Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మ.. మన పుట్టుకకు చిరునామా... మన బతుకుకు వీలునామా. అమ్మ గొప్పతనం, ఆమె త్యాగం అజరామరం. ఆమె సహనం అనంతం. అమ్మ ఉంటే మనకో భద్రత, భరోసా. అమ్మ ఒడికన్న ప్రశాంతమైన ప్రదేశం బహుశా ఎక్కడా ఉండదేమో. అందుకే అనేక మంది కవులు, రచయితలు అమ్మ మీద పాటలల్లారు. పద్యాలు రాశారు. అమ్మకు మించిన దైవమున్నదా... అంటూ చేతులెత్తి మొక్కారు. అమ్మా.. అమ్మా.. మాయమ్మా... అంటూ వేనోళ్లా కీర్తించారు. ఇదే క్రమంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని (ఆదివారం) పురస్కరించుకుని పలువురు మహిళలు, ఉద్యోగినులు, చిన్నారులు అమ్మ మీద తమకున్న ప్రేమను వ్యక్త పరిచారు. ఆమెకు అక్షర నీరాజనాలు పలికారు. వారి హృదయావిష్కరణను నవతెలంగాణతో పంచుకున్నారిలా...
అమ్మ అనే పదం ప్రకృతిలో అత్యంత అమృతతుల్యం. సృష్టిలోని ప్రతి జీవికి అమ్మే ప్రాణాధారం. అమ్మ బిడ్డను తొమ్మిది నెలలు మోసి ప్రసవ × బాధను పంటి బిగుతో భరిస్తూ తన బిడ్డను చూశాక ఆ బాధలన్నీ మర్చిపోతుంది. బిడ్డకు తల్లిగా, గురువుగా, నడవడికను నేర్పే మార్గదర్శిగా, ప్రపంచాన్ని పరిచయం చేసే గైడ్ గా, ఆత్మీయతను పంచుకునే స్నేహితురాలిగా, తన బిడ్డ పరిపూర్ణ వ్యక్తిత్వం, అభివృద్ధి కోసం తాను కొవ్వొత్తిలా కరిగిపోతుంది. బిడ్డ ఎదుగుదల లో తన ఆనందాన్ని చూస్తూ గడిపేస్తుంది తన బిడ్డ ఉన్నత స్థాయికి ఎదిగిన, ఎంత గొప్పవాడైనా తన దృష్టిలో ఏమీ తెలియని బాలుడిలా భావించి తన వయో భారాన్ని కూడా లెక్కించక బిడ్డకై ఆరాటపడుతుంది. తాను జీవించినంత కాలం తన బిడ్డల ఉన్నతిని కాంక్షిస్తూ తల్లి హృదయాన్ని చాటుకుంటుంది. నా ఉన్నతికి సదా శ్రమించి నేటికీ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్న నా మాతృమూర్తికి అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. నేడు ఈ సృష్టి యొక్క వికాసానికి, ప్రతి జీవి ఔన్నత్యానికి మూల కారణం అయినా అమ్మలందరికీ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు...
శ్రీమతి సరికొండ. పావని,
ప్రభుత్వ ఉపాధ్యాయిని, ఖమ్మం
ప్రపంచానికి నిన్ను , నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది అమ్మ . జీవితంలో మనకు ఎవరు తోడు ఉన్నా , లేకపోయినా మన వెన్నంటే ఉండి మనల్ని ముందుకు నడిపించే శక్తి అమ్మ... మనకు ప్రేమంటే ఏంటో తెలియని వయస్సు నుండి ప్రేమను పరిచయం చేస్తుంది అమ్మ..
