Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మ అనే పదం ఈ లోకంలో తీయనైన పదం. భాషకు అందని గొప్ప భావం. 'అమ్మ' అనే రెండు అక్షరాలు అనురాగ చిహ్నాలు, ఆత్మీయతకు సంకేతాలు. దేవుడు తాను అన్ని చోట్లా ఉండలేక అమ్మని సృష్టించాడు. అందుకే అమ్మను దేవుని ప్రతిరూపంగా కొలుస్తాము. తల్లిని మించిన దైవం ఈ ప్రపంచంలోనే లేదు. కనిపించే దైవం అమ్మ, కరుణించే రూపం అమ్మ. ఎవరు ఎంత ప్రేమను చూపించినా, ఎవరు ఎంత బాధ్యత వహించిన అమ్మలోని అనురాగం తేనెకన్న తీయనైనది. ప్రపంచంలో అతి పెద్ద ఉద్యోగం అమ్మతనం. ప్రేమామృతాన్ని కురిపించే అమ్మ నేల మీద ఉదయించిన దేవత. అందుకే ప్రతి మనిషి జీవితంలో అమ్మే అమృతమూర్తి, నిత్య ప్రేరణ చైతన్య శీలి, వందనాలు అందుకునే త్యాగశీలి. అమ్మంటే అనురాగం, ఆప్యాయతకి మారుపేరు. అందుకే మాతృదేవోభవ అంటారు. నవమాసాలు మోసి పెంచిన మాతృమూర్తికి ఏమిచ్చినా రుణం తీరదు. కన్న తల్లి రుణం తీర్చుకోవాలంటే మళ్లీ అమ్మకే అమ్మగా పుట్టి అమ్మ రుణం తీసుకోవాల్సిందే. కష్టాలు కన్నీళ్ళలో ప్రతి ఒక్కరి నోటి వెంట వచ్చే మొదటి మాట అమ్మ. బిడ్డలని కంటికి రెప్పలా కాపాడుకునే అమ్మ త్యాగాలకు గుర్తుగా చేసుకునే వేడుక మాతృదినోత్సవం.
ఇంతటి గొప్ప బంధంతో ముడివేసుకున్న మాతృమూర్తిని మాతృదినోత్సవం రూపంలో తలచుకోవడానికి ఒక రోజంటూ ఏర్పడడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ మాతృదినోత్సవం ఎక్కడి నుండి మొదలైంది అనే విషయానికి వస్తే అమెరికాలో తొలిసారిగా మాతృ దినోత్సవాన్ని నిర్వహించారు. సమాజంలో తల్లి పాత్రను ఆమె సేవలను గుర్తు చేసుకోవటం కోసం ప్రతి ఏటా మే రెండవ ఆదివారం రోజు ఈ పండుగను జరుపుకునేవారు. మొదట్లో మహిళా సంఘాలు మాత్రమే ఈ వేడుకలు జరిపేవారు. ఆ తర్వాత "టెగిమారి జాబిస్" అనే మహిళ తన తల్లి అనుకున్న ఆశయం నెరవేర్చకుండానే కన్నుమూసిందని, తల్లిని గుర్తు చేసుకోవడం కోసం మాతృ దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన ఆమె మనసులో కలిగింది. దీంతో తన ఆలోచనలకు విస్తృతంగా ప్రాచుర్యం కల్పించే దిశగా ఆమె అడుగులు వేసింది. తన ఆలోచనలకు మద్దతు కూడగట్టేందుకు చాలామందిని తనతోపాటు నడిపించింది. ఈమె కృషి ఫలితంగా అమెరికాలోని పశ్చిమ వర్జీనియా రాష్ట్రంలో మొదటిసారిగా మాతృదినోత్సవం టెగిమారి జాబిస్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించారు. ఇంకా ఈమె ఈ రోజుని అంతర్జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఎంతో ప్రయత్నించింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా మే రెండవ ఆదివారం రోజున అమ్మకు జేజేలర్పిస్తూ ఆమె గొప్ప మనసుని విశ్వవ్యాపితం చేస్తున్నారు బిడ్డలంతా.
