Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జననం, విద్య
అత్రాఫ్‌బల్దా జిల్లాకు తూర్పు నున్న షర్కీ తాలుకా బొల్లేపల్లిలో 4.6.1908లో జన్మించాడు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే పూర్తిచేసి, ఛాదర్‌ఘాట్ పాఠశాలలో, నిజాం కాలేజీలో చేరాడు. ఆ సమయంలోనే సేవా దక్పథంతో స్కౌట్ దళంలో కూడా చేరాడు. చదువుతున్నప్పుడే ఆటలపై ఆసక్తి పెరగడంతో ఇంటర్ కాలేజి ఛాంపియన్‌గా నిలిచి దేశీయ స్థాయిలో ఒలింపిక్ పోటీలకు వెళ్లి ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
సామాజిక, స్వాతంత్య్రోద్యమ ప్రస్థానం
ఇరవైయేళ్ళ ప్రాయంలోకి రాగానే గాంధీజీ రచనలపై దష్టి పడేసుకొని వాటిచేత ప్రభావితమయ్యాడు. ముఖ్యంగా గాంధీ ఆత్మకథలోని సామ్రాజ్యవాద వ్యతిరేక భావాలు రెడ్డి గారిని ఆకర్షించాయి. 1930 నాటికి సంస్థానంలో ఉన్న సంక్లిష్ట స్థితి గతులను పరిశీలిస్తూన్న క్రమంలో ఉప్ప సత్యాగ్రహం గురించి తెలిసింది. ఈ సందర్భంలో హైదరాబాద్ లో నిరసన తెలపడానికి అనువైన స్థలం లేదని, చెలికాని రామారావు నాయకత్వాన కాకినాడలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని దేశ స్వాతంత్య్రోద్యమానికి తన వంతు సహకారాన్ని అందించాడు. అనంతరం ఊరికి చేరాడు. ఆ రోజుల్లో రాట్నం అనేది అంతర్గత జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. బ్రిటిషు ఉత్పత్తులను తగ్గించడం వలన, మన వస్తువులను కొనడం వలన దేశానికి రాబడి పెరుగుతుందని, పైగా బ్రిటిషు వారిపట్ల వ్యతిరేకత పెరుగుతుందని నాటి నాయకులు తలిచి ఈ కార్యక్రమానికి పూనుకున్నారు.
నారాయణ రెడ్డి నిరాశకు, నిస్పహకు గురైన ప్రతీసారి పలువురి పుస్తకాలను చదివే వ్యక్తి. పుస్తకాల ప్రభావం మనుషుల ప్రభావాల కన్నా అధికంగా ఉంటుందని విశ్వసించిన వ్యక్తిత్వం ఈయనది. అందుకని జయప్రకాష్ నారాయణ గారి''సోషలిజం ఎందుకు'' గ్రంథంతో పాటు ''మాస్కో డైలాగ్స్'' అనే ఇతరుల గ్రంథాలు చదివి వాటి ద్వారా.నూతన ఉత్తేజాన్ని పొందాడు. గాంధీజి, దేశ ప్రజలందరినీ కలుపుకుంటూ పోతేనే స్వాతంత్య్రం సాధ్యమని నమ్మి, హరిజనుల పట్ల సమాజంలో ఉన్న హేయభావాన్ని నిర్మూలించేందుకు ''హరిజన సేవక సంఘాన్ని'' స్థాపించాడు. ఈ సంఘానికి హైదరాబాద్ సంస్థానంలో వామన్ నాయక్ అధ్యక్షుడిగా, నారాయణ రెడ్డి కార్యదర్శిగా వ్యవహరించారు. ఇలా రావి గారు కార్యదర్శి నుండి అధ్యక్షుడిగా 1938 వరకు ఉన్నారు.
