Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేదాధ్యయనం ఆయనకు ఆసక్తి. తెలంగాణ జీవితాలు బానిస పాలన నుండి విముక్తి కావడం ఆయన కోరిక. మార్కిస్ట్ ఆలోచనతో సమసమాజ నిర్మాణాన్ని కాంక్షించిన సంప్రదాయవాది. అతనే స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ రంగాచార్య.
జననం, బాల్యం
రంగాచార్య వరంగల్లులోని గూడూరు గ్రామంలో ఆగస్టు 24,1928 లో జన్మించారు. వీరిది సనాతన సంప్రదాయ కుటుంబం కావడంతో చిన్నతనం నుండే భారతీయ జీవన విధానం, సంస్కతి, వేదం సాహిత్యం పట్ల సహజమైన పట్టు ఉండేది. వీరు ఉమామహేశ్వరరావు అనే బ్రాహ్మణుల బళ్ళో బాల్య విద్య చదివారు. 1936 లో నాలుగవ తరగతి పూర్తి చేశారు. పలు భాషలలో పండితులైన వీరి తండ్రి వలన వీరికి కొన్ని భాషలు అబ్బినాయి.
స్వాతంత్య్రోద్యమం
రంగాచార్య విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వం పట్ల నిరసన భావాన్ని పెంచుకున్నారు. 1940 లో నిజాం ఒక ఫర్మానా ద్వారా విధిగా ఫైజామా, శేర్వాని ధరించవలసిందిగా అజ్ఞాను వేసాడు. దీన్ని ధరించం అని కొంతమంది విద్యార్థులు మూడు రోజులపాటు నిరసన చేశారు. చివరికి పాఠశాల యాజమాన్యం గాంధీ టోపీ తప్ప ఏవైనా ధరించవచ్చని చెప్పడంతో నిరసనను విరమించారు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీ ఇచ్చిన నినాదం తెలంగాణలోని యువకులను ఆకర్షించింది. దేశ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా తెనాలిలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఉద్యమకారులు రైల్వే స్టేషనును తగులబెట్టారు. ఈ ఉద్యమంలోనే భాగంగా రంగాచార్య తెనాలికి వెళ్ళాడు. ఇటు నిజాం వ్యతిరేక తెలంగాణ స్వాతంత్య్రోద్యమంలో రంగాచార్య మిగతా స్వాతంత్య్ర సమరయోధులంత ఉధతంగా పాల్గొనలేకపోయాడు. తన అన్న కష్ణామాచార్య, వట్టికోటల ప్రభావంతో నిజాంపై తన వ్యతిరేకతను ప్రకటించాడు. 1945 లో తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించాడు.
బెజవాడ నగరం అంటే రంగాచార్యకు అమిత ప్రీతి. ఈ బెజవాడ గురించి తన 'జీవనయానం' లో ఇలా పేర్కొన్నాడు. ''బెజవాడ నాకు చాలా ఇష్టం. ఖమ్మం నుంచి కూడా తరచూ వెళ్ళేవాన్ని. బెజవాడలో తెలుగు బోర్డులు-తెలుగు పత్రికలూ-తెలుగు దానం-కష్ణవేణి-వంతెన మీద పోయే రైలు చూడ్డమంటే ఎంతో ఇష్టం. రిక్షావాళ్ళు, గుర్రబ్బళ్లవాళ్ళు పత్రిక చదువుతారు. రాజకీయాలు మాట్లాడతారు. అది నాకు ముచ్చట. ఇలాంటివి తెలంగాణలో చూడాలని ఆపేక్ష. దేశానికి స్వాతంత్య్ర రావాలి. నిజాం నవాబు పోవాలి. తెలుగు వాళ్ళంతా ఒకటి కావాలి. అదొక ఆదర్శం. అదొక గమ్యం'' ఈ విధంగా తెలంగాణలో ప్రతి దానికి ప్రభుత్వ ఆంక్ష ఉంది. బెజవాడలో ఉన్నట్టు తెలంగాణలో కూడా అలా ఉండాలని ఆయన కోరుకున్నాడు.
