Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాకవి వలీ ముహమ్మద్ వలీ భారతావనిలో సృష్టించిన గజల్ విప్లవం వల్ల ఎందరో కవులు ప్రేరణ పొందారు. అలాంటి వాళ్ళలో 18వ శతాబ్దానికి చెందిన సిరాజ్ ఔరంగాబాదీ ఒకడు. ఇతను ప్రస్తుత మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జన్మించాడు. సిరాజ్ అసలు పేరు సయ్యద్ షాV్‌ా సిరాజ్ ఉద్దీన్ హుసైనీ. సిరాజ్ తన యవ్వనంలో ఒకసారి ఉన్మాద అవస్థలో చిక్కుకున్నాడు. దాని నుండి బయట పడడానికి సూఫీ సంతుల సాంగత్యంలో చేరాడు. సిరాజ్ కవిత్వానికి ఉర్దూ చరిత్రలో గొప్ప స్థానముంది.
ఉత్తర భారతదేశంలో ఉర్దూ అభివద్ధి చెందడానికి సిరాజ్ సాహిత్యం ఎంతో తోడ్పడిందని విమర్శకులు అంటారు. ప్రధానంగా ఇతను గజళ్ళు, నజ్మ్ కవితలు రాసేవాడు. ఆధ్యాత్మికత, సూఫీతత్వం సిరాజ్ కవిత్వంలోని ప్రధాన నేపథ్యాలు. గజళ్ళు రాసే విధానంలో సిరాజ్, వలీని అనుసరించాడు. వలీ పైనున్న గౌరవాన్ని తన షేర్ల ద్వారా తెలియజేసాడు. బొస్తాన్-ఎ-ఖయాల్, కుల్లియత్-ఎ-సిరాజ్ మొదలైనవి సిరాజ్ రచనలు.
మూలం:
ఇష్క్ కీ జో లగన్ నహీ దేఖా
వో బిరహ్ కీ అగన్ నహీ దేఖా
ఖద్ర్ ముజ్ అశ్క్ కీ వో క్యా జానై
జిస్ నే దుర్ర్-ఎ-అదన్ నహీ దేఖా
ఆర్జూ హై కీ జుల్ఫ్ కూ ఖోలే
మై నే కాలీ రయన్ నహీ దేఖా
లబ్-ఎ-రంగీన్ దిఖా ఐ మాదన్-ఎ-హుస్న్
మై అఖీఖ్-ఎ-యమన్ నహీ దేఖా
టుక్ జమీన్ పర్ ఖదమ్ రఖో సాజన్
ఆజ్ నఖ్శ్-చరణ్ నహీ దేఖా
ఘుంచా-ఎ-గుల్ కూ దేఖ్ గుల్శన్ మే
గర్ తూ పీవ్ కా దహన్ నహీ దేఖా
తుఝ్ మసల్ ఐ 'సిరాజ్' బాద్-ఎ-వలీ
కోయూ సాహెబ్- సుఖన్ నహీ దేఖా
అనువాదం:
ప్రేమలో ఉండేటి తపనను చూడలేని వారు
విరహాగ్ని అంటే ఎలా ఉంటుందో చూడలేరు
స్వర్గలోకపు ముత్యాలను ఎన్నడు చూడనివారు
కన్నీటి చుక్కల విలువ ఎలా తెలుసుకుంటారు
నాదో కోరిక ఉంది ఆమె తన కురులను విప్పాలని
ఎందుకన్న నేనెన్నడూ నల్లని రేయిని చూడలేదు
నాకే చెందిన అందమా! నీ రంగురంగుల పెదాలను
చూపించవా, నేనెన్నడూ ఎర్రని రత్నాలను చూడలేదు
క్షణమైనా భూమిపైన పాదాలను ఉండనివ్వు చెలీ
ఈరోజు నీ అడుగుల జాడలు ఎక్కడా కనపడలేదు
ఒకవేళ ప్రియురాలి కొంటె మూతిని చూడకుంటే
పూలతోటకు వెళ్ళి ఏదైనా పూలమొగ్గను చూడు
ఓ 'సిరాజ్', ఒకప్పటి కవిరాజు 'వలీ' తరువాత
నీ లాంటి కవివరున్ని నేనెన్నడూ చూడలేదు.
సిరాజ్ ఉన్మాద అవస్థలో ఉన్నప్పుడు కూడా కవిత్వం రాసాడు. దీనివల్ల సిరాజ్ జీవితానికి, తన కవిత్వానికి విడిదీయలేని సంబంధం ఏర్పడింది. రెండింటిలో కూడా సిరాజ్ అనుభవించిన వేదనను, అనుభూతి చెందిన తన్మయత్వాన్ని చూడవచ్చని విమర్శకులు అంటారు. ఈ ఎపిసోడ్లో తీసుకున్న గజల్ లో, ప్రేయసి కోసం ప్రియుడు పడే వేదనను, వేదన వల్ల సిరాజ్ కలంలో జనించిన ఆహ్లాదకరమైన వర్ణనలను అర్థం చేసుకోవచ్చు. మొదటి షేర్లో, ప్రేమికుల వేదన అర్థం చేసుకోవడం అంత సులువు కాదని అంటూ దాని గురించి వారికే బాగా తెలుస్తుందని తేల్చి చెప్తాడు. ఉర్దూ సాహిత్యంలో కవులు, రచయితలు మనిషి కన్నీరుకు పెద్ద పీట వేస్తారు. దానిని వారు గొప్పగా వర్ణిస్తారు. ఈ గజల్లో కుడా అలాంటి ఒక వర్ణనను చూడవచ్చు. రెండవ షేర్లో, కవి కన్నీరును స్వర్గంలో దొరికే ముత్యాలతో పోల్చి గజల్ కే వన్నె తెచ్చాడు. మూడవ షేర్లో ప్రియురాలి కురుల నలుపుదనాన్ని, రాత్రిలోని కటిక చీకటితో పోల్చాడు. నాల్గవ షేర్లో ప్రేయసిని ''నాకే చెందిన అందమా'' అని, తన మనసును దోచుకు నేందుకు ప్రయత్నిస్తాడు. అంతే కాదు, తన పెదాలను ఎర్రని రత్నాలతో పోలుస్తాడు. సిరాజ్ కలానికి ఉన్న కొంటెదనాన్ని గురించి మనం ఆరవ షేర్లో చూడవచ్చు. ముందే చెప్పినట్టుగా, వలీ గొప్పదనాన్ని గురించి సిరాజ్ చివరి షేర్లో ప్రకటిస్తాడు. వలీ కంటే గొప్ప కవిని తానెన్నడూ చూడలేదని చెప్పి ముగిస్తాడు.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి,
94410 02256