Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీ సౌందర్యాన్ని గురించి ప్రపంచంలో అన్ని భాషలలోనూ సాహిత్యపరంగా చాలా చర్చ జరిగింది. స్త్రీ మనసును పట్టించుకునే తీరిక లేని సమాజాలు కూడా స్త్రీ సౌందర్యాన్ని దానికున్న శక్తి గురించి బాహాటంగానే విమర్శలు చేసాయి. స్త్రీ కారణంగానే చాలా అనర్ధాలు జరుగుతాయని చెప్పుకోవడంలో ఆనందం అనుభవించే పురుష సమాజం, ఆ స్త్రీ చుట్టూ భ్రమరాలు తిరిగినట్లు తిరగడం తమ బలహీనత అని ఒప్పుకోరు. దీనికి కూడా స్త్రీలదే బాధ్యత అని వాదిస్తారు. స్త్రీ శరీరం పట్ల తమ ఆకర్షణలో కూడా దోషం స్త్రీది అనే చెప్పుకోవడం తరతరాలుగా పురుషులకున్న అలవాటు. స్త్రీ శరీరాన్ని మార్కేటీకరణ చేసుకుంటున్న ఆధునిక సమాజాన్ని గమనించినపుడు స్త్రీ శరీరపు ఆకర్షణ కారణంగా జరుగుతున్న వ్యాపారాన్ని చూస్తున్నప్పుడు ఆ వ్యాపారస్తులు, మార్కెట్ వ్యవ్యస్థే స్త్రీ నీతి సాంప్రదాయాలకు చాలా గౌరవాన్ని ఇస్తున్నట్లు నటించడం ఆశ్చర్యపరుస్తుంది. స్త్రీలపై ఎక్కడయితే ఈ వ్యాపారం అత్యధికంగా జరుగుతుందో ఆ వ్యవస్థ కొన్ని సందర్భాలలో ప్రత్యేకమైన స్త్రీలను తయారు చేస్తుంది. వీళ్ళు తమపై జరుగుతున్న హింసను ప్రతిఘటిస్తూ తమ శరీరాన్నే ఒక ఆయుధంగా మలచుకుంటారు. తమ శరీరాల పట్ల అకర్షితులై, తమనో వస్తువుగా చూస్తూ ఆ శరీరాలని తమ ఆస్తులుగా మార్చుకుంటున్న పురుషులను ఎదిరించడానికి, తమ కోరికల కోసం స్త్రీల జీవితాలను బలి తీసుకునే వారిని సర్వనాశనం చేయడానికి తమ శరీరాలనే ఉపయోగించు కోవడానికి వీరు వెనుకాడరు. అది తమ విజయంగా భావిస్తారు.
వేశ్యా వత్తిలో, దేవదాసీ వ్యవ్యస్థలో ఇలాంటి స్త్రీల ప్రసక్తి వస్తుంది. సాంప్రదయం మాటున జరుగుతున్న వివక్ష, తమపై జరుగుతున్న దోపిడిని ఎదుర్కోవడానికి, చాలా సందర్భాలలో స్త్రీలు తమ శరీరాల పట్ల పురుషులకున్న కోరికను ఆసరాగా తీసుకున్న సందర్భాలు అనేకం. అలాంటి స్త్రీల కథలు చరిత్రలో అనేకం ఉన్నాయి. స్త్రీ శరీరానికి ఒక శక్తి ఉందనుకుంటే, దానినే ఆయిధంగా మార్చుకున్న సందర్భాలలో స్త్రీలు జరిపే విధ్వంసం గురుంచి చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తారు. కాని స్త్రీ శరీరాన్నే ఆయుధంగా మార్చుకోవలసిన సమాజ స్థితి పట్ల మాత్రం సరైన చర్చ ఎప్పుడూ జరగదు.
తన తల్లిదండ్రులను చంపిన వ్యక్తులపై పగ తీర్చుకోవడానికి ఒక యువతి ఆడిన నాటకం ఇతివత్తంగా వచ్చిన మళయాళం సినిమా ''కన్నెళ్ళుది పొట్టుం తొట్టు''. దీనికి తెలుగు అనువాదం ''కాటుక రాసుకుని బొట్టు పెట్టుకుని'', అంటే అలంకరించుకుని అని కూడా చెప్పుకోవచ్చు. అందంగా శంగారాన్ని ప్రోత్సహించే విధంగా అలంకరించుకుని కూర్చున్న స్త్రీ ఒక పురుషున్ని రా రామ్మని ఆహ్వానిస్తున్న సమయంలో, ఆ సంబంధానికి ఆహ్వానాన్ని పంపుతున్న ఆమె లోపలి మర్మం, కారణం వెనుక ఉన్న ఉద్దేశం గురించి ఆలోచించే స్థాయిలో చాలా మంది మగవారు ఉండరు. పైగా అలా తమకు ఆహ్వానం పంపిన స్త్రీ, సంబంధం ఏర్పరుచుకున్న స్త్రీ తమ సొత్తు అని వాళ్ళు భావించే అవకాశం ఉంటుంది. ఈ పురుష బలహీనతను బాగా గ్రహించిన ఒక యువతి ఓ తండ్రిని, అతని కొడుకుని కూడా ఆకర్షించి వారిద్దరూ కొట్టుకు చచ్చే స్థితిని తీసుకువచ్చి, వారిద్దరి మరణం ద్వారా తన తల్లిదండ్రుల హత్య, ఎందరో పేద వారికి జరిగిన దోపిడికి పగ తీర్చుకుంటుంది. ఆ తండ్రీ కొడుకుల అన్యాయాలకి ఎన్నో ఏళ్ళుగా బలయిపోయిన పేద బతుకులకు వారి హత్యతోనే న్యాయం జరుగుతుందని నిర్ధారిస్తుంది.
