Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ముట్టుకుంటె తగలాలి కవిత్వం మనిషిలాగా' అనే సంకల్పంతో కవిత్వం రాస్తున్న నిరంతర చలనశీల కవి, మానవ సంబంధాల్ని కవిత్వం చేస్తున్న సామాజిక డాక్టర్ డా.ఎన్. గోపి. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యుల నుండి ప్రతిష్టాత్మక తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్గా, వివిధ విశ్వ విద్యాలయాలకు ఇన్చార్జ్ వైస్ ఛాన్స్లర్గా ఉన్నారు. 'కాలాన్ని నిద్రపోనివ్వను' కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు అందుకున్నారు.
నేటి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నక్క లక్ష్మమ్మ-చెన్నయ్య దంపతులకు జూన్ 25, 1948లో పుటిన ఎన్.గోపి బాల్యం నుండి హయ్యర్ సెకండరీ వరకు భువన గిరిలో చదువుకున్నారు. డిగ్రీ నుండి పిహెచ్.డి వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఏడవ తరగతి విద్యార్థిగా భువనగిరి గ్రంథాలయంలోకి ప్రవేశించి అక్కడి మూడు వేల పుస్తకాలను చదివారు. బాల్యంలోనే డా.సి.నారాయణ రెడ్డి కవిత్వం చదివి, వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. బాలకవిగా ఎనిమిదవ తరగతిలోనే 'శశి' మకుటంతో శతకం రాశారు. ఇది 'నేత' పత్రికలో అచ్చయ్యింది. 'చందుర మామ! నీవు విలసన్ముృదు చాంద్రియు ఐక్యమైనటుల్ డెందములన్ని యేకమగుటెప్పుడు...' వంటి ప్రౌఢ పద్యాల శతకమిది. ఇప్పటికి వీరి యాభైఅయిదు గ్రంథాలు అచ్చయ్యాయి. వీటిలో 'తంగెడుపూలు', 'కాలాన్ని నిద్రపోనివ్వను', 'మైలురాయి', 'జలగీతం', 'చుట్టకుదురు', 'జీవన భాష' మొదలుకుని ఈరోజు ఆవిష్కరించబడుతున్న బృహత్ కవితా సంకలనం 'మనిషిని కలిసినట్టుండాలి' వరకు 27 కవితా సంపుటాలు, 6 విమర్శ గ్రంథాలు, 4 పరిశోధన గ్రంథాలు, 6 అనువాదాలు, 6 యాత్రా చరిత్రలు, 4 ఇతర ప్రక్రియల్లో రచనలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రచురించిన తెలుగు పాఠ్య పుస్తకాలకు సంపాదకులుగా ఉన్నారు.
డా.ఎన్. గోపి విద్యార్థిగా రచనలు చేయడమే కాక 1966-67 ప్రాంతంలో పిల్లల కోసం చక్కని బాల గీతాలు రాశారు. ఇవన్నీ 'ప్రజామత', 'కృష్ణాపత్రిక', 'నేత' పత్రికల్లో అచ్చయ్యాయి. డా.ఎన్. గోపి కవి, రచయిత, పరిశోధకుడు, విమర్శకుడు, వక్త, అనువాదకుడు, యాత్రా చరిత్రకారుడే కాదు, తన కవిత్వాన్ని అన్ని భారతీయ భాషల్లోకి, విదేశీ భాషల్లోకి తీసుకెళ్ళిన మహాకవి. డా.సి.నారాయణరెడ్డి ఒకచోట తొలి, మలితరం సాహతీ వేత్తలందరూ ఏదో ఒక సందర్భంలో పిల్లల కోసం యిష్టంగా రాసినవాళ్ళే అంటారు. వారిలో ఆచార్య గోపి కూడా ఉన్నారు. 'నానీ' కవితా రూప సృష్టికర్త యాభై యేండ్ల క్రితమే నానిగాల్లకు గేయ తాయిలం అందించడం విశేషం.
