Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతనెప్పుడు చనిపోడు
చస్తూ బతుకుతుంటాడు
తన బతుకునెప్పుడూ కాగడాచేసి
వ్యవ'సాయం' కోసం దగ్దమవుతుంటాడు
పంట చేతికి రాక
పండిన పంటకు మద్దతు లేక
ఉరితాడుని ఊయల చేసి
మరణంలో జీవించే ఉంటాడు
ఎర్రటి ఎండలో
మండే గుండెతో
కాలే కడుపుతో
నీరు లేక ఎండిపోతున్న పొలాన్ని
కన్నీరుతో తడిపి సేద్యం చేస్తుంటాడు
బుక్కెడు బువ్వను దాచుకోకుండా
పంచుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ పుడుతుంటాడు
అతనికి మాటలు రావు
మభ్యపెట్టి ఓట్లడగడం
కొల్లగొట్టి కోట్లు దాచడం రాదు
మూగవాడేం కాదు
మాట్లాడే హక్కుందని తెలీకా కాదు
సమయం వస్తే వరి కంకులతో
మాట్లాడగలడు
కొడవలితో మాట్లాడించగలడు
రహస్యమేం లేదు
రాయి రాజుని చేయగలడు
పొలం గట్టు పూలపాన్పు తనకు
నాట్లు వేయడం తప్ప
నోట్లతో బేరం చేసి
బ్యాంకులను లూటీ చేసి
ప్లయిట్లలో విదేశాలకెగిరెళ్లడం తెలియదు
చెమటతో తడిచిన తన శరీరాన్ని
మట్టితో కలిపి పుడమితో
రహస్య సంభాషణలు రచించగలడు
నేలని తనువు చేసుకుని
తానే నేలలా మారిపోగలడు
ఆకాశం
అడవి
చెట్టూ
పశువూ
పక్షి
ఏరు నీరు ఏది మారదు
నువ్ రాజువన్న నోర్లు
అంగట్లో సరుకులా
నిన్ను బేరం పెడతాయి
పొలంమీద దాడి చేసే
అడవి పందుల్లా
ఆటవిక చట్టాలు
ఉన్నోడి చుట్టాలై
ఈ నేలపై
నువ్వు కనే నీ కలలపై
హక్కు నీది కాదంటాయి
మట్టితో నీ బంధాన్ని ప్రశ్నిస్తూ
దౌర్జన్యకాండ సాగుతుంది
గల్లీ నుండి ఢిల్లీ దాకా
జనమందరు గళమెత్తినా
కవులందరు కలమెత్తినా ఒరిగేదేముంటుంది
అడుగడుగునా ఆంక్షలు తప్ప
కలల్ని ఖండాలుగా నరికేస్తూ
తెగిపడిన కలల్ని
ప్రభుత్వమే ప్రయివేటికరిస్తుంటే
ప్రజా ఆస్తుల వేలం కొనసాగుతుంటే
ఇక మిగిలేదేముంటుంది
బూడిదతప్ప....
సహనం నశించిన వేళ
చేసేదేముంటుంది
అధికార మదాన్ని
నేలకు దించేయడం తప్ప
- వేణుమాధవ్
9666851844