నటేశన్ ఒక భూస్వామి. అతని పొలాలలో పని చేయడం కోసం పక్క ఊళ్ళ నుండి వచ్చే కూలివారితో భద్ర అనే ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. నటేశన్ కొడుకు ఊథమన్. తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా స్త్రీ లోలురు. భూస్వామ్య అహంకారంతో పేదవారి రక్తం పీల్చుకునే జలగలు. భద్రపై ఊథమన్ కన్ను పడుతుంది. అతన్ని ఎదిరిస్తుంది భద్ర. ఆమెతో పని చేసే ఆడ కూలీలు చాలా మంది ఉథమన్కి లొంగిపోతారు. లేకపోతే తమకు మళ్ళీ పని దొరకదని వారి భయం. ఆ పొలాల మధ్య ఒక గట్టు మీద ఓ సమాధి ఉంటుంది. అది ఆ భూమి కోసం ప్రాణం అర్పించిన ఒక వ్యక్తిది అని ఆ ఊరి వాళ్ళందరూ అంటారు. కాని అది నిజం కాదని ఆ పొలం గట్టు మీద నటేశన్ చేతిలో ఆ వ్యక్తి హత్య చేయబడ్డాడని, అతని మరణాన్ని ఊరి కోసం అతను చేసిన ఆత్మత్యాగంగా ఓ కట్టు కథ అల్లి నటేశన్ అందరినీ మోసం చేసాడని భద్రకి తెలుసు. తన కళ్ళముందే చిన్నప్పుడు నటేశన్ తన తండ్రిని హత్య చేసి ఎలా కట్టుకథ అల్లి చట్టం నుంచి తప్పించుకున్నాడో భద్రకు చాలా స్పష్టంగా గుర్తు ఉంది.
భద్ర తల్లి తండ్రి ఇద్దరూ కూడా సామాజిక స్పహ ఉన్న పేద కర్షకులు. భద్ర తండ్రి ట్రేడ్ యూనియన్‌లో పని చేసేవాడు. కూలి వారి వేతనాలు పెంచాలని స్ట్రైక్ చేస్తూ నటేశన్కి అతను ఎదురు తిరుగుతాడు. నటేశన్ భద్ర తల్లిపై కన్నేస్తాడు. ఆ ఊరి పేదస్త్రీల వలే ఆమె అతనికి లొంగదు. ఎదురు తిరుగుతుంది. అందుకని పగ బట్టి తనకు ఎదురు తిరిగిన భద్ర తండ్రిని పొలం గట్టున సజీవంగా సమాధి చేస్తాడు నటేశన్. ఇది చూసి భయపడి చిన్న పిల్ల అయిన భద్ర తల్లిని పిలుచుకువస్తుంది. కాని వారు భద్ర తండ్రిని కాపాడుకోలేకపోతారు. నటేశన్ అదే అదను అని భద్ర తల్లిపై అత్యాచారం చేయాలనుకుంటాడు. ఆమె చిన్న పిల్లయిన భద్రతో ఒక పడవ పైకి ఎక్కి దూరంగా బిడ్డను పారిపొమ్మని పంపి కాల్చుకుని చనిపోతుంది. తల్లి తండ్రి ఇద్దరి మరణాన్ని దగ్గరగా చూసిన భద్ర ఎప్పటికయినా తన తల్లిదండ్రుల చావుకి పగ తీర్చుకోవాలనుకుంటుంది. పెరిగి పెద్దదయి నటేశన్ పొలాలలో పని చేయడానికి కూలి మనిషిగా వస్తుంది.