అమ్మలేనిదే సృష్టి లేదు, అమ్మ లేనిదే జీవితం లేదు, అమ్మలేనిదే గమనం లేదు. కంటికి రెప్పలా కాపాడుతుంది, కుటుంబం కోసం సర్వం త్యాగం చేస్తుంది. కుటుంబ నిర్మాణం లో సగభాగం అయిన అమ్మ సమానత్వమే దేశ ప్రగతికి మూలం. తాను ఇంటికే పరిమితమై పోకుండా నాన్నకు ధీటుగా విజయాలు సాధిస్తుంది. అన్నం కలిపి గోరుముద్దలు పెట్టేటప్పుడు తన బిడ్డలపై ఉన్న మమకారాన్నంతా రంగరించి మరీ కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆముద్దను తింటుంటే ఆ బిడ్డ కడుపు నిండడంతో పాటు ఆ తల్లి కడుపు కూడా ఆనందంతో నిండిపోతుంది. అదే అమ్మ ప్రేమంటే, అమ్మ గొప్పతనం అంటే. కుటుంబ వికాసంలో అమ్మ పాత్ర ఉన్నతమైంది. కుటుంబాన్ని ముందుకు నడిపించడంలో అమ్మ పోషించే పాత్ర అనంతం, అనన్యసామాన్యం. ఇలా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ సంపూర్ణ, మానసిక స్థైర్యం కలిగిన అమ్మ చూపించే ప్రేమ, ఆప్యాయతలు, త్యాగం ధైర్యం, ఓర్పు, నేర్పు, సహనం వీటన్నిటిని వజ్రాయుధాలుగా ధరించి బిడ్డలని ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలా తీర్చిదిద్దుతుంది.
అందుకే ఆ రెండు అక్షరాలు గొప్ప భరోసా, తీర్చుకోలేని భరోసా. బంధానికి అనుబంధానికి ప్రతీక. ఆమె ఓ అమృత కలశం. ఆ అమృత కలశం రక్తసంబంధం కోసం నా అనే మాట లేకుండా నిస్వార్ధంగా జీవితాన్ని ఫణంగా పెడుతుంది. అందుకే అమ్మ ప్రేమ వెలకట్టలేనిది, రుణం తీర్చుకోలేనిది. అందుకే ఓ సినీ కవి గారు అంటారు "అమ్మంటే అంతులేని సొమ్మురా అది యేనాటికి తరగని భాగ్యమ్మురా, అమ్మ మనసు అమృతమే చూడరా, అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా... ". పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం "అమ్మ". ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ. ఆమె నాకు మాటలు నేర్పడం అంటే తాను కూడా నాలానే మాట్లాడుతుంది. నా రేపటి భవిష్యత్తు కోసం శ్రమించే నిత్య శ్రామికురాలు. ఈ సృష్టిలో అందమైనది పువ్వు, నా దృష్టిలో అంతకన్నా అందమైనది మా అమ్మ, ఆమె చిరునవ్వు. అమ్మ నాకు దేవుడిచ్చిన గొప్ప స్నేహితురాలు. మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ నవ్వుతున్న క్షణం ఏదైనా ఉంది అంటే అది మనం పుట్టినప్పుడు మాత్రమే. అందుకే అన్ని బంధాల్లోకి పేగుబంధం గొప్పది అంటారు.
ప్రతి బిడ్డ తన గుండె గుడిలో తల్లిని ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు. ఇలాంటి అమ్మకు కవులు చక్కని కితాబునిచ్చారు. "పెదవే పలికిన తీయని మాటే అమ్మా! కదిలే దేవత అమ్మ!, కంటికి వెలుగమ్మా..." అని చంద్రబోస్ గారు రాసినా, "ఎవరు రాయగలరు అమ్మ అనే మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మా అనే పాట కన్నా తియ్యని పాట... " అని సిరివెన్నెల గారు చెప్పినా.... ఇలా అమ్మ మాధుర్యం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇలా కవులంతా తమ కలాలతో అమ్మ రుణం తీర్చుకుంటున్నారు. అందుకే మాతృదేవోభవను మించిన భావన లేదు. కానీ అమ్మని దైవంగా భావించే ఈ ప్రపంచంలో ప్రస్తుతం అమ్మ ఒంటరిదైపోతుంది. కాదు, కాదు బిడ్డలే ఆమెను ఒంటరిదాన్ని చేస్తున్నారు తల్లి చేసిన త్యాగాలను మర్చిపోయి. తల్లికి బిడ్డ ఎన్నటికీ బరువు కాదు. కాని తల్లి బిడ్డకు బరువుగా మారుతుంది. ప్రస్తుతం అమ్మ స్థానం ఓల్డేజి హోములైపోతున్నాయి. అలాకాకుండా బిడ్డ ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా తల్లిదండ్రుల్ని మన దగ్గరే ఉంచుకొని రోజులో కొంత సమయం వారి కోసం కేటాయించి ఒక్క పదినిమిషాలు చిరునవ్వుతో పలకరిస్తే ఆ తల్లి ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొంది సంపూర్ణ ఆరోగ్యంతో నవ్వుతూ, తుళ్ళుతూ ఆనందకరమైన జీవనాన్ని సాగిస్తూ మరు జన్మంటూ ఉంటే వీళ్ళనే నా బిడ్డలుగా పుట్టించు అని భగవంతుణ్ణి ఇప్పటి నుండే ప్రార్ధిస్తుంది. అప్పుడు ప్రతిరోజూ మాతృ దినోత్సవమే మనకి. అందరూ ఒక్కసారి ఆలోచించండి... .
- పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు
ఫోన్ నెంబర్.9704725609