Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫాఇజ్ దెహల్వీ మీర్ తఖీ మీర్ తరానికి పూర్వం ఉన్న ఒక ప్రముఖ కవి. ఉర్దూ కవిత్వానికి పునాది వేసిన వారిలో ఫాఇజ్ దెహల్వీ ఒకడు. ఫాజజ్ అసలు పేరు సద్రుద్దీన్ ఖాన్. ఇతను 17 శతాబ్దంలో దిల్లీలో జన్మించాడు (దెహల్వీ అంటేనే దిల్లీ వాసి). ఇతని గురించి చాలా తక్కువ సమాచారం దొరుకుతుందని చరిత్రకారులు అంటారు. ఫాఇజ్ ముఘల్ పాలనలో దిల్లీ మన్సబుదార్ గా పని చేసాడు. ఇతను ఫారసీ అలాగే ఉర్దూలో కవిత్వం రాసాడు. ఫాఇజ్ తన కవిత్వంలో ఎక్కువగా గజళ్ళు, మస్నవీలను రచించాడు. మిగతా దిల్లీ కవుల లాగానే ఇతను కూడా వలీ మొహమ్మద్ వలీ దీవాన్ నుండి ప్రేరణ పొందాడు.
సయ్యద్ మసూద్ హసన్ రిజ్వీ రాసిన ఫాఇజ్ దెహల్వీ ఔర్ దీవాన్-ఎ-ఫాఇజ్ గ్రంథం ద్వారా తెలిసేదేమంటే ఫాఇజ్ ఒక క్రమశిక్షణ గల కుటుంబంలో పుట్టి పెరిగిన వాడు. గొప్ప పండితుల, గురువుల సాంగత్యంలో చేరడం వల్ల ఇతనికి మంచి సాహిత్య ఏర్పడింది. చివరి రోజుల్లో ఆర్థిక సమస్యలను ఎదుర్కున్న ఫాఇజ్, 1738 లో దిల్లీలో మరణించాడు.
మూలం:
తిరీ గాలీ ముర్a దిల్ కో ప్యారీ లగే
దుఆ మెరీ తుర్a మన్ మే భారీ లగే
తదీ ఖద్ర్-ఎ-ఇష్క్ కీ బూఝే సజన్
కిసీ సాత్ అగర్ తుర్a కూ యారీ లగే
నహీ తుర్a సా ఔర్ శోఖ్ ఐ మన్ హిరన్
తిరీ బాత్ దిల్ కో న్యారీ లగే
భవా తిరీ శంశీర్ జుల్ఫా కమంద్
పలక్ తిరీ జైసే కటారీ లగే
న జానూ తూ సాఖీ థా కిస్ బజ్మ్ కా
నయన్ తిరీ ముర్a కూ ఖుమారీ లగే
వహీ ఖద్ర్ 'ఫాఇజ్' కీ జానే బహుత్
జిసే ఇష్క్ కా జఖ్మ్ కారీ లగే
అనువాదం :
నువ్వు తిడుతుంటే నా ఎదకెంతో ఆహ్లాదంగా ఉంది
నే వేడుకుంటుంటే నీ మనసుకేమో భారంగా ఉంది
ఎప్పుడైతే నీకు ఒకరిపైన ప్రేమ ఏర్పడుతుందో
అప్పుడే నీకు ప్రేమికుల విలువ తెలిసి వస్తుంది
ఓ చంచల మనసా! నీవంటి జింక ఉండదు బహుశా
నీ మాటలెందుకో నా ఎదకు అందంగా అగుపిస్తాయి
నీ కనుబొమ్మలు ఖడ్గాలైతే, నీ కురులేమో పగ్గాలు
కనుగీటే నీ కనురెప్పలు కటారికత్తులకంటే తక్కువ కావు
నువు ఏ మధుశాలకు చెందిన దానివో తెలియదు కానీ
కన్నులు నీవి నన్ను మత్తుగొలిపించేవిగా ఉన్నాయి సాఖీ
ప్రేమానురాగాల గాయం లోతుగా ఎవరికైతే తాకుతుందో
వారికే 'ఫాఇజ్' విలువ ఏంటన్నది సరిగ్గా తెలుస్తుంది.
ఉర్దూ గజల్కి, ముందు భారతదేశంలోనే పునాది రాయి పడినా , దాని వికాసం మాత్రం దక్షిణం నుండే ప్రారంభమైంది. ఈ విషయాన్నే మనం ఈ కాలమ్ లోని 15వ ఎపిసోడ్ లో చెప్పుకున్నాము. ఆ తరువాత 16వ ఎపిసోడ్ లో, ఉర్దూలో వలీ రాసిన గజల్ దీవాన్ ని, తానే దిల్లీ కవులకు పరిచయం చేయగా వారు ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి ఫారసీ ని మెల్ల మెల్లగా పక్కకు పెడుతూ వారి అమ్మ భాషలో కవితలు రాసి మురిసిపోయారు. ఏ భాషనైతే జనాలు చులకనగా చూసారో ఆ భాషకు సాహిత్య గౌరవం తీసుకొచ్చారు. 18వ శతాబ్దానికి ముందే కొందరు కవులు ఉర్దూలో కవిత్వం రాసినా, అవి ప్రామాణికమైనవి కావని విమర్శకులు అంటారు. ప్రపంచంలోని ఏ భాష అయినా ఎక్కువగా వ్యాప్తి చెందింది అంటే ఆ భాషలో ఎవరో ఒక మహాకవి లేదా రచయిత తప్పక పుట్టి ఉంటారు. ఇంగ్లిష్ లో షేక్స్పియర్, జాన్ కీట్స్ లాగా, ఉర్దూ భాషలో కూడా అలాంటి వారున్నారు. వారే మీర్ తఖీ మీర్ అలాగే మీర్జా గాలిబ్. వీరితో పాటు మహాకవులు మరికొందరు కూడా ఉన్నారు. కానీ ఉర్దూ అనే పదం విన్నప్పుడు మొదటగా గుర్తొచ్చేది వీరే. ఈ విధంగా ఉర్దూ కవిత్వం ఎంతో ప్రగతి చెందింది. ప్రపంచ స్థాయి సాహిత్య భాషల్లో, ఉర్దూ ఒక సుస్థిర స్థానం సంపాదించుకుంది. ''మీర్, గాలిబ్ల జననం కంటే ముందు అభివద్ధి దశలో ఉన్న గజల్ శిల్పం ఎలా ఉందో చెప్పడానికే ఈ ఎపిసోడ్లో ఫాఇజ్ దెహల్వీ గజల్ తీసుకోవడం జరిగింది. ఇందులో కూడా కొన్ని చెప్పుకోదగ్గ వర్ణనలు ఉన్నాయి. మూడవ షేర్లో, మనసుకుండే చంచలతను లేడీ తో పోల్చడం సరైనదిగా ఉంది. నాల్గవ షేర్లో, ప్రేయసి కనుబొమ్మలను, కురులను, కనురెప్పలను పోల్చిన తీరు, వాటి వల్ల కవి ఎంతో చలించి పోయాడని చెబుతుంది. ఇక చివరి షేర్లో, ప్రేమానురాగాల విలువ ఎవరికైతే తెలుస్తుందో వారికే తన విలువ ఏంటన్నది తెలుస్తుందని చెప్పి, కవి తన ఆత్మగౌరవాన్ని చాటుకుంటాడు.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి, 94410 02256