Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజమే ఈ ఉగాది అచ్చమైన
'ప్లవ' నామ తెలుగువత్సరమే !
కనీ వినీ ఎరుగని ఓ మహా
ప్రళయాన్ని మానవాళికి
రుచి చూపించి మనిషి మాత్రమే
శాశ్వతమని చాటి చెప్పి గొప్పజీవితసత్యాన్ని లిఖించిన
గత అంధకార 'శార్వరి'* నీడల
మధ్య ఇంకాతల్లడిల్లుతున్నమనం
కొత్త వత్సరాన్ని భయాల కౌగిట్లో
బెరుకుగానే ఆహ్వానించక తప్పదు!
రెండవతరంక్రిమి వేగంగావ్యాపిస్తూ
కాటువేస్తూ కల్లోలపరుస్తూ
లోకమంతా మహమ్మారి గుప్పిట
విచలితమై పోతున్నప్పుడు
'వాక్సిన్' పేరిట మనకై స్వాంతన మూటకట్టుకొని
రేపటి వెలుగులను షడ్రుచులతో పంచేందుకు
చడీచప్పుడు చేయకుండా వస్తున్న
' ప్లవ ' నామ యుగాది కి
ఏమని స్వాగతం పలుకుదాం ?
మనసులు మూగై
బ్రతుకులో తీపి అడుగంటి
మనుషులు మోడై
ఉత్సాహం కనుమరుగై
కోయిలల కుహు రాగాలు
మామిడి, చింత లేచిగురులు
మత్తెక్కించలేని దీన గతిలో
బ్రతుకు బరువెక్కి భారంగా
ఇంటిల్లిపాదీ ఇంటికే
బంధీలైన అయోమయ స్థితిలో
రోజులు 'ఖర్చు 'చేస్తున్న మనిషికి
'పండగ' కాలెండర్ కే పరిమితమై
ఈ విపత్తు దాటేసేందుకు
వారథిలా ‘ ప్లవ '* ఉగాది వచ్చిందని ఆశపడుతున్న జనానికి..
మానవుడే అజేయుడని
మానవతే అమరమని
తిథి ననుసరించి కాదు
విధి ననుసరించి కాదు
నిజమైన పండుగలు
ప్రజల హృది ననుసరించి వచ్చేదే
సిసలైన 'ఉగాది' పండుగని
కొత్త ఊపిరులతో కొంగ్రొత్త సుందర
భవితను సృష్టించుకుందాం !
(* ప్లవ అంటే దాటటం, శార్వరి అర్థం దుఃఖం లేదా చీకటి )
- డా.కె.దివాకరా చారి
9391018972