'అమ్మమ్మ దగ్గరికి / బొమ్మ గుర్రము నెక్కి / పోయి వస్తానమ్మ / పోయి వస్తాను' అంటూ బాల్యంలో అమ్మమ్మ యింటితో ఉన్న అనుబందాన్ని, అక్కడి ప్రేమలను గురించి 'బొమ్మగుర్రం'లో చెప్పిన కవి, అమ్మమ్మ పెట్టే తినుబండారాలు, తాత కుట్టించే కొత్త బట్టలు, అత్తామామల ప్రేమలను ఈ గేయంలో చక్కగా చెబుతారు. ఇటువంటిదే మరో గేయం 'బూచి'. ఇందులో బూచి వాడిని చూపించి పిల్లలను భయపెట్టె తల్లిదండ్రులను సంబోధిస్తూ '...పిరికి మందును నాకు / పోయకే మాయమ్మ / దమ్ముంటె బూచాన్ని/ రమ్మనవె దబ్బున' అంటారు. అంతటితో ఊరుకోరు, '... చెప్తెనమ్మవు కాని / చూపిస్త నా గొప్ప' అంటూ బాలల మనస్సుల్లో పిరికి తనాన్ని నూరిపోయొద్దని, వారిలో ధైర్యాన్ని, సాహసాల్ని పెంచె కథలు, విషయాలు చెప్పాలని అంటారు. నిజం కదూ!
డా. గోపి బాల గీతాల్లో సరదా సరదా గీతాలు, ఆటపాటల గీతాలు, అనుబంధాల గీతాల వంటివి అనేకం ఉన్నాయి. వాటిలో 'బొజ్జతాత' సరదాగా పాడుకునే గీతం. 'జేజేలండీ జేజేలు! / తాత బొజ్జకు జేజేలు!! / తకధిం తకధిం తకధిమ్మంటూ / తాత జొజ్జపై బాజాలు / తాత బొజ్జపై ఎగిరేవారు / తప్పక అగుదురు రాజాలు' అంటారు. ఇంకా తాత పిలక గురించి, ఆటల పాట గురించి చెప్పి వీరు బాలలను బంగరు పౌరులుగా తీర్చిదిద్దే తాత కథలను గురించి అద్భుతంతా చెబుతారు. మన మందరం అలా కథలు విన్నవాళ్లమే కదా! 'జేజేలండీ జేజేలు! / తాత కథలకు జేజేలు!!' అంటూ మన బాల్యాన్ని వెలిగించిన రాజకుమారుల కథలకు జేజేలు పలుకుతారు. ఇటువంటిదే మరో సరదా గేయం 'పొట్టిబావ'. ఇందులో సరదాతో పాటు బావ మరదళ్ల అనుబందాలు చెబుతారు కవి. 'ఒక్కనాటి పండుగకు/తిక్క బావ వచ్చాడు' అంటూ సాగుతుంది గేయం. సూర్యుని గురించి 'కర్మసాక్షి', బాలల మనస్తత్వ్తాలకు 'కీలు గుర్రం', 'రెక్కలుంటె!' వంటి గేయాలు అద్దం పడతాయి. ముఖ్యంగా బాలల ఆటపాటలను గురించి రాసిన 'చిన్నారి చేష్టలు' గేయం గొప్పగా ఉంటుంది. 'మట్టిపైన పిచ్చి / గీతలను గీస్తే / ముత్యాల ముగ్గులా / కనిపించు మాకు/ కిలకిలమని పాప/ నవ్వులొలికిస్తే / సెలయేటి స్వనములా / వినిపించు మాకు' ఇంకా 'అలుకబూనిన వేళ / చూడాలి పాపను / అందాల జాబిల్లి / సిగ్గుపడునప్పుడు'. ఇలా అనేక అంశాల మీద ఎన్నో చక్కని బాల గేయాలు రాసిన డా.ఎన్.గోపి తెలంగాణలో బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవుల్లో ఒకరు. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548