Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పసితనం బంగారం లాంటిది, అద్భుతమైనది! చిలిపితనం, కొంటెతనం,అల్లరి, ఆటలు, పంతం, పౌరుషం... అన్నీ మిళితమై ఉంటాయి' అని బాల్యాన్ని గురించి బంగారంగా చెప్పిన అమ్మమ్మ శారదా అశోకవర్ధన్.
28 జూలై, 1938లో సికింద్రాబాద్‌లో పుట్టిన శారదా అశోకవర్ధన్ ఆకాశవాణిలో ఫీల్డ్ ఆఫీసర్‌గా, జవహర్ బాల భవన్ సంచాలకులుగా, ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ కమీషనర్‌గా ఉద్యోగం చేశారు. తెలుగు సాహిత్యంలోని కథ, కవిత్వం, నవల, నాటకం, వ్యాసం, పాట మొదలైన అన్ని ప్రక్రియల్లో 80కి పైగా రచనలు చేశారు. ఆకాశవాణిలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం ద్వారా వీరు అందరికి అత్మీయులయ్యారు. సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా, రీజనల్ సెన్సార్ బోర్డు చైర్ పర్సన్‌గా సేవలందించారు. 'సాహితీ శిరోమణి', 'అభ్యుదయ రచయిత్రి, అభినవ భారతి' వంటి బిరుదులతో వీరిని పలు సంస్థలు సత్కరించాయి.
వీరి రచనల్లో ఎనిమిది కథా సంపుటాలు, 26 నవలలు, 3 వ్యాస సంపుటాలు, 10 కవితా సంపుటులు, 5 నృత్య నాటికలు, 7 నాటకాలు, 4 హాస్య గీతికలు, 2 బుఱ్ఱకథలు ఉన్నాయి. ఇవేకాక వివిధ పత్రికల్లో వీరు రాసిన కాలం రచనలు దాదాపు 1000 వరకు ఉండడం విశేషం. భానుమతి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'భక్త ధృవ మార్కండేయ', 'గోడ మీది బొమ్మ' మొదలగు పలు సినిమాలకు పాటలు రాశారు. మంగళంపల్లి బాలమురళికృష్ణ గానం చేసిన వీరి 'వినాయక సుప్రభాతం' మిక్కిలి ప్రసిద్ధి చెందింది. 1990, 1997, 2000లో ఆంధ్రప్రదేశ్‌లో మూడు నంది అవార్డులు పొందిన ఏకైక రచయిత్రి శారదా అశోక వర్ధన్. ఇదేకాక తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ నాటక రచయిత్రి, ఉత్తమ గేయ రచయిత్రి వంటి మూడు వివిధ ప్రక్రియల్లో పురస్కారాలు పొందారు. కవయిత్రి, రచయిత్రి గానే కాక వ్యాఖ్యాత్రిగా పరిచితులు.
ఎనభై రెండేళ్ల వయసున్న శారదా అశోకవర్ధన్ ఎనభై రచనలు చేయగా వాటిలో పదిహేడు పిల్లల కోసం రాశారు. '... పసివారిచేత ఉత్తమ గ్రంథాలు చదివించాలి' అని చెప్పే శారదమ్మ పిల్లల కోసం ఇన్ని పుస్తకాలు రాయడం గొప్పవిశేషం. పిల్లలను మిక్కిలి ప్రేమించే శారదమ్మ పిల్లల కోసం ఆంధ్రప్రభ దినపత్రికలోని 'చిన్నారి' శీర్షికలో మూడు సంవత్సరాలు 'మంచిమాట'లు రాసి పిల్లలకు, పెద్దలకు తాయిలంగా అందించారు.
'పతకం తెచ్చిన పేచీ' బాలల కథలు 1974, 'జాతీయ పర్వదినాలు' పండుగలు, జాతీయ పర్వదినాలకు సంబంధిం చిన రచన 1993, 'చాతుర్యం' కథ 1993, 'తండ్రీ కొడుకులు' బాలల బొమ్మల కథలు 1992, 'పిల్లల బొమ్మల పి.వి' భారత ప్రధాన మంత్రి పి.వి. నరసింహా రావు జీవిత చరిత్ర పిల్లల కోసం 1993, 'మనిషి తెలుసుకో' నృత్య నాటిక 1993, 'జంతువుల మహాసభ' నవలిక 2002, 'కిలకిల నవ్వుల పిల్లల్లారా!' బాలల బొమ్మల కథలు 2007, 'కాకి నీతి' పిల్లల నీతి కథలు 2015, 'చిన్నపిల్లలకు చిట్టి కథలు' నూరు కథల బృహత్ కథా సంకలనం 2017, 'రుక్మిణీ కళ్యాణం: పండుగలు, పర్వదినాలు' పౌరాణిక, సాంస్కృతిక, దేశభక్తి రచనలు 2017 మొదలైనవి వీరి బాలల రచనలు.
పిల్లల కోసం నీతి కథలు, జీవిత చరిత్రలు, నవలికలు వంటి అనేక ప్రక్రియల్లో రచన చేసిన శారదా అశోకవర్ధన్ జవహర్ బాల భవన్ సంచాలకులుగా బాలల కోసం అనేక విశేష కార్యక్రమాలను నిర్వహించారు. వీరి ఉద్యోగకాలంలో వచ్చిన 'బాల చంద్రిక' చక్కని బాలల పత్రిక. పిల్లల మనసుకు హత్తుకునేలా రాసే శారదమ్మ పిల్లల కోసం రాసిన నూరు కథలను కేవలం ఒక కథల పుస్తకంగా కాక బాలల విజ్ఞాన సర్వస్వంలాగా మలిచారు. ఇందులో పిల్లలకు సంబంధించిన అనేక అంశాలు, లెక్కలేనన్ని విషయాలు పొందుపరిచారు. తెలుగు నెలలు, కాలాలు, సవంత్సరాలు, ఆకు కూరలు, కూరగాయలు ఒక్కటి రెండని కాదు తనకు తారసపడిన ప్రతి విషయాన్ని, అంశాన్ని పిల్లల కోణంలో ఆలోచించి, పరిశీలించి రాశారు. కథలు కూడా అటువంటివే మరి.
ఇటీవల వచ్చిన మరో మంచి పుస్తకం 'రుక్మిణీ కల్యాణం'. ఇందులో రుక్మిణీ కల్యాణం, మన పండుగలు గురించి బాగా రాసారు శారదమ్మ. ఇంకా తెలంగాణ పెద్ద పండుగ బతుకమ్మ, సికింద్రాబాద్ మహంకాళి జాతర, సంక్రాంతి, ఏరువాక పున్నమి, బుద్దపూర్ణిమ, మహావీర్ జయంతి, ఈద్ మిలాద్, ఇస్లామియా ఉత్సవాలు, క్రైస్తవ ఉత్సవాలు, గుడ్ ఫ్రైడే వంటి వాటి గురించి పిల్లల కోసం శారదా అశోకవర్ధన్ రాసిన విధానం చాలా బాగుంది. పిల్లల కోసం పదిహేడు పుస్తకాలు రాసిన ఈ సికింద్రాబాద్ సిరిచుక్క ప్రస్తుతం మనవలు, మనవరాళ్ళతో కాలక్షేపం చేస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548