Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జంబూ సాహితీ సంస్థ ఈ కథా వార్షిక తెచ్చింది. తొలి తరం కథకుల నుండి నేటి కొత్త కథకుల కథలూ అన్నీ 20 దాకా ఈ సంకలనంలో ఉన్నాయి. (రెండు రాష్ట్రాల కథకులు కథలు ఉన్నాయి) ఆదిలో ఈ దేశాన్నేలిన మూల వాసుల అద్భుతమైన జ్ఞానం సమానత్వం, మనుషులంతా సమానమన్న ఆది జాంబవ వారసులను, మూల వాసులకు అక్షరాలను దూరం చేసిన దుస్థితి చూస్తే గుండె తరుక్కుపోక తప్పదు. ఆ కవి అవమానం, అణచివేత... అక్షరరహితం నుండి తీవ్ర మనోవేదనల నుండి .... ఆర్తిని ప్రకటించడానికి... అక్షరం ఆయుధంగా చేసుకొన్న విద్యావేత్తల కలం నుండి అద్భుత సాహిత్యం ఆవిష్కృతమైంది, అవుతోంది. అంబేద్కర్ అన్నట్లుగా ఈనాడు 'మేధోమథనం' మానవుని అంతిమ అస్తిత్వమై ఉండాలి. 1925లో శ్రీపాద రాసిన ''పుల్లం రాజుకథ'' తొలి కథానిక. దళితేతరుడు రాసిన తొలి దళఙత కథగా నిర్ధారించారు. భాగ్యరెడ్డి వర్మ ''వెట్టి మాదిగ'' కథను 1932లో భాగ్యనగర పత్రికలో అజ్ఞాత వాసి పేరిట ప్రచురితం అయింది. రెండేళ్ళ తరువాత 1934లో గృహలక్ష్మి పత్రికలో ''ఇంకెక్కడి జయము'' కథను తాడి నాగమ్మ రాసారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా|| కొలకలూరి ఇనాక్ 1954లో ''లోకం పోకడ'' ''ఉత్తరం'' అనే కథలు రాసి నేటికీ రాస్తూనేయున్నారు. 1960లో మామిడి సత్యవతి ''తెర తొలగింది'' కథ రాసారు. 1933లో బోయ జంగయ్య ''లోకం'' కథ రాసారు. పసునూరి రవీందర్; ఎండ్లూరి మానస; డా|| గడ్డం మోహన్‌రావులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందారు. పై అంశాలు చెప్పటం ఎందుకంటే దళిత కథ విశ్వసాహితీ వేదికపై ఎంతో ప్రాభవాన్ని పొందింది అని చెప్పటానికే!! తెలుగు సాహితీ కథౄ దాహార్తి తీర్చే ఈ ''తొండం బొక్కెన''లో 20 అద్భుత కథలున్నాయి. మట్టి మనుషుల యదార్థ సంఘటనలు... సంఘ ర్షణలు... అవమానాలు... ఆకలి; పుట్టుకే ప్రశ్నార్థకమైన చోట ఎన్నో తలవంపులు.. అవమానాలు.. భూషణంగా ధరించిన భూమిపుత్రుల బాధలు నిష్కల్మశ హృదయాల ఆవిష్కరణే ఈ దళిత కథా వార్షిక - 2020. అన్ని కథలూ ఆలోచింపజేస్తాయి. పద్మశ్రీ డా|| కొలకలూరి ఇనాక్ ; డా|| ఎం.ఎం.వినోదిని; డా|| కాశీం; డా|| జిలుకర శ్రీనివాస్ లాంటి సాహితీవేత్తల అభిప్రాయాలు.. విశ్లేషణలు.. ఈ పుస్తకానికి నిండుతనం తెచ్చాయి. ఈ పుస్తకంలోని కథలు చదువుతుంటే... పాఠకుల కండ్ల వెంట జలజలా నీళ్ళు రాలక తప్పదు. 75 సం|| స్వాతంత్య్ర తరువాత కూడా దళితుల బతుకులు మారలేదు. అంతరీక్ష యానాలు చేస్తున్నకాలంలో కూడా కుల వివక్ష - దోపిడీ పీడనలున్న స్థితిని ఈ కథల్లో అద్భుతంగా కథకులు రాసారు. ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర రాసిన ''మైక్రో సిట్టీలల్ల మన్నవడ'' కథలో లచ్చక్క లాంటి ఎందరో దళిత స్త్రీలు.. సిట్టీలోల్ల దగ్గర సిట్టీలేసి పడే ఇబ్బందులు... బాధలు... కారప్పొడి మిల్లుల పనిచేస్తూ అన్నారోగ్యాల పాలౌతున్న తీరు.. ఇంట్లో ఆర్థిక బాధలు... పొలం పన్లు- పిల్లల పెండ్లిళ్లు... బ్యాంక్ అప్పులు... మగవాళ్ళు తాగుడుకు ఖర్చుపెట్టడం లాంటి విభిన్న కోణాన్ని ఆర్తితో ఆవిష్కరించి కథ (పేజీ. 23). మరో ప్రముఖ రచయిత్రి డా|| గోగు శ్యామల రాసిన ''కరోనా సుగ్గి'' కథ (పేజీ. 29) గ్రామీణ వ్యవసాయ ఆవశ్యకతను తమ కొడుకు - కోడళ్ళకు తెలియజెప్పడమేగాక, వున్న వూరు విడిచి వలసవెళ్ళి కూలీలుగా జీవితాన్ని కడు దుర్భరంగా గడపడం... లారీలు... ట్రక్కులు.. ఆటోలు ఎక్కి సొంత వూర్లకు వలస బాట పట్టిన వలస కూలీల జీవితాన్ని; వ్యవసాయ రైతు కుటుంబం నేపథ్యంగా, కొత్తపల్లి గ్రామస్తులైన సంఘమ్మ, మొగులయ్య దంపతుల బిడ్డల బతుకు చిత్రాన్ని కరోనా కష్టాలతో ఉత్కంఠ భరితంగా కథీకరించారు. డా.పసునూరి రవీందర్ రాసిన ''శివన్న రుణం'' కథ ''చదువు'' ప్రాధాన్యత చెప్పే కథ. తన్న ఉన్నతికి ప్రేరకుడైన శివన్న సమాధి చూసి చలించిపోతాడు సూర్యం. తను తన మామయ్య చావుకు ఊరు రావడం- అక్కడ శ్మశానంలో తనను గొప్పవాడు కావాలని ప్రోత్సహించిన శివన్న సమాధి చూచి సూర్యం విలపించడం, చదువు తోనే బతుకులు మారతాయన్న శివన్న అశయం కోసం మిత్రుడు శేఖర్ నుండి తన వూరి వివరాలు తెల్సుకొని పట్టుదలతో పట్నం కదులుతాడు సూర్యం. (పేజీ.36) ఆలోచింపజేసే మంచి కథ ఇది.
