా వివరించే పంచాంగ శ్రవణం చేస్తాం. ఈ పంచాంగ శ్రవణం చేయడం అందరికీ ఎంతో శుభదాయకం. ముందుగా పంచాంగాన్ని పూజామందిరంలో పెట్టి పూజ చేస్తారు. పంచాంగం అంటే అయిదు అంగములు కలిగినది అని అర్థం. ఈ "తిధి,వారము, నక్షత్రము, కరణము, యోగము" వీటన్నింటి కలయికే పంచాంగము. ఈ పంచాంగం లో ఒక సంవత్సర కాలం ప్రమాణం చేసుకొని ఆ కాలమునందు గ్రహములు ఎలా కదులుతున్నాయో , ఆ గ్రహములు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో దాని చేత ఆయన క్షత్ర పాదాల యందు జన్మించిన జాతకులు పొందబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాలు ఈ పంచాంగం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా ఆదాయ, కందాయ వివరాలు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా వివరంగా పండితులు ఈ పంచాంగంలో పొందుపరుస్తారు. పంచాంగాన్ని అందరూ చదువుకుంటే ఆ సంవత్సరాన్ని ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే సంవత్సర సంబంధమైన అంశాలలో ముందు జాగ్రత్త కోసం ప్రయత్నం చేస్తున్నట్లే వర్షాలు పడే విధానం, పంటలు పండే విధానం ఇలా ప్రతి అంశానికి సంబంధించిన విశేషాలు సంవత్సర ప్రారంభం రోజున తెలుసుకోవడం ద్వారా ఆ సంవత్సరంలో మనమంతా ఎలా మెలగాలో నిర్ణయించుకోవడానికి చక్కని మార్గదర్శకం ఈ పంచాంగ శ్రవణం. ఇంకా చెప్పాలంటే ఆకాశంలోని సూర్య చంద్రుల గమనాన్ని కూడా తెలిపే ఒక విజ్ఞాన సర్వస్వం ఈ పంచాంగం.
ఇలా ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ ఉగాదిని ఒక్కో సంవత్సరం ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. ఆ పేర్లు ఎలా వచ్చాయి అంటే శ్రీకృష్ణునికి పదహారు వేల వంద మంది భార్యలలో "సుదీపని" అనే రాజకుమారికి అరవైమంది సంతానం. వీరి పేర్లనే తెలుగు సంవత్సరాలకి పెట్టారని పెద్దలు చెబుతుంటారు. మరో కథనం ప్రకారం విష్ణుమూర్తి కారణంగా నారదునికి జన్మించిన 60 మంది సంతానమే ఈ తెలుగు సంవత్సరాలు అని చెప్తారు. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయి అని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో ప్రతి యుగానికి ఇవే పేర్లు వస్తున్నాయి. ఈ ఏడాది ఉగాది పేరు "ప్లవ నామ సంవత్సరం". ఈ రోజుతో ప్రారంభమయ్యే ప్లవ నామ సంవత్సరం అందరికీ మంచి జీవితాన్ని ఇవ్వాలని, ఈ కరోనా మహమ్మారి భారీ నుండి అందరూ బయటపడి సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని అష్టైశ్వర్యాలతో నవ్వుతూ, తుళ్ళుతూ, కేరింతలు కొడుతూ తిమిరాన్ని పారద్రోలే ఉషోదయంలా, చిగురాకుల ఊయలలో నవరాగాలు కోయిలలా అడుగిడుతున్న ఈ ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం సుస్వాగతం.
- పింగళి భాగ్యలక్ష్మి,
కాలమిస్టు రచయిత్రి,
గుంటూరు,
9794725609