Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ భాషకు గతంలో కంటే ఎక్కువగా ప్రజలు పట్టం కట్టారు. ఈ సమయంలోనే పిల్లల కోసం 'ఇంటిభాష'లో కథలు రాసి మనసుల్ని గెలిచిన విజేత బాలల కథకుడు పెండెం జగదీశ్వర్. జగదీశ్ బాల సాహితీవేత్తగా ప్రసిద్ధుడు. కార్టూనిస్టు. ఉపాధ్యాయుడు. పిల్లల కోసం నిరంతరం తపించడమే కాక వివిధ సంస్థలు నిర్వహించిన కార్యశాలల్లో పాల్గొని, తాను స్వయంగా పిల్లల కోసం కార్యశాలలు నిర్వహించాడు.
జూన్ 28, 1976లో నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం మునిపంపులలో చేనేత కుటుంబంలో పుట్టాడు. తండ్రి కుటుంబానికి దూరంగా ఉండడంతో తల్లి సత్తమ్మ అన్నీ తానై జగదీశ్వర్‌ను పెంచి పెద్ద చేసింది. ప్రాథమిక విద్య నుండి డిగ్రీ వరకు రామన్నపేటలోనే చదువుకున్న పెండెం దూరవిద్య ద్వారా ఎం.ఎ తెలుగు పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో తెలుగు పండిత శిక్షణ పొంది 2008లో ఉపాధ్యాయునిగా నియామకం అయ్యాడు.
తొలినాళ్ళ నుండి తెలంగాణా భాషలో ఎంతో మంది ప్రసిద్ధ కవులు కవిత్వాన్ని, రచయితలు కథలను రాశారు. అయితే ఈ తరంలో తెలంగాణాలో ప్రతిభావంతంగా రాస్తున్నవాళ్ళు చాలా మంది ఉన్నప్పటికి పెండెం జగదీశ్వర్ది విలక్షణ శైలి. మనం చదివిన, మనకు తెలిసిన మన కథల్ని తెలంగాణా భాషలో చెప్పటం జగదీశ్‌కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని చెప్పొచ్చు. 1994 నుండి రాస్తున్న ఇతడు 'ఆనంద వృక్షం' పర్యావరణ కథలు, 'పసిడి మొగ్గలు', 'ఉపాయం', 'గజ్జెల దయ్యం' వైజ్ఞానిక కథలు, 'బాలల కథలు', 'విడ్డూరాల బుడ్డోడు', 'నూట పదహారు నవ్వులు', 'తాను తీసిన గోతిలో', 'ముగ్గురు అవివేకులు', 'విముక్తి', 'ఆంధ్రప్రదేశ్ జానపద కథలు', 'మాతో పెట్టుకోకు' మొదలగు పుస్తకాలు పిల్లల కోసం రాశారు. రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ఆదిలాబాద్‌లోని గొండి, కొలామి గిరిజన కథలను సేకరించే ప్రాజెక్టులో భాగస్వామ్యం అయిన పెండెం బాల సాహిత్య పుస్తకాల రూపకల్పనలో కూడా ముందు వరుసలో నిలిచాడు. బాలల మాసపత్రిక 'జాబిలి'కి, 'విద్యార్థి చెకుముకి' బాలల సైన్స్ పత్రికల సంపాదకవర్గంలో సభ్యునిగా కూడా సేవలు అందించాడు.
తొలినాళ్ళ నుండి వైజ్ఞానిక దృక్పథంతో రాస్తున్న రచయిత పెండెం జగదీశ్వర్. కళాజాత బృందాల కోసం, వయోజన విద్య ప్రచారం కోసం, ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక బాధ్యునిగా వైజ్ఞానిక, హేతు దృక్పథంతో రాస్తూ వస్తున్నాడు. జగదీశ్లోని హేతువాద, వైజ్ఞానిక దృక్పథానికి నిదర్శనంగా నిలిచే పిల్లల కథల పుస్తకం 'గజ్జెల దయ్యం'. ప్రజల్లోని మూడనమ్మకాలు, భయాలను కథల్లో బలంగా చూపిస్తూ దాని వెనుకవున్న కారణాన్ని లేదా హేతువును చూపించి చైతన్యం చేయడం ఈ కథల్లో చూస్తాం. ఈ వైజ్ఞానిక దృక్పథానికి 2015లో 'తెలుగు విశ్వవిద్యాలయం బాల సాహిత్య పురస్కారం' లభించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ద్వితీయభాష తెలుగు వాచకాల్లో పెండెం రచనలు పాఠ్యాంశాలుగా చేర్చారు. 2012-13లో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తక రచయిత.
ఇవన్నీ ఒక ఎత్తయితే తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక జగదీశ్ తెచ్చిన 'బడి పిలగాళ్ళ కథలు' తెలంగాణా భాషలో పిల్లలు చెప్పుకునే ఇరవై జానపద హాస్య కథల సంకలనం. ఇది తెలంగాణా బడి పిల్లల కోసం ఇంటి భాషలో వచ్చిన తొలి కథా సంకలనంగా పేరుతెచ్చుకుంది. 'రాట్నం రంగప్ప! దారం దానప్ప', 'అట్టున్నర, చెంపపెట్టున్నర', 'ముక్కులో ముల్లు విరిగిన పిట్ట', 'విడ్డూరాల బుడ్డోడు', 'ఏడుపు రాజ్యం', 'కుక్క తోక కూర', 'వంకాయకు చచ్చిన వగలమారి అత్త', 'రేపో మాపో' వంటి కథలు అద్భుత, హాస్యరసాలతో నిండిన కథలు. ఇందులోని కథనశక్తి జగదీశ్ ప్రతిభతో మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు.
పెండెం అనగానే గుర్తొచ్చే మరో బాలల కథల సంపుటి 'బడి పిల్లగాల్ల కతలు'. కేవలం బడి పలుకుల భాష కాకుండా పలుకుబడుల భాషలో వచ్చిన ఈ పుస్తకం పెండెంను ఒక్కసారిగా ఎత్తున కూర్చోపెట్టింది. అతనికి తన రామన్నపేట, దాని జీవిత నేపథ్యం, బడి, బడిపిల్లల వంటివి ఉపయోగ పడ్డాయని చెప్పొచ్చు. ఇందులో రచయిత ఉమయోగించిన భాష జీవభాషలోని పదాలు అతని సునిశిత పరిశీలనా శక్తికి లేదా గ్రామీణ జీవితంలో నిలువెల్లా మమైకమైన తనానికి నిదర్శనం. పుంటికూర (గోంగుర), చారాన (పావలా), పాశం (పాయసం), జెరంత (కొద్దిగా), వుర్కుడు (పరిగెత్తడం), గమ్మతిగ (సరదాగా), జల్దీ (వెంటనే) వంటి తెలంగాణీయులకు మాత్రమే తెలిసిన ఈ పదాలను రచయిత కథల్లో చెప్పిన వైనం గొప్పగా వుంది. ఈ పుస్తకాన్ని గురించి డా.వి.ఆర్.శర్మ '...తెలంగాణ భాష అధ్యయనానికి ఉపక్రమిస్తున్నవాళ్ళకు ఓ చక్కని వాచకంలా పయోగపడుతుంది' అన్నది అక్షర సత్యం. రచయితగా ఉదీయమాన దశలో ఉన్న సమయంలో 17 జూలై, 2018లో అర్దాంతరంగా తనువుచాలించాడు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548