Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చందమామ' ఈ పేరు వినగానే నిన్న మొన్నటి తరాల తెలుగు పిల్లలకే కాదు పెద్దలకు అనేక అనుభవాలు, అనుభూతులు, మరెన్నో జ్ఞాపకాలు ముడిపడిఉంటాయి. 'చందమామ' చదివిన పాఠకులకు దాసరి సుబ్రహ్మణ్యం, ఉత్పల సత్యనారాయణాచార్య, వసుంధర, గంగిశెట్టి శివకుమార్, మాచిరాజు కామేశ్వరరావు వంటి ఎంతోమంది బాల సాహిత్యకారుల పేర్లు స్మృతి పథంలో మెదలుతాయి. వీరితో పాటు చందమామలో యాభైకి పైగా కథలు రాసి ప్రచారానికి, ప్రచురణకు దూరంగా ఉన్న మబ్బు పట్టిన చందమామ బూర్లె నాగేశ్వరరావు.
'చందమామ' కథకులుగా ప్రసిద్ధులైన బూర్లె నాగేశ్వరరావు పుట్టింది ఖమ్మం జిల్లా మరిపెడ బంగ్లా సమీపంలోని రఘునాథ పాలెం గ్రామంలో. మార్చి 3, 1948లో పుట్టిన బూర్లె 9వ తరగతి వరకు చదువుకుని, ఆర్థిక ఇబ్బంధులతో మధ్యలోనే చదువు మానివేశారు. కుటుంబ పోషణ కోసం అనేక వ్యాపారాలు నిర్వహించారు. కొంత కాలం ఇల్లెందు దగ్గరి కామేపల్లిలో ఉన్న వీరు, ప్రస్తుతం నల్లగొండ జిల్లా కోదాడలో ఉంటున్నారు. డెబ్బై ఐదేండ్ల వయసులో కూడా కిరాణ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో మంచాన ఉన్న సహధర్మచారిణికి ప్రేమతో సేవలు చేస్తూ రచయితగానే కాక వ్యక్తిగా కూడా మన పిల్లలకు, పెద్దలకు చక్కని ఆదర్శాన్ని పంచుతున్నారు.
వీరి తొలి కథ 'గుమ్మడికాయల దొంగ' 1972లో చందమామలో అచ్చయ్యింది. తన తొలికథను బూర్లె రాసి చందమామకు పంపగా మీ కథను అచ్చువేస్తున్నామని తిరుగుటపాలో సమాధానం వచ్చిందట. తరువాత చందమామ సంపాదకులు కొడవటి గంటి కుటుంబరావు కథారచనలో అనేక మెళుకువలను తెలిపారట. అలా పాఠకునిగా మొదలై చందమామ కథకునిగా ప్రసిద్ధుడ య్యాడు బూర్లె నాగేశ్వరరావు. చందమామ వికీపీడియా కూడా తన ప్రసిద్ధ కథలకుల్లో ఒకరిగా వీరిని పేర్కొంది.
బూర్లె నాగేశ్వరరావు తొలికథ 'గుమ్మడికాయల దొంగ'. ఇది చాలా గమ్మత్తయిన కథ, ఇది మార్చి 1972 సంచికలో వచ్చింది. ఇది రచయిత ఇరవై నాలుగేండ్ల వయసులో రాసిన కథ. ఒక గుమ్మడికాయల వ్యాపారి తన అవసరం కోసం తన గుమ్మడికాయలతో శరభయ్య అనే అతడి ఇంటిలో ఆశ్రయం పొందుతాడు. మరునాడు లేచి చూసేసరికి సగం గుమ్మడి కాయలు మాయమవుతాయి. నమ్మించి తనను మోసం చేశాడని శరభయ్యను నిందిస్తూ తన కాయలు తనకు ఇవ్వమని అడగగా, తాను తీయలేదని, ఆశ్రయం ఇచ్చినందుకు దొంగతనం నేరం మోపావంటూ వెళ్ళగొడతాడు. గుమ్మడి కాయల వ్యాపారి న్యాయాధికారి వద్దకు వెళ్ళి పిర్యాదు చేస్తాడు. మూస కథలకు భిన్నంగా కథను ముగిస్తాడు నాగేశ్వరరావు.
బూర్లె రాసిన అన్ని కథలు యాభై యేండ్ల తరువాత ఇటీవల 'బూర్లె నాగేశ్వరరావు చందమామ కథలు' పేరుతో అచ్చయ్యాయి. మనకు చందమామ కథలనగానే ఎత్తులకు పైఎత్తులు వేసే వాళ్ళు, మోసాన్ని బుద్ధి కుశలతతో జయించేవాళ్ళు, గుణపాఠం నేర్చుకుని బాగుపడేవాళ్ళు, అత్యాశకు పోయి భంగపడి బుద్ధితెచ్చుకున్నవాళ్ళు ఇలా అనేకమంది, వివిధ విలక్షణ మనస్తత్వాలు, వ్యక్తిత్వాలతో కనిపిస్తారు. బూర్లె కథల్లో కూడా వీళ్లందరూ కథ కథకూ తారసపడతారు కూడా. చందమామ కథల్లో మనం చూసిన వాటిల్లో పిసినారి యజమానులు, గయ్యాలి భార్యలు, అత్తలు, తల్లి తండ్రుల మాటలు పెడచెవినపెట్టి జల్సాలతో ఆస్తినంతా తగలేసే కొడుకులు కూడా ఉంటారు. ఇంకా ఇందులోని 'అంతరంగికుడు', 'మూడుకానుల పుణ్యం', 'చిన్నడి యుక్తి', 'పాపపుణ్యాలు', 'దొంగ కొడుకు', 'పరోపకారి చిన్నడు', 'ప్రాణం మీదికి వచ్చిన విద్య', 'అధర్మ సత్రం', 'అంబపలికింది', 'స్నేహం కాని స్నేహం', 'స్వర్గానికి దారి', 'రాక్షసుడి బెడద', 'పిశాచి నాటకం' వంటి కథలు కథుకునిగా బూర్లె నాగేశ్వరరావు కథను నడిపే పద్దతికి, సంభాషణలు నడిపించడంలో, పాత్రలను రూపుదిద్దడంలోని నేర్పును, గ్రామీణ జీవితాలు, అక్కడి జీవితాల్లో విలువలకే ప్రాధాన్యతనిచ్చి బతికిన మనుషులు, మానవీయ విలువలను గురించి తెలుపుతాయి.
మనకు చందమామ అనగానే గుర్తొచ్చే మరో ప్రధానమైన విషయం 'భేతాళ కథలు.' ఆనాడు చందమామకు రాసిన దాదాపు అందరు కథకులు బేతాళ కథలు రాశారు, దయ్యాల కథలు రాశారు. బూర్లె నాగేశ్వరరావు కూడా ఈ కథలు రాశారు. 'పేదవాడి బింకం', 'మారిన మనసు', 'తండ్రికి తగిన కొడుకు', 'బతికున్న పిశాచాలు', 'ముగ్గురు విలుకాళ్ళు', 'అలౌకిక సుందరి', 'వ్యర్థమైన పరీక్ష', 'ఒక్కనాటి స్వర్గం', 'అరణ్యకుడు', 'తండ్రికి తగనివాడు' మొదలగు పది కథలు వీరి బేతాళ కథలు. వీరి బేతాళకథలు దేనికదే సాటి. ప్రస్తుతం నల్లగొండ జిల్లా కోదాడలో ఉంటున్న బూర్లె నాగేశ్వరరావు గారికి జయహో!
- డా|| పత్తిపాక మోహన్, 9966229548