Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయన ఓ గొప్ప అడవి రాముడు, ఆయనొక తోట రాముడు డ్రైవర్ రాముడు, అగ్గి రాముడు. ఆయనొక సాహసవంతుడు, ఆయనొక తెనాలి రామకృష్ణుడు. ఆయనొక రాజకీయ ఉద్దండ పండితుడు. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు ఆయన సొంతం. ఇంకా ఈ జననాయకుడు రామరాజ్యంలో సాహసోపేత నిర్ణయాలతో ప్రజా సంక్షేమ పథకాలతో కోట్ల మంది జన హృదయాలను గెలుచుకున్న ఈ రియల్ హీరో తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగు రాజకీయ విశ్వరూపం. సినీ ప్రబంజనాలకు, ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం. ఇలా అన్నిటా తానే అన్నీ తానే ప్రతి తెలుగువారు అన్నా అని ముద్దుగా పిలుచుకునే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు. ఈ నందమూరి అందగాడు 1923 మే 28న కృష్ణా జిల్లా గుడివాడలో నిమ్మకూరు గ్రామంలో నందమూరి లక్ష్మయ్య వెంకట రామమ్మ దంపతులకు సినీ కళామతల్లి ముద్దుబిడ్డగా జన్మించారు.
ఎన్టీఆర్ ఐదవ తరగతి వరకు నిమ్మకూరులో, ఇంటరు విజయవాడ ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో, బీఏ డిగ్రీ గుంటూరు ఏసీ కాలేజీలో చదివారు. ఇంటర్ చదివే రోజుల్లో రామారావు ఇంటింటికీ వెళ్లి పాలు పోసేవారు కుటుంబ పోషణ కోసం. ఎస్ఆర్ఆర్ కాలేజీలో తెలుగు శాఖాధిపతి కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈయన రాసిన 'రాజమల్లుని దౌత్యశీ' నాటకాన్ని కాలేజీలో ప్రదర్శించారు. అందులో కథానాయిక పాత్రని రామారావు పోషించారు. ఇదే ఆయన తొలి నటన. ఇందులో రామారావుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ తర్వాత సంవత్సరం కూడా కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా 'అనార్కలి' నాటకశీల్లో కథానాయకుడు సలీం పాత్రను పోషించారు. ఈ పాత్రకు కూడా ప్రథమ బహుమతి లభించింది. తనకు 20 ఏళ్ల వయసులో మేనమామ కూతురు బసవతారకంతో వివాహం జరిగింది.
నాటకాల మీద ఉన్న ఇష్టంతో గుంటూరులో స్నేహితులతో కలిసి 'నేషనల్ ఆర్ట్ థియేటర్' స్థాపించి ఎన్నో నాటకాలు వేసేవారు. ఆ తర్వాత మద్రాసు వారి సర్వీస్ కమిషన్ పాసయ్యి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగంలో చేరారు. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు వెళ్లారు. ఎల్.వి.ప్రసాద్ గారి మనదేశం సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోగా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పాత్రని పోషించారు. ఆ తర్వాత షావుకారు సినిమా కూడా విడుదలైంది. 1951లో కె.వి.రెడ్డి ఃపాతాళభైరవి మల్లేశ్వరి, పెళ్లి చేసి చూడుః చిత్రాల్లో అద్భుతంగా నటించారు. ఆ తర్వాత చంద్రహారం సినిమా నటుడిగా గొప్ప కీర్తిని తెచ్చిపెట్టింది. పాతాళభైరవి అప్పట్లో వంద రోజులు ఆడి సంచలన విజయాలు సాధించింది. 1959లో ఎవిఎమ్ వారు నిర్మించి విడుదల చేసిన 'భూకైలాస్' చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. 'శ్రీమద్విరాటపర్వములో' ఆయన ఐదు పాత్రలు పోషించారు. ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు.