తెలంగాణ ప్రజలను సాంస్కతికంగా మేల్కొల్పి తమ హక్కుల్ని తాము సాధించుకునెందుకు ఏర్పాటైన తొలి ఆంధ్ర మహాసభకు హాజరవుటకు ఆరుట్ల రామచంద్రారెడ్డితో సహా పదిహేను మంది సైకిళ్ళపై వాలంటీర్లుగా వెళ్ళారు. హైదరాబాదు సంస్థానంలోని ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, కోల్పోయిన హక్కులను పొందడానికి జాతీయ కాంగ్రెస్ స్థాయిలో ఇక్కడ ఆంధ్ర మహాసభలు జరిగాయి. ఈ మహాసభల ప్రభావం స్థానికంగా గాఢమైనది. ఇలా ఈ సభలు ఏటేటా జరగడంతో కాలం ముందుకు వెళ్తున్న కోద్దీ ప్రజలలో రాజకీయ, ఉద్యమ పరిస్థితుల పట్ల అవగాహన పెరిగింది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నాయకులకు సహకరిస్తూ వచ్చారు. జమీందార్లు, ఇతర భూస్వామ్య వర్గాల వారంతా కూడి చేస్తున్న దోపిడీకి తట్టుకొని ఆంధ్ర మహాసభ పక్షాన ఉండి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా నిలబడి వర్తక సంఘాన్ని స్థాపించుకొని తమ సమస్యలని పరిష్కరించుకునే దిశగా కదిలారు.
రావి నారాయణరెడ్డి మామూలు కార్యకర్త నుండి ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా ఆపై పార్లమెంటుకు లోక్ సభ సభ్యుడిగా ఎదిగి తాను నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమాన్నే ఆశించాడు. ఆ దిశగా పయనమై ప్రజల హదయాలలో లయనాదమై మోగాడు. ఇవాల్టికి కూడా హైదరాబాదులో పలు ప్రాంతాలలో తన పేరుపై వీధులు, సేవా సంఘాలు, వంటివి వెలిశాయంటే కేవలం తనకున్న సేవా దక్పథం, ప్రజల క్షేమమే కారణం.
మొదటి ఆంధ్రమహాసభ నుండి సంస్థానంలో ఉన్న సమస్యలను పరిశీలిస్తూ వచ్చిన రావి నారాయణ రెడ్డి హుజూర్ నగర్ తాలుకా చిలుకూరు గ్రామంలో 1941 లో జరిగిన ఎనిమిదవ ఆంధ్ర మహాసభకు తొలిసారి అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత 1944 లో భువనగిరిలో జరిగిన పదకొండవ ఆంధ్ర మహాసభకు ఏకగ్రీవంగా అధ్యక్షుడయ్యాడు. అప్పటికే రెండు పర్యాయాలుగా అధ్యక్షత వహించిన రావి 1945 ఖమ్మంలో జరిగిన పన్నెండవ మహాసభకు కూడా అధ్యక్షత వహించాడు. సాయుధ పోరాట సమీప కాలంలో మద్రాసు ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధిస్తున్నట్టు తెల్సుకున్న రావి, పార్టీ నిషేధానికి వ్యతిరేకంగా ప్రభుత్వంతో చర్చించడానికి మద్రాసు వెళ్ళాడు.
ఇలా స్టేటు కాంగ్రెసు కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగాడు. తొలి సార్వత్రిక ఎన్నికలకు జైళ్ళులో నుండే నామినేషన్ వేసి నల్గొండ నుండి ఎంపీగా, భువనగిరి గిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇక రెండవ సాధారణ ఎన్నికల్లో తన బావమరిదైన వెదిరె రామచంద్రారెడ్డి రావిపై కాంగ్రెసు పార్టీ తరపున బరిలో కి దిగాడు. మొత్తానికి 8 వేల ఓట్ల తేడాతో రావి గెలిచాడు.
ఈ విధంగా అతి సాధారణ స్థాయి నుండి అసాధారణ స్థాయికి ఎదిగిన రెడ్డిగారు తన యావజ్జీవితాన్ని ఆత్మకథగా ''వీర తెలంగాణ- నా అనుభవాలు, జ్ఞాపకాలు'' లో రాస్తూ తన జీవితాన్ని అందులో ఆవిష్కరించి 7.9.1991 లో దివికేగారు.
- ఘనపురం సుదర్శన్, 9000470542