Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాఠశాలల్లో చదువుకునేదే పాఠ్యగ్రంధం కాదు. జీవిత కాలం గుణపాఠాలు నేర్పేది ప్రతిదీ పాఠ్యగ్రంథమే. ఆ విధంగా చూసినప్పుడు కవిగాయకుడు. జయరాజు రచించిన అవని (ది నేచర్) పుస్తకం అందరినీ హృద్యంగా చదివించే అందమైన ఓ విశిష్ట పాఠ్యగ్రంథం అని చెప్పుకోవచ్చు.
'తత్వశాస్త్రం అంటేనే సత్య పరిశీలనా శాస్త్రం' అని అరిస్టాటిల్ చెప్పారు. ప్రకృతిని ఆ విధంగా ఓ సత్య శోథకునిగా తెలుసుకుని అలతి అలతి పదాలతో అందరికీ అర్థమయ్యే పద్ధతిలో హృద్యంగా చెప్పేందుకు శ్రద్ధగా ప్రయత్నించాడు జయరాజు. ఈ క్రమంలో తనదైన వినూత్న మార్గాన్ని సృష్టించారు. అంతేకాదు దానికి సోషలిస్టు వాస్తవికతతో కూడిన విశేషమైన మానవీయ అనుభవాన్ని జతచేశాడు. కవి కాబట్టి కవితాత్మ ఎలానూ ఉంటుంది. కనుకనే ఈ త్రివేణి సంగమంతో ఈ పుస్తకానికి ఓ విలక్షణత సమకూరింది.
ప్రకృతి లేకుండా మనిషి ఉండడు. కాని మనిషి లేకుండా ప్రకృతి ఉండగలదు. 'నేచర్ ఈజ్ అవర్ టీచర్' ప్రకతే మనకు మహోపాధ్యయురాలు. ప్రకతి నుండి ఉద్భవించిన మనిషి ప్రకృతి నుండే అనేక విషయాలు నేర్చుకుంటూ ముందుకు, మున్ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఇది మానవ పరిణామం. మంచి చెడు తేడా తెలిపే వివేకం జ్ఞానం అయినపుడు మనిషి ప్రకృతి విధ్వంసానికి ఎందుకు పాల్పుడుతున్నాడు? ఇది ఆత్మ హత్యా సదృశ్యం కాదా? అదే ప్రశ్న మనల్ని నీడలా వెంటాడుతూనే ఉన్నది.
నాలుగు కాళ్ళ నడకతో మొదలైన ఆది మానవుడు, అంగుష్టం కలిగిన అద్భుత హస్తాలతో పనిముట్లు తయారీని నేర్చుకుని అంతులేని విజ్ఞాన సంపన్నుడైనాడు. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. చీకటి ఖండాలను వెలుతురు ఖండాలుగా మారుస్తున్నాడు. అవయవదానాలతో పునర్జున్మలను ప్రసాదిస్తున్నాడు. అంతరిక్ష్య రహస్యాలను ఛేదిస్తూ గ్రహాంతర సీమలో అడుగిడుతున్నాడు. ఇలా నానాటికి మానవుడు అజేయుడు అవుతున్నాడు.
మరి అదే మనిషి మరోప్రక్క మారణాయుధాలు, అణుబాంబులు సృష్టిస్తూ, యంత్రంలో యంత్రమైపోతున్నాడు. రోబోగా మారిపోతున్నాడు. నిత్యం కంప్యూటర్ ముందు కూర్చోని వివేకం కోల్పోతూ సహజ ప్రపంచానికి దూరమై పోతున్నాడు. అంటే తన నుండి తాను వేరైపోతూ చాలా వేగంగా పరాయికరణ చెందుతున్నాడు.
ఇప్పుడు మనం ఓ సంధియుగంలో జీవిస్తున్నాం. మన పయనం నిర్మాణం వైపా? విధ్వంసం వైపా? తేల్చుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఏ ఖండంలోని మనిషైనా ఇప్పుడు పుడమి (ప్రకృతి) రక్షణ వైపు నిలబడితేనే మనిషిగా మిగులుతాడు. లేకుంటే అతడి విలాసమే గల్లంతయ్యే ప్రమాదం అతి సమీపంలో ఉన్నదని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. వాస్తవం కూడా.
కనకనే లివ్ అండ్ లెట్లివ్ (జీవించు - నీతో సహా సకల ప్రాణులను బతికించు) అనే ఆధునిక ధర్మం అందరికీ తారక మంత్రమైంది. ఇది 'అవని' పుస్తకంలోని ప్రతి అక్షరంలో ఆర్తిగా కన్పిస్తుంది.
డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం, నిర్జీవం నుండి జీవం, ఏక కణ జీవి నుండి అది మానవునిగా అవతరించిన తీరు అంతర్లీనంగా. గోచరిస్తుంది. అలాగే మార్క్స్ ఏంగెల్స్ గతి తార్కిక చారిత్రక భౌతికవాద సిద్ధాంతం కూడా వ్యక్తమవుతుంది. ప్రకృతి దృగ్గోచర విషయాలను ఓ పద్ధతిగా అధ్యయనం చేయడమే గతి తర్కం. దీనిని అభివృద్ధి చేసింది జర్మన్ తత్వవేత్త హెగెల్.
ప్రకృతి మానవ సమాజం నిరంతరం అభివృద్ధి చెందుతాయని తెలిపేదే గతితర్కం. తల క్రిందులుగా ఉన్న హెగెల్ భావవాద గతితర్కాన్ని, మార్క్స్ ఏంగెల్స్లు శాస్త్రీయ పద్ధతుల్లో సక్రమంగా నిలబెట్టారు. ఇదో విప్లవాత్మక మార్పు. మానవ చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్ర అని ఓ విజ్ఞాన శాస్త్రంగా తేల్చిచెప్పారు. సమాజ పరిణామ క్రమాన్ని సైద్ధాంతికంగా విశదీకరించారు.
