Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ప్రేమ'' అనే రెండక్షరాల పదానికి ''రెండు హదయాల కలయిక'' అని చాలా మంది వర్ణిస్తారు.
ప్రేమకు సరైన నిర్వచనం ఇంతవరకూ ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలి పోయింది.
ప్రేమను వ్యక్తపరచడం అనేది వారు ఇచ్చే విలువైన బహుమతులుగానో లేదా వారు ప్రేమించే వ్యక్తులకు నచ్చినట్లుగా ఉంటూ జీవించడం ద్వారానో వారి ప్రేమను వ్యక్తం చేస్తుంటారు.
కొందరైతే ఎదుటివారు వారి ఎదురుగా ఉన్నా లేకపోయినా మనసులోనే గుడి కట్టి ఆరాధిస్తూ మమేకమై పోయి వారే లోకంగా జీవిస్తుంటారు.
అదే ఏ లాభాపేక్ష లేని స్వచ్ఛమైన ప్రేమ.
అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మామిడి మధుసూదన్. 1984లో ఇంద్రజ గారితో పెద్దల అనుమతితో ప్రేమ వివాహం జరిగింది. 2013 జూలై 1న ఆమె దూరం అయ్యారు.
అప్పటినుంచి వారి సతీమణి తన వెన్నంటే ఉన్నదని అతని ప్రగాఢ విశ్వాసంతో, ఆమెతో గడిపిన మధుర క్షణాలను అక్షరీకరించి తన హదయంలోనే ''కావ్య మందిరం'' కట్టారు మధుసూదన్.
వారి దాంపత్య జీవితం అనుబంధం గురించి చెప్పిన మాటలు విన్నప్పుడు ఒక ఫ్రెంచ్ రచయిత చెప్పిన వాక్యాలు గుర్తుకొస్తున్నాయి.
జీవితం మనోహరమైన పుష్పం అయితే ప్రేమ అందులో నిరంతరం స్రవించే మధురమైన మకరందం వంటిది - (విక్టర్ మేరీ హ్యూగో)
హ్యూగో జీవితం కూడా ఇంచుమించుగా మధు సూధన్ జీవితంలాగే అనిపిస్తుంది. అతను ఫ్రాన్స్‌లో ప్రజాస్వామ్యాన్ని రూపొందించిన గొప్ప రాజనీతిజ్ఞుడు.
హ్యూగో అతని జీవిత చరమదశలో కూడా ''నేను తీపి తీపిగా మాట్లాడే వద్ధులలో ఒకడిని కాను ... నేను మతోన్మాద దేశభక్తుడిగా చనిపోతానని ప్రకటిస్తున్నాను'' అని అన్నాడు.
అలాగే మధుసూదన్ కూడా తన శ్రీమతి స్మతులను భావాక్షరాలుగా మలచి రాసుకుంటున్న కావ్యం ''ఇందూ స్మతి భావాలు'' కూడా అతను నిరంతరం తన జీవిత చరమాంకం వరకూ రాస్తూనే ఉంటాను అన్నారు.
అక్షరాలు ఎప్పుడూ
సహకరిస్తూనే ఉన్నాయి
అచంచలమైన ఇందు
ప్రేమారాధనలో
అనంతమైన నా ఊహలలో... (7) ఆమెను మరచి పోలేనని చెప్పకనే చెప్పారు.
ఇందు ఎప్పటి నుంచో
నేను చదవాల్సిన పుస్తకం కాదు
ఎప్పుడూ నేను చదువుకుంటున్న
మంచి పుస్తకం !(1)
ఇందు నిజంగా
పొద్దుతిరుగుడు పువ్వే
నేను ఎటు వెళితే
అటు వైపు తిరుగుతూ
నన్నే చూస్తూ...!!( 27)
ఇంద్రజ మనిషిగా దూరమైనా మధుసూదన్ మదినిండా ఆమె భావనలే కదులుతున్నప్పుడు మనిషి లేదన్న ధ్యాస ఎందుకు ఉంటుంది..?
మరిచిపోయేందుకు
ఇందు జ్ఞాపకం కాదు
నా మనసు రూపకంలో
అందమైన కావ్యం !! (38)
వేల మైళ్ళ దూరంలో ఉందో
కూతవేటు దూరంలో ఉందో
తెలియదు గానీ
ఇందు శ్వాస నా మనసుకు దగ్గరే (86 )
ఇలాంటి భావుకత వాక్యాలు ఒకటి కాదు రెండు కాదు 200 కవితలు. వేటికవి మనం చదువుతున్నంత సేపు మనసులను కదిలిస్తుంటాయి.
మామిడి మధుసూదన్ తన ప్రతి శ్వాస లోనూ భార్యను తలచుకున్నారు. ఆమెను తనలో ప్రతిష్టించి అనుక్షణం కొలుస్తున్నారు. దేవతను చేసి అక్షరాంజలి ఘటిస్తున్నారు.
ఆ మహా ఇల్లాలు ఎప్పుడూ వారి తలపుల్లో మెదులుతూనే ఉంటుంది. ఆమె ఆత్మ అతనిని అంటిపెట్టుకునే ఉంటుంది. ఓదార్పుచ్చే ఈ కవితా ప్రవాహం ఆగిపోకూడదు అనునిత్యం చైతన్య వీచికలై సాగిపోవాలి. ఇవి స్మతి గీతాలు కావు శ్వాసాక్షరాలు.
- వాసరచెట్ల జయంతి, 9985525355
(ప్రతులకు : మామిడి మధుసూధన్, సెల్ : 830970962)