మాయాబజార్ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రలో తొలిసారి దేవుడి పాత్రలో ఎంతో గొప్పగా అలరించారు. శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలో ఆయన చేసిన పాత్రలో ఎన్టీఆర్ ను తెలుగు ప్రజలు దేవుడిగా ఆరాధించారు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుశీది. రామారావు హీరోగా, దర్శకుడిగా, స్క్రిప్ట్ రైటరుగా కూడా గొప్పగా రాణించారు. వీరు దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'సీతారామ కళ్యాణం'. దాన వీర శూర కర్ణలో మూడు పాత్రలు పోషించి స్వీయ దర్శకత్వం వహించారు. ఇలా సంవత్సరానికి 10 సినిమాల చొప్పున చేసేవారు. మొత్తం తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో 380 దాకా సినిమాలో అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇలా ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్ర ఆయనకే సొంతం అన్నట్టుగా ఆ పాత్రలో జీవించేవారు. తన ఉంగరాల జుట్టుతో, అందమైన రూపంతో వెలుగులు విరజిమ్మే చిరునవ్వుతో, గంభీరమైన కంఠస్వరంతో తెలుగు సినీ వినీలాకాశంలో ఓ వెలిగారు.
ఇలా వెలిగిపోతున్న తరుణంలో రామారావు తీసుకున్న ఓ గొప్ప నిర్ణయం చరిత్రకు నాంది పలికిశీది. అదే ఆయన రాజకీయ రంగ ప్రవేశం. 'తెలుగుదేశం పార్టీ' ఆవిర్భావం. 1982వ సంవత్సరం మార్చి 29 వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలా ప్రారంభమైన పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి 'చైతన్యరథం' అనే ఒక వాహనాన్ని సిద్ధం చేసి ఆయన తన కొడుకులలో ఒకరైన నందమూరి హరికృష్ణని రథసారథిగా నియమించుకుని ఏకధాటిగా 7500 కిలోమీటర్లు ప్రయాణించి తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లారు. ఆ విధంగా పార్టీని స్థాపించి సంవత్సరం తిరగకుండానే ఎన్నికలలో 294 స్థానాలకు గాను 194 గెలిచి అత్యధిక మెజార్టీ సాధించి చరిత్రను తిరగ రాశారు. ఇలా 1983 జనవరి 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 'ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం' అన్న నినాదంతో ముందుకు సాగుతూ తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చివేసిన శక్తితో అత్యద్భుతంగా పరిపాలన సాగించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ముఖ్యమంత్రిగా అద్భుతంగా పరిపాలన సాగిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి.
ఎన్టీఆర్ పాలన రామ రాజ్యాన్ని తలపిస్తు సాహసోపేత నిర్ణయాలతో, సరికొత్త పథకాలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న రియల్ హీరో రామారావు గారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ముఖ్యంగా మద్యపాన నిషేధం, పేదవారికి కిలో రెండు రూపాయల బియ్యం లాంటి పథకాలు ఆయన్ని గొప్ప పరిపాలన అధ్యక్షుడిగా నిలబెట్టాయి. మహిళలకు ఆస్తిలో హక్కు, రైతులకు పెద్ద పీట వేస్తూ నీటిపారుదల రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగుగంగ ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా రామారావుదే. బలహీనవర్గాల కు ఇల్లు కట్టించి ఇవ్వడంతోపాటు స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలన్న తీర్మానాన్ని కూడా చేశారు. వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్లు కల్పించారు. గుళ్లో పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే తీర్మానాన్ని కూడా చేశారు. ఇంకా ఈ అభినవ ముఖ్యమంత్రి దేశంలోని ప్రతిపక్షాలన్నింటిని ఒక్క త్రాటిపై నిలబెట్టి వారిని గెలిపించిన విశాల హృదయుడు. ఇంకా విశేషంగా 'నక్సలైట్లు దేశభక్తులు బ్రదర్' అంటూ అందరికీ ఆరాధ్య దైవంగా మారారు. ఇలా తెలుగు సినీ వినీలాకాశంలో మకుటం లేని మహారాజులా, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లుగా భావించి రాజకీయ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించి రెండింటికీ సమన్యాయం చేకూర్చిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు. వీరు 1996 జనవరి 18న భువి నుండి దివికేగారు. ఆయన్ని అభిమానించే ప్రతి తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
- పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు
9704725609