రచనలు
ఇతను మార్క్సిం గోర్కీ అమ్మ నవలకు ప్రభావితమయ్యాడు. గార్ల ప్రాంతంలో జరిగిన ప్రజా ఉద్యమాన్ని 'మోదుగుపూలు 'నవలలో చిత్రీకరించాడు. చిల్లర దేవుళ్ళు నవలకు 1971 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు అందుకున్నాడు. చిల్లరదేవుళ్ళు నవలలోని 'మంగళసూత్రం తెంపు' అనే అంశాన్ని రంగాచార్య మాడపాటి హనుమంతరావుకి చదివి వినిపిస్తుంటే మాడపాటి వారు అప్రయత్నంగా కన్నీరు కార్చారు. రంగాచార్య కొంతకాలం మీజాన్ పత్రికలో పని చేశాడు. 'మాయాజలతారు, శరతల్పం, పావని, రానున్నది ఏది నిజం, అమతంగమయ అనే నవలలు, జీవన యానం అనే ఆత్మకథ, 'నల్లనాగు' అనే కథానిక సంకలనం, కవిత్వం, మహుత్ముల జీవిత చరిత్రలైన బుద్ధుని కథ, మహాత్ముడు, శ్రీ మద్రామానుజాచార్యులు, పలు వ్యాస సంకలనాలు రాశాడు. రచనా రంగంలోకి వచ్చిన కొత్తలో 'దేహదాసు-ప్రాణదాసు అనే ఉత్తరాలు రాశాడు. రంగాచార్య ప్రధానంగా దోపిడీ, దౌర్జన్యాలను, బానిస తత్త్వాన్ని, స్వాతంత్య్ర కాంక్షను తన తొలి నవలలో పొందుపరిచాడు. ఆయన నాడు సమాజంలో ఉన్న విపత్కర పరిస్థితులన్నిటిని తన నవలలో చిత్రీకరించాడు. వేదాలను తెలుగులోకి అనువాదం చేశాడు. పలు నవలలను ఇతర భాషల నుండి తెలుగులోకి అనువదించాడు. అందులో మీర్జా రుస్వా ఉమ్రావ్ జాన్ రాసిన నవల 'అదా' ఒకటి.
వీరు రాసిన చిల్లర దేవుళ్ళు నవల అదే పేరుతో టి. మాధవరావు దర్శకత్వంలో సినిమాగా వచ్చింది. తన ఆత్మకథ అయిన జీవనయానంలో అటు భారత ప్రాచీన చరిత్ర నుంచి నిజాం వ్యతిరేక ఉద్యమం వరకు సందర్భానుసారంగా ఊటంకిస్తూ దశలుదశలుగా వివరించాడు. ఇది ఒకరకంగా ఉద్యమంతో లేదా సామాజిక అంశాలతో మమేకమైన ఆత్మకథగా చెప్పవచ్చు.
సత్కారాలు, పురస్కారాలు
వేదాలను తెలుగులో అనువాదం చేసినందున అభినవ వ్యాసుడు అనే బిరుదు పొందాడు. 2000లో తెలుగు విశ్వవిద్యాలయం వారి విశిష్ట పురస్కారం అందుకున్నాడు. కాకతీయ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ ను, 2010 లో అజోవిభో ఫౌండేషన్ వారి జీవన సాఫల్య పురస్కారం పొందాడు.
సాహిత్యంలో కుడి, ఎడమల భావజాలాన్ని లెక్క చేయకుండా నమ్మింది రాసాడు. రాసిందే ఆచరించాడు. అటువంటి ఆదర్శమూర్తి అయిన రంగాచార్యకు జూన్ 8, 2015 లో మరణం సంభవించింది.
- ఘనపురం సుదర్శన్, 9000470542