Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ నుండి 'చందమామ'తో పాటు యాభై - డెబ్బయ్యవ దశకాల్లో పిల్లల పత్రికల్లో బాలల కోసం రచనలు చేసిన వారిలో 'సాహిత్య దుందుభి'గా ఖ్యాతి గాంచిన ఉమ్మెత్తల యజ్ఞ రామయ్య ఒకరు. ఉమ్మెత్తల మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో జూన్ 2, 1922న పండిత కుటుంబంలో పుట్టారు. వీరి పూర్వికుల్లో ఒకరైన బ్రహ్మేశ్వర శాస్త్రి వనపర్తి సంస్థాన పండితులుగా ఉండేవారు.
స్వస్థలం వనపర్తిలో ప్రాథమిక విద్య అభ్యసించిన వీరు మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పట్టా పొందారు. జాతీయోద్యమం పట్ల విద్యార్థి దశలోనే ఆకర్శితులైన ఉమ్మెత్తల ఆనాడు జరిగిన ఖాదీ ఉద్యమం, గ్రంథాలయోద్యమం వంటి వాటిలో పాల్గొన్నారు. వనపర్తిలోని శాఖా గ్రంథాలయ వ్యవస్థాపక సభ్యుల్లో ఉమ్మెత్తల యజ్ఞ రామయ్య ఒకరు. ఆంధ్ర సారస్వత పరిషత్తు శాఖను వనపర్తిలో ప్రారంభించి విద్యార్థులకు తెలుగుభాష పట్ల ఆసక్తిని కలిగించి పరిషత్తు పరీక్షలు నిర్వహించారు.
తెలుగు పండితునిగా పనిచేసి 1975లో పదవీ విరమణ చేశారు. ఉమ్మెత్తల పద్యాన్ని అత్యంత ప్రతిభా వంతంగా, మధుర స్వరంతో గానం చేసేవారు. ఆకాశవాణి హైదరాబాద్, కడప కేంద్రాల ద్వారా వీరి పద్యాలు ప్రసారం అయ్యేవి. ఆకాశవాణిలో వీరి పద్యాలే కాక వ్యాసాలు, కథలు, నాటికలు ప్రసారం అయ్యాయి. ఆదర్శ ఉపాధ్యాయులుగా, ఉత్తమ వక్తగా ఖ్యాతి చెందిన ఉమ్మెత్తల రేడియో కోసం 'కనువిప్పు', 'దీక్ష', 'ఆహుతి', 'అన్నయ మంత్రి', 'ధర్మ చక్రం' మొదలగు నాటికలు, నాటకాలు రాశారు. ఇవన్నీ ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి. స్వయాన రంగస్థల నటులైన ఉమ్మెత్తల అనేక నాటకాల్లో నటించారు.
విద్యార్థి దశలోనే వీరు రాసిన 'ఆశాలత' నవల అచ్చయ్యింది. ఇవేకాక 'శకుంతల', 'భరతుడు', 'ఝాన్సీరాణి', 'రత్నాజీ' 'సుఖాంతం', 'పాదార్చన' మొదలగు నాటకాలు, 'గీతాంజలి' తెలుగు అనువాదాలు ఉమ్మెత్తల అముద్రిత రచనలు. బాలల కథా రచయిత, నటులుగానే కాక పత్రికా సంపాదకులుగా వీరు ప్రసిద్ధులు. వనపర్తి సాహితీ వేదిక ఆధ్యర్యంలో వెలువడిన 'సాహిత్య దుందుభి' సాహిత్య మాస పత్రికకు ఉమ్మెత్తల యజ్ఞ రామయ్య సంపాదకులుగా ఉన్నారు. ప్రతియేట అందించే 'ఉమ్మెత్తల పురస్కారం'కు వదాన్యత వీరిదే.
