Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కసితో వగసిన దళిత సౌందర్య శాస్త్రమ్ అంటూ దుప్పల రవికుమార్, ఖాళీలు పూరించే కవిత్వం అంటూ డా|| చల్లపల్లి స్వరూపరాణి, చక్కటి ముందు మాటలతో కవి అంతరంగాన్ని ఆవిష్కరించారు.
చారిత్రాత్మక 'రైతు ఉద్యమం' గురించి కవి ఇలా అంటారు-
''రక్తం గడ్డకట్టి పోలీసు దెబ్బలు / తింటూ రైతు ఉద్యమ రక్తాక్షరాన్ని / గోచి గొంగడి కట్టు నెత్తిపై తలపాగాలతో / నెలల తరబడి సుదీర్ఘ పయనంగా / జనం కనుపాపల్లో దీపమై పలికిస్తున్నారు'' అంటారు (పేజీ : 26)
''మూగబోతున్న మాట'' అనే కవితలో ప్రశ్నించే మేధావులను బెయిల్రాకుండా జైళ్ళలో బంధిస్తున్న నేపథ్యం దృష్టిలో పెట్టుకొని రాసిన మంచి కవిత... ఆ కవితలో చివరి వాక్యాలు ఆలోచింపచేస్తాయి..
''ఎవరూ నోరు విప్పి మాట్లాడరేం / మనిషెపుడయినా చావాల్సిందేనని / అది నిస్వార్థమైతే అందరి వారవుతారని / ప్రతి గుండెలో ఊపిరై శ్వాసిస్తారని (పేజీ : 33)
నేటి రాజ్యం తీరు తెన్నులపై ''దారి తప్పిన పయనం'' (పేజీ : 52) అనే కవితలో ఒక చక్కటి కవి అభివ్యక్తి గమనించగలం.
''అక్షరాన్ని ఆధారం చేసి / ఉత్తరాన్ని సాక్ష్యంగా మలిచి / మానవ హక్కుల్ని బందీని చేసి / చట్టాన్ని కాగితమని కాల్చేస్తే / రాజ్యం నోరు మెదపలేని 'మోడై' పోయి / తన కాళ్ళు తానే నరుక్కునే కోతై పోతుంది!'' అంటారు.
''దళితుడా లేవరో!'' అనే పాటలో మొదటి చరణంలో ఇలా అంటారు (పేజీ : 104) దళితుడా లేవరో... దండుగా కదలరో / అగ్రకులం పొగరణచా ఆయుధమవ్వాలిరో.... / కారం చేడు కారణాలు కన్నుల్లో కానలేరా / నీరుకొండ నిప్పురవ్వై గుండెల్ని సాగలేదా! / చండూరు పుండయినా కసి నీలో కలగలేదా?'' || దళితుడా లేవరో...||
అలాగే ''మేలుకొలుపు'' అనే పాట కూడా బాగుంది. (పేజీ : 126)
వెనుకబడ్డ జాతోడా రారా / తోడు రారా... జయము నీదేరా ||వెనుకబడ్డ||
దుప్పల రవికుమార్ చక్కటి ముందుమాట రాసారు. అంబేద్కర్ ఆలోచనా స్రవంతిని కవిత్వంలో బలంగా సియ్యార్కే (కవి) చెప్పారు. అలనాటి బోయిభీమన్న నడిపిన 'జైభీమ్' పత్రికలోని సాహిత్యం యీ సంపుటిలో అందించారు. (1978 నాటి జైభీమ్ పత్రిక). కవి బహుజన రాజ్య కాంక్షను అద్భుతంగా కవిత్వీకరించినందులకు అభినందనలు....
- తంగిరాల చక్రవర్తి , 9393804472
(మౌనంగానే మాట్లాడుతున్నా...., రచన : సియ్యార్కే (కె. చిన్నారావు), పేజీలు : 128, వెల : రూ.120/-, ప్రతులకు : సిక్కోలు బుక్ ట్రస్ట్, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ - 532001, సెల్ : 9989265444)