Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ కవి, విమర్శకులు సీతారాం, డా|| వేదుల శ్రీరామశర్మ (డా|| శిరీష) ఈ కవితా సంపుటికి ముందు మాట రాసారు. సీతారామారావు పొత్తూరి, పురిమళ్ళ సునంద, దాసరోజు శ్రీనివాస్, నామా పురుషోత్తం, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, డా.సిహెచ్ ఆంజనేయులు, సయ్యద్షఫీ, గద్దపాటి శ్రీనివాస్, పోతగాని సత్యనారాయణ, కన్నెగంటి వెంకటయ్య, కొమ్మవరపు కృష్ణయ్య లాంటి సాహితీ వేత్తలు పుస్తకం చివర ఆత్మీయ వాక్యాలు రాసారు. రైతు కష్టాలు, మనిషిలో దాగుండే స్వార్థం, క్రౌర్యం, నాయకుల తీరు, ఆసిఫా లాంటి పసివారిపై అత్యాచారాన్ని, మధ్యతరగతి, అప్ప ఆదాయ వర్గాల జీవితాన్ని వృద్ధుల బాధలు... అలనాటి బాల్య స్మృతులు, చైతన్య రహిత సమాజాన్ని, మార్పు కోరే దిశగా తన కవిత్వాన్ని ఆర్తితో అద్భుతంగా పగిలిన అద్దంపై అక్షరీకరించారు ఉపేందర్ లరాచమళ్ళ. ఇందులో దాదాపు 60కి పైగా కవితలున్నాయి.
డా|| శిరీష అన్నట్లుగా ముఖీన నోళ్ళైన కవిత్వం వ్యవస్థగా, వ్యక్తిత్వ భాషైన కవిత్వం అభివ్యక్తికి రాచబాట వేసిన రాచమళ్ళ అభినందనీయులు. మచ్చుకు 2, 3 కవితలు చూద్దాం...
మూల పడిన వ్యవసాయ రంగం - రైతు స్థితిపై చివరి వాక్యాల్లో ఇలా రాస్తారు కవి (పేజీ 26)
'ఉరికొయ్య మీదనే ఉత్పాతం నింపుకొని / ఉజ్జీవంగా దిగరా! కిందకు దిగరా! / నువ్వు చేసిన తప్పేంటో నీ కళ్ళకు తేటగా చూపిస్తా! / పొలంలో సూర్యుని కన్నా ముందుగా / ఉదయించటం నీ తప్పు కాదు / ఇన్నాళ్ళు దించిన తల ఎత్తక పోవడమే నీ తప్పు' అంటారు ''పునరుజ్జీవం'' కవితలో.
సామాజిక న్యాయం కోసం ''దరువు ఘరువు'' చేయాలంటారు రాచమళ్ళ (పేజీ 37)- 'చాటింపులో ఉన్న సామాజిక న్యాయం / పాటింపులో ఎక్కడని గొంతెత్తండి / చింతనిప్పులను కళ్ళల్లో నిలబెట్టండి - నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టండి!' అంటారు.
మనుషులు మాట్లాడుకోవాలి... అప్యాయతలు... ఆనందం... కష్టసుఖాలు... కల్సి ప్రత్యక్షంగా పంచుకోవడానికి దర్జాగా నడక మొదలెట్టాలి అంటూ 'కొత్తబాట' (పేజీ 38) చూపుతాడు కవి.
ఫోర్జి / వైఫై / బుల్లి తెర సీరియళ్లు / హెచ్డి / బ్లూ టూత్ / ఇన్స్టాగ్రామ్ / ఫేస్బుక్ / ట్విట్టర్ / యూట్యూబ్లతో మనిషి యంత్రంగా మారుతూ... సంసారం కంటే టెక్నాలజీనెలా ఈదాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాడు. వంటి నిండా బి.పి.ని నూరడం తప్ప ఏం చేయలేకున్నాడు అంటారు. ఇరవై ఏళ్ళ తర్వాత కల్సిన బాల్య మిత్రుల్ని 'రాలిపోయిన ఆకు' కవిలో చివరిన ఇలా రాసారు (పేజీ 61)
''అతను టై సరిచేసుకొని, కోటు సర్దుకున్నాడు. అతని మిత్రుడేమో.. తెగిపోతున్న దారంలోంచి జారిపోతున్న గుండీని వేళ్ళతో బంధిస్తూ... ముందుకు కదిలాడు''
గాలింపు చర్యలు - కాగితం పడవ - పదునెక్కిన బాణం - నాలుగు చేతులు కావాలి - పిల్లర్ - మన ప్రాణం మన చేతుల్లోనే...'కీ' - మేమంతా నీ బాటే... ఉప్పొంగిన అల... లాంటి మంచి కవితలున్నాయి.
పగిలిన అద్దం, కవి : రాచమళ్ళ ఉపేందర్, పేజీలు : 120, వెల : రూ. 100/-, ప్రతులకు : రాచమళ్ళ ఉపేందర్, ఇ.నెం. 15-20-264, యు.పి.హెచ్. కాలనీ, ఖానాపురం హవేలీ, ఖమ్మం - 507002.
సెల్ : 9849277968
- తంగిరాల చక్రవర్తి , 9393804472