అమ్మ నేర్పించని విషయం అంటూ ఏదీ లేదు.. జీవితంలో ఏదో ఒక దశలో ఓటమిని చూస్తాం . చదువు ,జాబ్ , ప్రేమ వీటిల్లో ఓడిపోయినప్పుడు , కొంతమంది జాలి చూపిస్తారు .ఇంకొంత మంది వెక్కిరిస్తూ ఉంటారు. కొంతమంది ఫిలాసఫీ చెబుతుంటారు . కానీ అమ్మ మాత్రం తన మాటలతో నీలో ఉత్సాహాన్ని పెంచుతుంది . పరీక్ష లో ఫెయిల్ అయితే ఈసారి బాగా రాస్తావు లే , అని , ఇంటర్వ్యూ లో సెలెక్ట్ కాకపోతే దీని కంటే బెటర్ కంపెనీ నీ కోసం ఎదురు చూస్తుందో ఏమో అని లవర్ తో బ్రేకప్ అయితే పోనీలే వాళ్లకు నీతో ఉంటే అదృష్టం లేదులే అంటూ నీలో పాజిటివిటిని పెంచి ,జీవితం మీద ఆశ కలిగిస్తుంది . అప్పుడప్పుడు లేట్ నైట్ ఆకలి వేస్తే ఫుడ్ ఆర్డర్ చేసుకొనే పరిస్థితి వస్తుంది. కానీ కొన్నసార్లు ఆర్డర్ చేద్దామని చూస్తుంటే టైం అయిపోయింది .ఈ టైం లో డెలివరీ చేయలేం అంటూ ఉంటారు . కానీ అర్ధరాత్రి అయినా ఆకలి వేస్తుంది అమ్మ అని ఒక్కమాట అంటే చాలు తన క్రియేటివిటీ ని ఉపయోగించి ఏదో ఒక వంటకం తయారు చేసి ఆకలి తీరుస్తుంది . చాలామంది ఏదైనా పని చేయాలంటే లేజినేస్ చూపిస్తారు . ఇవాల్టి పనిని రేపటికి , రేపటి పని ఎల్లుండికి ఇలా రోజు వాయిదా వేస్తారు . కానీ అమ్మకు ఎప్పుడైనా శుభ్రంగా లేని గది కనిపించిందంటే వెంటనే శుభ్రం చేస్తుంది .ఇక్కడ నువ్వు చేసే పనిలో ఆక్టివ్ గా ఉండాలి , లేజీనేస్ ను దూరం చేయాలని నేర్పిస్తుంది అమ్మ. కాలేజీ కి లేట్ అయిన పర్వాలేదు , అయినా అక్కడ కొంపలు మునిగిపోయేది ఏమీ లేదులే అని అనుకుంటారు .కానీ ఎప్పుడైనా అమ్మను గమనించారా ! ఇంట్లో అందరికన్నా ముందు నిద్రలేచి , నాన్న టైం కి ఆఫీస్ కి వెళ్ళేలా , పిల్లల టైం కి స్కూల్ కి , కాలేజీకి వెళ్ళేలా బ్రేక్ఫాస్ట్ , లంచ్ తయారు చేస్తుంది .ఈ విధంగా మనకు డిటర్మినేషన్ అంటే ఎలా ఉండాలో నేర్పిస్తుంది అమ్మ. ఒక శిశువు తన మొదటి అడుగు ఎప్పుడు వేస్తారు అని ఎంతో ఓపికగా ఎదురు చూస్తుంది . మన జీవితంలో ఎటువంటి సక్సెస్ అయినా అంత ఈజీగా రాదు. కొన్ని విషయాలకు సమయం పడుతుంది .అటువంటి క్షణాల్లో నీలో ఓపిక , ఎదురుచూపు ఉండాలని చెప్తుంది అమ్మ .. సడెన్ గా ఇంట్లో రిలేటివ్స్ వచ్చిన , ఫ్రెండ్స్ వచ్చిన వాళ్లకు మంచి భోజనం ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది . ఇలా చేస్తూ , లైఫ్ లో ఊహించని సంఘటనలు ఎదురైతే వాటికి సిద్ధంగా ఉండాలని చెబుతుంది అమ్మ . లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు తెలిసో తెలియకో అమ్మతో గొడవ పడుతుంటారు.,అలుగుతారు ,కానీ ఆ అలక అమ్మలో ఉండదు. అంత మర్చిపోయి మామూలుగా మాట్లాడేస్తుంది .నీ లైఫ్ లో ఎప్పుడైనా సరే ఎవరితోనైనా సరే మనస్పర్ధలు వస్తే వాటిని వెంటనే మర్చిపోయి సౌమ్యంగా ఉండాలి అని చెప్తుంది అమ్మ . ఇలా అమ్మ మనకు నేర్పించే విషయాలు ఎన్నో , అవన్నీ వర్ణనాతీతం . ప్రపంచంలో అందరూ ఒక్కొక్క మాట చెప్పినా తక్కువే అనిపిస్తుంది . అందుకే మాతృదేవోభవ అంటారు . ఏది ఏమైనా అమ్మ ప్రేమను గుర్తించడం మన బాధ్యత . అమ్మ ప్రేమను గుర్తు చేసుకుంటూ ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు...
