Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గిరులలో పుట్టి
తరుల నడుమ పెరిగి
కొండ కోనల మధ్య బ్రతుకు బాటన సాగి
జనాభా లెక్కల్లో మేమూ ఉన్నామంటూ
జీవితం సాగిస్తున్న
బడుగు వర్గ ప్రజలు
గిరిజనులు..
కంబళి అంగవస్త్రం
ఆకులు అలములు కప్పుకునే దుప్పట్లు
పురుగు పుట్రలు ప్రాణాంతకాలని తెలిసినా..
వాటి మధ్యనే సంచరిస్తూ
సేకరించిన మూలికలు,
తేనెనమ్మితే దొరికే తిండిగింజలు
కోటి వరాలుగా భావించే
కానల కడగండ్ల కష్టజీవులు..
అగుపడరు సభ్య లోకానికెన్నడు..!
జానెడు పొట్టకోసం కోటి తిప్పలు
కాళ్లు నడిచే భూమి సొంతం కాదు,
వానొచ్చినా..వరదొచ్చినా
కలిసికట్టుగా కరువు కాటకాలొచ్చినా
తప్పించుకోలేరు
తలదాచుకోడానికి నీడుండదు
గుడిసెలు ఇంద్ర భవనాలు..
ఆటలు గిల్లీ దండాలు
వన్య మృగాలు ప్రాణ స్నేహితులు
చెట్టు చేమలు ఆడబడుచులు
నాగరికత, దేశ పురోగతి వెలివేసిన అడవితల్లి బిడ్డలు..కర్మ జీవులు.. బంజారులు.. ఏకలవ్యుని ప్రతిభ గల గిరి సిరులు..
వాల్మీకి శబరిల వారసులు..
గిరిజనులని చిన్న చూపు వద్దు
అవకాశమిస్తే వీరికి ఆకాశమే హద్దు!
-సుజాత.పి.వి.ఎల్.,
సైనిక్ పురి, సికిందరాబాద్.