చందమామ, బాల మిత్ర, బాల భారతి, వాణి, లలితా శివజ్యోతి మొదలైన పత్రికల్లో బాలల కథలు, ఆంధ్రప్రభలో ప్రధానంగా సాహిత్య వ్యాసాలు రాశారు ఉమ్మెత్తల. ఇతర రచనలు వీరు జీవించి ఉన్నప్పుడే ప్రచురించబడగా, మరణానం తరం బాలల కథలను వీరి శ్రీమతి వెంకమ్మ, కుటుంబ సభ్యులు 'తాతయ్య కథలు' పేరు తో అచ్చువేశారు. ఇది ఇరవై బాలల కథల సంపుటి.
పిల్లల కోసం రాసినవైన ప్పటికీ ప్రతి కథలో లోతుగా, గంభీరంగా చర్చలు చేయడం వీరి కథల్లో మనం చూడవచ్చు. అటు వంటిదే బాల భారతిలో వచ్చి 'మూడు విలువలు' కథ. ఇందులో కవి, పండిత సత్కారాలంటే ఇష్టం లేని యువరాజు కళ్లు తెరిపించ డమే కాక 'వస్తే పోయేవి రెండు, పోతే రానివి రెండు, వస్తే పోనివి రెండు' ఏమిటి అని ప్రశ్నింప చేసి వాటి సమాధానాల కోసం పిల్లల్నే కాదు పెద్దల్లో ఆలోచన రేకెత్తించే కళ ఉమ్మెత్తలకు తెలిసినంతగా మరెవరికీ తెలియ దేమో! వీటికి సమాధానాలుగా 'వస్తే పోయేవి కలిమిలేము లని, పోతే రానివి మాన ప్రాణాలని, వస్తే పోనివి కీర్తి అపకీర్తు లని' చెప్పి బాలల్లో చక్కని అవగాహన కలిగేలా చేస్తాడు రచ యిత. జానపద కథల బాణీలో రాసినప్పటికీ ఉమ్మెత్తల ప్రతి కథలో వైద్యం మొదలుకుని ఏదొక విషయాన్ని చెప్పడం చూడొచ్చు. అటువంటిదే చందమామలో వచ్చిన 'వైద్య రహస్యం' కథ.
వెంకటాచార్యుడు అనే వైద్యుడు తన గ్రామంలో బతుకడం కష్టం కావడంతో పొరుగునే అన్న నగరంలో ఒక ధనవంతుని ఇంట్లో ఇల్లు కిరాయకు తీసుకుని, మందులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. తన భార్య ఒకరోజు ఇంటి యజమాని రోజు రాత్రి పెరుగు తింటాడు అని చెప్పగానే, అతనికి రోగం రాగానే త్వరలో తనకు గిరాకీ వస్తుందని, భార్యకు చెవి కమ్మలు చేయిస్తానంటాడు. రాత్రి పెరుగు తినేప్పుడు అందులో ఉప్పు వేసుకుంటాడని, పుల్ల పెరుగులో శొంఠి వేసుకుంటాడని తెలిసి పెరుగుకు విరుగుడైన ఉప్పు, శొంఠిలు వాడడం వల్ల ఆధనవంతుడు రోగాల పాలుకావడంలేడని తెలుసుకుని బాధ పడతాడు. వినడానికి, చదవడానికి ఇది సరదాగా అనిపించొచ్చు కానీ బాల్యంలోనే పిల్లలకు భారతీయ ఆయేర్వేదంలోని రహస్యాన్ని చెప్పడమనమొక ఆశయాన్ని సిద్దింపజేసుకోవడం రచయిత సాధించిన విజయం. ఇందులోని 'పూరీల శాసనం', 'పారని పన్నాగం', 'ఎత్తుకు పై ఎత్తు', 'దాత', 'తగినశాస్తి', 'బంగారు అంగి' వంటి కథలు కూడా ఆసక్తిని కలిగించడమే కాక పిల్లలకు చక్కని విషయాలు తెలుపుతాయి. చివరి వరకు సాహిత్యజీవిగా బతికిన ఉమ్మెత్తల యజ్ఞరామయ్య జనవరి 30, 1995లో మరణించారు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548