Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలల కోసం రాసిన స్వాతంత్య్రానంతర తెలంగాణ మలితరం రచయితల్లో నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన గరిశకుర్తి రాజేంద్ర ఒకరు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరాజరాజేశ్వర క్షేత్రమైన వేములవాడలో పండిత వంశలో ఏప్రిల్ 2, 1953న పుట్టారు. సంస్కృతాంధ్ర పండితులు గరిశకుర్తి శంకరశర్మ-ప్రమీలాదేవి గరిశకుర్తి రాజేంద్ర తల్లితండ్రులు. సుప్రసిద్ధ కథా రచయిత, హేతువాది, జి.సురమౌళి వీరికి స్వయానా చిన్నాయన. సురమౌళి ప్రభావం యాభయ్యవ దశకంలో ఈ ప్రాంతలోని అందరి మీద అత్యంత ఎక్కువగా ఉండేది. రాజేంద్ర సోదరి గరిశకుర్తి శ్యామలామూర్తి కూడా రచయిత్రి, కవయిత్రి, బాల సాహితీవేత్త. రాజేంద్ర బాల్యం విద్యాభ్యాసం స్వగ్రామం వేములవాడలో జరిగింది. బి.ఎ (తెలుగు) సాహిత్యంలో చేసిన రాజేంద్ర పోస్ట్ మాస్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు.
కథా, కవిత్వం, గేయం, పద్యం మొదలగు ప్రక్రియల్లో రచనలు చేసిన రాజేంద్ర ఉద్యోగరీత్యా నాలుగైదు దశా బ్దాల పాటు కామారెడ్డిలో స్థిరపడి అక్కడే కన్నుమూసాడు. తొలుత కవిత్వం రాసిన రాజేంద్ర కథా రచయితగా అనేక బహు మతులు అందుకున్నారు. సాధన, జలధి, కోరిక, విపుల పత్రికలు నిర్వహిచిన వివిధ పోటీలో బహుమతులు అందుకున్నారు. స్వతంత్ర భారత స్వర్ణోత్సవాల సందర్భంగా ఆకాశవాణి నిజామాబాద్ నిర్వహించిన పోటీల్లో రచనలకు బహుమతులు లభించాయి. అఖిల భారత తపాలా వారోత్సవాలలో రాజేంద్ర రాసిన, 'మద్యతరగతి మందహాసం' ఉత్తమ నాటికగా ఎంపికై ఢిల్లీలో ప్రదర్శింపబడి అనేక ప్రశంసలందుకుంది. కుటుంబ నియంత్రణశాఖ వారి నినాదాల పోటీలో ప్రథమ బహుమతి, బీబిపేట, తపాలశాఖవారి పలు పోటీ ల్లో బహుమతులు అందుకున్నారు.
కథలు, కవిత్వం, ఇతర సాహితీ ప్రక్రియలు, రూపాలతో పాటు బాలల కోసం నిబద్ధతగా రాశారు గరిశకుర్తి రాజేంద్ర. పిల్లల కోసం కథలు, కవితలు రాశారు. 'సాహితీ భూషణ్' బిరుదు పొందిన రాజేంద్ర రచనలు 'హృదయాన్వేషణ' గేయ సంపుటి, 'కవితాలత' వచన కవిత్వం, 'పండుగ కథలు, ఇంట గెలిచి, అమ్మ మనసు' కథా సంపుటాలు, 'పుప్పొడి.. కారప్పొడి' కవి సమ్మేళన కవితలు, 'భక్తి సుధ, జ్ఞానసుధ' ఆధ్యాత్మిక వ్యాసాలు గరిశకుర్తి రాజేంద్ర రచనలు. ఇవేకా ఆకాశవాణి హైదరాబాద్, నిజామాబాద్ కేంద్రాల ద్వారా వందకు పైగా రచనలు ప్రసారం అయ్యాయి. వ్యంగ్య కవిగా, రచయితగా కూడా గరిశకుర్తి రాజేంద్ర ప్రసిద్ధులు. వ్యంగ్య రచనలకుగాను 'వ్యంగ్య కవితా రత్న' బిరుదు అందుకున్నారు.
రాజేంద్ర బాలల రచనలు ఎనభయ్యవ దశకంలో అనేక పత్రికల్లో అచ్చయ్యాయి. వాటిలో గేయాలు, కథలు, నాటికలు ప్రధానంగా కనిపిస్తాయి. 1991లో వీరి తొలి బాల గేయ సంపుటి 'బాల గేయమాల' అచ్చయ్యింది. తరువాత 'నిజాయితీకి నీరాజనం' శ్రవ్య నాటికలు తెచ్చారు. ఇవేకాక కథా సంపుటి అచ్చయినప్పటికీ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఆకాశవాణి ద్వారా పదిహేను పిల్లల నాటికలు శ్రవ్యనాటికల రూపంలో వచ్చాయి.
'తప్పటడుగులు వేస్తూ, చిలుకపలుకులు పలుకుతూ, నవ్వులు, పువ్వులు రువ్వే చిన్నారి హృదయాలను ఏ కొన్నింటినైనా ఆకట్టుకోగలిగితే ఈ ప్రయత్నం ఫలించినట్టే' అని భావించి రచనలు చేసిన కవి గరిశకుర్తి రాజేంద్ర అందులో సఫలం అయ్యాడు కూడా. అలతి అలతి పదాలతో చక్కని గేయాలు రాసిన రాజేంద్ర 'గుర్రమెక్కుతా- నేను గుర్రమెక్కుతా! గుర్రమెక్కి దేశాలన్నీ / గిర్రున తిరిగొస్తా!/ హైదరాబాద్ చార్మినార్ / ఢిల్లీలోని ఎర్రకోట / ఆగ్రా లోని తాజ్‌మహల్ / అన్ని తిరిగొస్తా / నేను అన్ని తిరిగొస్తా' అంటూ సాగుతాయి వీరి గేయాలు. పిల్లలకు విజ్ఞానంతో పాటు ఆలోచన, పెంచేలా గేయాలు రాయడంలో రాజేంద్ర నిష్ణాతులు. అటువంటిదే 'సందేహాలు' అనే గేయం. 'అందమైన చందమామ/ ఎక్కడమ్మా? / పాపా నీమోము వెనుక / దాగేనమ్మా' అనే గేయం. 'చదువుకో..' గేయంలో, 'చదువుకో నాన్న చదువుకో / చదువుకుని నీ తెలివి పెంచుకో / పదుగురికి సాయపడుతూ మా నాన్న మంచిపేరును తెచ్చుకో' అంటూ ఉద్బోధిస్తాడు. అమ్మా నాన్నల గురించి, జూ గురించి, బాలల గురించి, గాలి పడగ, గురించి చక్కగా రాసిన రాజేంద్ర 'పాప నవ్వు' పేరుతో మంచి గేయం రాశాడు. 'పాపనవ్వితే పండుగ / మా ఇంట పండు వెన్నెల నిడుగా / పాప నడిచిందంటే / హంసలే దండుగ!/ మా పాప నవ్వులే/ నిండాలి మా ఇంట దండిగా' అంటూ రాస్తాడు. కవిగా, అనేక సత్కారాలు అందుకున్న రాజేంద్ర, బాల సాహిత్యంలో 'వాసాల నర్సయ్య బాల సాహిత్య పురస్కారం', 'రంగినేని లక్ష్మి బాల సాహితీవికాస పురస్కారం' అందుకున్నారు. నవంబర్ 11, 2020 న బాల సాహితీవేత్త గరిశకుర్తి రాజేంద్ర కన్నుమూశారు.
- డా|| పత్తిపాక మోహన్,
9966229548