Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మేధా మథనం' (బ్రెయిన్ టీజర్స్) ఫేస్బుక్లో వారానికి పది ప్రశ్నల చొప్పున దాదాపు డెబ్బై వారాలు నిర్వహించిన ప్రశ్నలన్నీ జవాబులతో పుస్తకంగా కవి, రచయిత, అనువాదకులు, పదబంధ ప్రహేళికల సృష్టికర్త 'ఎలనాగ' ప్రచురింపచేశారు. ఫేస్బుక్ మాధ్యమంలో పెట్టిన 77 ప్రశ్నామాలికలలో, ఒక్కొక్క దాంట్లో పది చొప్పున మొత్తం 770 బ్రెయిన్ టీజర్లకు కింద, వివరాలతో సహా జవాబులున్నాయి. కరీంనగర్ జిల్లా ఎల గందుల గ్రామంలో జన్మించిన, విశిష్ట రచయిత కలం పేరు 'ఎలనాగ'. పజిల్ నిర్మాణంలో మాటల ఆటతో మెదడుకు దాగుడు మూత లాడే పదాల తికమక క్రీడను సాహితీ నవ్యతా ప్రక్రియగా సృష్టించే పదమాంత్రికుడనటంలో సందేహపడక్కర్లేదు. పూరక మిత్రుల అవస్థలు అంతా యింతా కాకపోయినా పజిల్ సమాధా నాలు రాబట్టి పూర్తి చేయగలిగితే అవధిలేని కొండ ఎక్కినంత ఆనందం, చేజిక్కించుకొంటారు. మెదడును ఆటపట్టించే ఈ ప్రక్రియ సృష్టించిన 'ఎలనాగ' ప్రపంచ వాప్తంగా, బ్రెయిన్ టీజింగ్తో ఎందరో తెలుగు సాహితీకారుల అభిమానాన్ని పొందగలుగుతున్నారు. కవితలు, కథలు, ఆంగ్లానువాదాలు, భాషాంతరీకరణలు, భాషా సాహిత్య వ్యాసాల రచయితగా సుపరిచితులైన ఎలనాగ ఈ మేధామథనంతో 1'పన్'నీటి జల్లు శీర్షికను చేపట్టి 77 ఎపిసోడ్లు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. పజిల్స్ ఇష్టపడే వారంతా ఈ పుస్తకంలో వున్న జవాబుల వైపు కన్నెత్తి చూడకుండా తృప్తికరమైన జవాబులు వచ్చాయనుకున్న తరువాతనే జవాబులు చూసుకుంటేనే ఎలనాగ శ్రమ, ప్రయాస, సాహితీ కృషి ఫలించినట్టే. పుస్తకం ముఖచిత్రం, పజిల్స్ సమాధానాలు దాచిపెట్టే తాళం చెవితో మేధామథనం ఆసక్తిగా ఆకట్టుకొంటోంది. సుకేంద అభినందనీయులు.
(రచయిత : ఎలనాగ, పేజీలు : , వెల : రూ. 150/-, ప్రతులకు : రాగకృతి ప్రచురణలు, 73 నక్షత్ర కాలనీ, బాలాపూర్ గ్రామం, వయా కేశవగిరి, హైదరాబాద్ - 500005, ఫోన్ : 9866945424)
- జయసూర్య, 9014948336