భద్ర తండ్రి కుటుంబానికి స్నేహితులుగా మరో జంట ఉండేవారు. ఆ ఇంటి ఇల్లాలు పేరు రోజా కుట్టీ. భద్రను చాలా ప్రేమగా చూసేది రోజా కుట్టి. భద్ర తండ్రి మరణం తరువాత నటేశన్ చేతిలో ఆమె భర్త మరణిస్తాడు. రోజా కుట్టి నటేశన్ కొడుకు ఊథమన్కి లొంగిపోతుంది. పెరిగి పెద్దదయి ఆ ఊరికి వచ్చిన భద్ర ఊధమన్ ఉంపుడుగత్తెగా రోజాకుట్టిని చూసి సహించలేకపోతుంది. ఆమెను హత్య చేద్దామనుకుంటుంది. కాని చిన్నప్పటి ప్రేమ ఆమెకు అడ్డుపడుతుంది. రోజా కుట్టి ఊథమన్కి లొంగిపోయిన పరిస్థితులను అర్ధం చేసుకుంటుంది. ఊథమన్ చేతిలో తరువాత రోజా కుట్టి కూడా మరణిస్తుంది.
ఈ తండ్రి కొడుకులను ఎవరూ ఎదిరించలేని స్థితిలో ఉంటారు. తమకు ముప్పు వస్తుందంటే ఎంత మందినయినా హత్య చేయగలిగే పరపతి వారి సొంతం. నటేశన్ కుటుంబ బలం తెలుసుకున్న భద్ర వారి బలహీనత మీద దెబ్బ కొట్టాలనుకుంటుంది. నటేశన్ ఇంటిలో పని మనిషిగా చేరుతుంది. నటేశన్ ఆరోగ్యం కోసం అతని భార్య పూజలు చేస్తున్నప్పుడు ఆ ఇంటికి కాబోయే కోడలిని చూస్తుంది భద్ర. రోజా కుట్టి మరణంతో ఆలోచనలలో పడిన భద్ర మనసులో ఒక వ్యూహం తయారవుతుంది. మరుసటి రోజు నుంచి నటేశన్‌ను ఊథమన్ని ఆమె ఆకర్షించడం మొదలెడుతుంది. రకరకాల పద్ధతులలో వారిలో తన పట్ల కోరిక పెరిగేలా చేస్తుంది. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా భద్ర కోసం ఒకరితో ఒకరు వైరం పెంచుకుంటారు. తన తండ్రిని చంపిన చోటుకు తనను పొందడానికి ఇద్దరినీ భద్ర ఒకే సమయంలో ఆహ్వానిస్తుంది. అక్కడకు వచ్చిన తండ్రి కొడుకుల మధ్య భద్ర కోసం పెద్ద యుద్ధం జరుగుతుంది. నీళ్ళల్లో పడి కొట్టుకుంటూన్న ఇద్దరిలో వయసు కారణంగా బలంగా ఉన్న ఊథమన్ తండ్రైన నటేశన్ ను చంపేస్తాడు. ఆ నీళ్ళలో కరెంట్ తీగను తెంపి పడేస్తుంది భద్ర, కరెంట్ షాక్‌తో ఊథమన్ మరణిస్తాడు. మరుసటి రోజు తాను ప్రేమించిన వ్యక్తితో భద్ర ఆ ఊరు వదిలి వెళ్లిపోతుంది.
నటేశన్గా తిలకన్, ఊథమన్గా బీజు మీనన్ పోటి పడి నటించారు. ఇక భద్ర పాత్రలో మంజు వారియర్ అద్భుతమైన నటనను ప్రదర్శించింది. రౌద్రం, అద్భుతం, శంగారం, భయానకం, శాంతి, వీరత్వం, హస్యం, కరుణ, భీభత్సం అనే ఈ నవ రసాలను మన సినిమాలలో స్త్రీ పాత్రలు ఒకే సినిమాలో పోషించిన సందర్భాలు అతి తక్కువ. ఇన్ని షేడ్స్‌ను ఒకే సినిమాలో నటించి, మెప్పించి ఆ పాత్రకు జీవం పోసిన మంజు వారియర్ భారతీయ సినిమాలోనే ఒక అద్భుత నటి. ముఖ్యంగా ఒక ప్రేమికురాలిగా, కూతురుగా, కార్మిక హక్కుల కోసం ఆలోచించే నాయకురాలిగా, ఇద్దరు మగవారిని తనవైపుకు తిప్పుకుని వారిని జంతువులుగా మార్చిన నెరజాణగా చివరకు వారి చావును చూస్తూ ఆనందించే ఒక పగపట్టిన పడచుగా ఆమె చూపిన నటన అత్యద్భుతం. అందుకే ఈ సినిమాకు ఆమెకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి పురస్కారం లభించింది. తిలకన్ మళయాళ పరిశ్రమలో గొప్ప నటులలో ఒకరు. ఈ సినిమాలో నటేశన్గా వీరి నటన మర్చిపోలేం. అలాగే బిజు మీనన్ కూడా. ఇంత మంది ఆర్టిస్టులు పోటీపడి నటించిన ఈ సినిమా మళయాళీ భాషలో వచ్చిన ఓ మంచి చిత్రం, 'భద్ర' పాత్ర భారతీయ సినీ స్త్రీ పాత్రలలో ఒక శక్తివంతమైన పాత్రగా ఎప్పటికీ నిలిచిపోయింది.
- పి.జ్యోతి,
9885384740