Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని సోమవారం అత్యంత ఉత్సాహ పూరితంగా, స్ఫూర్తిదాకయంగా నిర్వహించుకున్నారు. అమ్మ భాషలోని కమ్మదనాన్ని పిల్లలు, పెద్దలందరూ తనివితీరా ఆస్వాదించారు. దేశ దేశాలు సైతం మాతృభాష గొప్పదనాన్ని, దాని ప్రాధాన్యాన్ని గుర్తించి, గౌరవించాలంటూ సూచించాయి. అప్పడే మాతృభాష పరిఢవిల్లటంతోపాటు మానసిక వికాస పరిపుష్టి సాధ్యమవుతుందని నొక్కి చెప్పాయి. అంతర్జాతీయ వేదికలపై అమ్మభాష ఇలా ప్రశంసలందుకుంటున్న వేళ...అక్షరాలను ఏర్చికూర్చి ఆ భాషకు అభిషేకం చేశారు కొందరు భాషామానులు ఇలా...
అన్ని భాషలలో కెల్ల అమ్మ భాష తీయనిది. ఎవరి అమ్మ భాష వారికే మధురం. అమ్మ ప్రేమలో, అమ్మ భాషలో తారతమ్యాలు వుండవు. ఒకరి భాష గొప్ప మరొకరి భాష తక్కువ అని కాదు. ఎదైనా భాష తోటి వారితో కలిసి జీవించడానికి, కమ్యూనికేట్ చేయడానికి ఎంతో అవసరం. మన మాతృభాష తెలుగు, మనసు పలికే భావాలను స్పందనను వెలిబుచ్చాడనికి మాతృ భాషనీ మించి ఎది సరిరాధు. అలాగే నేటి కాలం పరిస్థితులను బట్టి పలు భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ కూడా చాలా ముఖ్యం. ఎక్కడికి ఉద్యోగ రీత్యా, విద్య విజ్ఞానం రీత్యా దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లే పరిస్థితుల్లో పర భాషల మీద పట్టు కూడా ముఖ్యం అవుతుంది. ఉపాధి కోసం, డబ్బు సంపాదనకు, అభివృద్ధి కోసం వెళ్ళే దారిలో ఎన్ని భాషలు వచ్చి వుంటే అంత తేలిక అవుతుంది స్థిరపడటం. కాబట్టి నేటి కాలం స్టూడెంట్ చిన్న వయసు నుండే పలు భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది.
పర భాషల మోజులో పడి అమ్మ భాషను మరువ వద్దు, ఎదైనా మనకి గాయం అయితే వెంటనే బాధతో అమ్మ అనకుండా వుండటం సాధ్యం కాదు. అన్ని భాషలను గౌరవిస్తూ మన మాతృ భాష నీ మరువ కుండ గౌరవాన్ని ఇవ్వాలి. మన ఉపాధికి, అభివృద్ధికి అవసరమైన భాషని నేర్చుకుందాం,కానీ మిగతా సమయాల్లో మాతృ భాష లోనే ,మాతృ భాష తోనే ముందుకు సాగుదాం.మాతృభాష కమ్మదనాన్ని అందరం కలిసి పంచుకుందాం.
- బండి రాధాకృష్ణారెడ్డి,
సూపరింటెండెంట్, బాలభవన్, సూర్యాపేట
9494854468
మాతృభాష--- మమతకు తొలిభాష
మాతృభాష..
మమతకు తొలిభాష..
మనసుకు ప్రియభాష...
కవ్వించే భాష, నవ్వించే భాష..
కదిలించే భాష, కలతలు ఏమార్చే భాష...
కమ్మని ప్రేమకు కరుణను అద్ది..
ఓదార్చే కోటి భావాల కమ్మని అమ్మ భాష...
కలం సారధిగా కావ్య గీతికలు నిర్మించే..
కోమల మృదు భాష...
కవుల కలల మనో తటాకంలో..
పద పద్మాలై వికసిస్తూ..
పలు వాక్యాల పూదండలుగా జతకూడి..
జ్ఞాన భారతి మెడకు సొగసులద్దిన భాష...
అన్వేషించే వారికి..
కటిక చీకటిలో కొవ్వొత్తిలా కాంతినిచ్చే భాష..
అభిమానించే వారికి..
అనువరతం ప్రశాంతత ప్రసాదించే..
పవిత్ర దైవ స్వరూపం ఈ భాష...
అస్వాదించే వారికి..
విరి తేనియలు పొంగిపొరలే..
సాహిత్యపు స్వర్గలోక..
సురాపానం సిద్ధించే భాష..
అందమైన భాష, అమూల్యమైన భాష..
అమృతాన్ని చిందించే భాష...
- ఎస్కే సమీనా బేగం,
తెలుగు పండిట్, లింగగిరి, సూర్యాపేట జిల్లా
9701086821