కాగా, రెండు వేల సంవత్సరాలకు పూర్వమే గౌతమ బుద్ధుడు ఆచరణాత్మక ఉత్తమ మానవ ఆలోచనలకు ప్రవర్తనలకు ద్వారాలు తెరిచాడు. బుద్ధం శరణం గచ్చామి. సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనే త్రిరత్నాలను లోకంలో ప్రవేశపెట్టాడు.
ఈ మూడు తాత్విక భూమికలు పుస్తకంలోని అన్ని ప్రకరణల్లో ముప్పేటలా అల్లుకుని ఉంటాయి. సూక్ష్మంలో మోక్షంలా చైతన్యాన్ని బోధపరుస్తారు. ప్రకృతి తత్వంగా పరుచుకుని మృదువుగా పలుకరిస్తాయి.
అందమైన వర్ణచిత్రాలతో 'నేలమ్మ' నుండి విజ్ఞానులు వరకు నూట ఇరవైమూడు పైగా ప్రకరణలు ఉన్నాయి. ''ఊపిరితిత్తుల్లో విషం చేరింది గుండెలు బద్దలవుతున్నాయి. జీవజలం ఊరనంటుంది ఉమ్మ నీరు లేక అమ్మతనం కోల్పోతుంది.
మనిషి మనీగా ఏరోజైతే మారాడో (అవని) అమ్మకంటికి ఆనాడే పుట్టెడు దుఃఖం ఆవరించింది (అమ్మతనం పోయింది).'' మానవ జీవనానికి నవరసాలు లేవు. ఉన్నది ఒకే రసం కరుణరసం. ఏకోరస కరుణ: అన్నాడు భవభూతి. కవి కరుణ రస ప్లావితం కవిత్వం అద్దం పట్టడం ఇదే కదా... అని చదువుతున్న ప్పుడు మధురానుభూతి చెందుతాము.
కరుణ, జాలి, మమత, ఆప్యాయత, అనురాగం ఆత్మీయత, మాధుర్యం, ప్రేమ, స్నేహం, చెలమలు, ఊటల్లాగా, మదిలో ఇంకా చెమ్మగానే పదిలంగానే ఉన్నాయి. మదిలో అవని ఉన్నదా...? అవనిలో మది ఉన్నదా...? అనే అద్వైతాన్నీ రేకెత్తిస్తుంది.
ఆకలైనప్పుడు అన్నం పెట్టిన ఆ పంటపొలాన్ని ఆ అన్నం వడ్డించిన ఆ కరుణా మూర్తిని ప్రేమించాలి. నీ దాహం చూసి నీళ్ళు తెచ్చిన ఆ గిరిజన తల్లికి, ఆ నీటిని నీకు ప్రసాదించిన నేలతల్లికి కృతజ్ఞత కలిగి ఉండాలి అని చెబుతూనే, ఆ తల్లిని జాగ్రత్తగా భవిష్యత్ తరాలకు అందించడమే మన కర్తవ్యం. కనిపించని దైవం కన్నా కనిపించే దైవం ప్రకృతిని ప్రేమించడమే నిజమైన దైవారాధన అని విస్పష్టంగా తేటపరుస్తాడు.
ప్రకృతి నీ అవసరాలను తీర్చగలదు తప్ప నీ ఆశలను తీర్చలేదనే సత్యం తెలుసుకో మనిషిగా మసులుకో... (మనిషి) అని గాంధీజీలా సున్నితంగా హెచ్చరిస్తాడు. ఇలా ప్రతి అంశాన్ని మానవ జీవితాన్ని పాత్రి పదికగా చేసుకుని విశ్లేషిస్తూ బాటసారిలా సాగిపోతాడు.
మానవుడే అజేయుడు తప్ప మానవేతరశక్తులు ఏమీ లేవని. ఆ అద్భుత శక్తులు ఉంటే అవి. ఈ ప్రకృతిలోనూ, విశ్వంలోనే ఉన్నాయని, నిరంతరం మనిషి ఆ రహస్యాలను ఛేదిస్తూ ఆ విజ్ఞానాన్ని పంచుకుంటూ ముందుకు సాగుతాడని, అదే చారిత్రక సత్యమని అదే మానవ ప్రస్థానమని ఎందరో మహనుభావులు తెలియజేసిన వాస్తవాన్ని ఈ పుస్తకం కవితాత్మతో నొక్కి చెప్తుంది..
ప్రకృతి రహస్యాలను ఛేదించి మానవ సమాజానికి వెలుగు బాటలు పరిచిన సత్యశోధకులను జ్ఞాన సూర్యులుగా అభివర్ణించాడు. జయరాజు ఆర్ద్రత కల్గిన హృదయం పిల్లలకు చిన్నప్పటి నుండి అలవడి అభివృద్ధి కావాలంటే పిల్లలు, పెద్దలు, ఉపాధ్యాయులు కలిసి సమిష్టిగా ఇలాంటి పాఠాలను కథలను, కావ్యాలను చదువుకోవడం మినహా వేరే మార్గంలేదు. ఆ కలివిడిలోనే నవనీతమైన నును వెచ్చని తాజా జ్ఞానం ఉద్భవిస్తుంది.
వికసిస్తుంది విప్పారుతుంది పరిమళిస్తుంది అవని అంతటా పరుచుకుంటుంది. ఇదే ఈ 'అవని' మనకిచ్చే ప్రేరణ.
(అవని అంగ్లపుస్తక ఆవిష్కరణ సందర్భంగా...)
- కె.శాంతారావు, 9959745723