ఎన్.టి.ఆర్. పాలనాకాలాన్ని భూస్వామ్య వ్యవస్థపై దళితులు ఆధిపత్యాన్ని అద్భుతంగా కథీకరించారు డా|| జిలుకర శ్రీనివాస్ - ''బైండ్ల సెంద్రయ్య బోనాల పండుగ'' కథలో (పేజీ. 62). దామోదర్ రెడ్డి ఎంపీపీ కావడం, వూరి ఆచారం ప్రకారం గాక రెడ్డి యిష్టమొచ్చినట్లుగా బేస్తారం బోనాలు చేయాలనడం.. బైండ్ల చంద్రయ్య అడ్డుపడటం - అతన్ని తిట్టడం... సోమలింగ - సోమన్న - సెంద్రయ్యలు... పంచాయితీ పెట్టి రెడ్డిని దోషిగా నిలబెట్టడం... బోనాల్లో రెడ్డి భార్యకు పూనకం రావడం... పూజలో సమయం చూసి రెడ్డిని చంద్రయ్య దేహశుద్ధి చేయడం కథలో కీలక అంశం...
అర్బన్ దళఙత్ ఉమెన్ లైఫ్‌ను బాగా రిచ్‌గా చూపించిన కథ 'మెలీనా' పెద్ద షాపింగ్ మాల్ నుండి బిల్ చెల్లించి తన కార్లో ఇల్లు చేరిన మెలీనా కొడుకును తన రూంలో పడుకోబెట్టి తన ఆఫీసు మిత్రులైన కల్పన ధనంజరులతో సిగిరెట్ తాగి; ఆర్డర్ పెట్టి తెప్పించిన చికెన్, మటన్ తినడం అంతకుముందు చక్కగా ముగ్గురూ పెగ్‌లు వేసి ఆనందించడం... మెలీనా భర్త జీవన్ ఇంట్లో లేని వీకెండ్లో పార్టీ చేసుకోవడం... స్త్రీజాతిని వివిధ జాతులుగా ధనుంజరు మాట్లాడటం... మెలీనా ఇబ్బంది పడటం... ఇద్దర్నీ రాత్రి 11 గం||ల ప్రాంతంలో వాళ్ళ ఇళ్ళకు పంపడం, కల్పన భర్త కారులో వచ్చి ఆమెను తీసుకెళ్ళడం... తన స్త్రీ జాతిలోని చదువురాని వారు, గుర్తింపులేని వారు, నలిగిపోయిన వారు, ఇలా పైకి రావాల్సిన ఎందరో మెలీనాలు గురించి ఆలోచిస్తూ... తలుపేసుకుంటుంది మెలీనా. ఇదీ పై కథలకు చాలా భిన్న కథాంశం... రచన : ఎండ్లూరి మానస. ఇంకా సూరే గ్యానం (ఎండపల్లి భారతీ రచన); దోసిలిపట్టు (కె.పి.లక్ష్మీనరసింహ); కన్నీటి కథ (రామ్ పెరుమాండ్ల); మల్లక్క (తప్పెట ఓదయ్య); ఇది ఒప్పు (డా||కొలకలూరి ఇనాక్); మారుతి మర్డర్ (వేముల ఎల్లయ్య) లాంటి కథలు పాఠకుల్లో ఆలోచన, వ్యవస్థ మార్పును ఆశించే రీతిలో ఉన్నాయి. ఇది మంచి ప్రయత్నం.
సంపాదకులు : డా.సిద్ధెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్, తప్పెట ఓదయ్య, పేజీలు : 180, వెల : రూ. 150/-, ప్రతులకు : డా|| సిద్ధెంకి యాదగిరి, 1-9-44/2డి, రోడ్ నెం. 4, టెలికాం నగర్, సిద్ధిపేట, తెలంగాణ - 502103. సెల్ : 9441244773
- తంగిరాల చక్రవర్తి ,
9393804472