శ్రీమతి తంగెళ్ల వెంకట చంద్ర,
మాజీ సర్పంచ్, శ్రీనివాసపురం, సూర్యాపేట జిల్లా
ఆ దృశ్యం..... ఇంకా నా కండ్ల ముందు కదలాడుతున్నది. ఆ మధ్య ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడకు ఫైర్ ఇంజిన్ వచ్చింది. ఆ మంటల దగ్గర ఒక కోడి నిశ్చలంగా కూర్చుని ఉంది. ఫైర్ మ్యాన్ మంటరార్పే క్రమంలో దాన్ని కదిలించి చూశాడు. అప్పటికే అది మంటల ధాటికి కాలిపోయి, చనిపోయింది. అతడు దాన్ని పట్టుకుని పైకి లైపగా దాని రెక్కల్లోంచి ఆరేడు కోడి పిల్లలు గంతులేస్తూ కిందికి దూకాయి... అంటే తాను చనిపోయినా ఫరవాలేదు, కానీ తన పిల్లలకు మాత్రం ఏమీ కాకూడదు... అని భావించిన ఆ తల్లి కోడి మంటల ధాటికి తన ప్రాణాలనర్పించి, పిల్లలను కాపాడుకున్నది...లి తల్లి ప్రేమ గురించి చెప్పటానికి ఈ చిన్న ఉదాహరణ చాలదా..? అందుకే అమ్మ ప్రేమ గొప్పది. దానికి మరణం లేదు. అది ఎప్పటికీ సజీవం. అది మనిషైనా, మరో జీవి అయినా... అమ్మ అమ్మే.. ఆమె స్థానం ఆమెదే... అమ్మలను ప్రేమించే అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు....
శ్రీమతి బండి రాధాకృష్ణారెడ్డి,
బాల కేంద్రం సూపరింటెండెంట్, సూర్యాపేట
సృష్టి కర్త ఒక బ్రహ్మ,
ఆమెను సృష్టించిందొక అమ్మ...
అమ్మంటే ఓ అనుభూతి,
ఓ అనుబంధం, ఓ ఆప్యాయత, ఓ ఆత్మీయత...
ప్రపచంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా
సం్కసృతులు మారవచ్చునేమోగానీ.. అమ్మ ప్రేమ మారదు,
మనకేమాత్రం బాధ కలిగినా తలుచుకునేది అమ్మనే,
బిడ్డకు ఆకలవుతుందన్న విషయం ఆ బిడ్డ కంటే ముందుగా తెలిసేది అమ్మకే,
మనం తిరిగి తిరిగి ఇంటికెళితే కళ్లల్లో ఒత్తులేసుకుని గుమ్మంలో నిలుచునేది అమ్మనే,
అందుకే అమ్మ మన ప్రేమ తప్ప వేరేమీ కోరని అమాయకురాలు...
ఆమె ప్రేమకు అంతులేదు, అంతం అంతకంటే లేదు..
షేక్ సమీనా బేగం,
ప్రభుత్వ ఉపాధ్యాయిని, హుజూర్నగర్
అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా
అమ్మపై ప్రేమతో నేను గీసిన బొమ్మ
షేక్ జావీద్, ఐటీఐ విద్యార్థి,
లింగగిరి, సూర్యాపేట జిల్లా