Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల సాహితీ రత్న, తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీత పెండెం జగదీశ్వర్ జయంతి (28-6-1976) సందర్భంగా జాతీయ పురస్కార ప్రధానోత్సవం (3-7-2022). ఈ పురస్కారాన్ని ప్రముఖ బాల సాహితీవేత్త, పరిశోధకులు, డా. వి.ఆర్.శర్మకు అందజేయుచున్న తరుణంలో అతని రచనల్లోని భాష, యాసలపై సమాలోచన.
పెండెం జగదీశ్వర్ ఓ కథల దండెం. అతని ఒక్కో కథ, దండెంపై వేలాడుతూ మెరిసే ఒక్కో నీటి బిందువులాంటిదని చెప్పవచ్చు. జగదీశ్వర్ పిల్లల కోసం సరదాగా కథలు రాయాలని ప్రారంభించాడే కానీ, తానో పెద్ద రచయిత కావాలన్న ధ్యాస అతనికి ఉండేది కాదు. తాను పిల్లల కోసం సేకరించి రాసిన కథలేకాక, సమాజంలోని వస్తువును తీసుకుని రాసిన స్వతంత్ర రచనలే అతన్ని ఓ పెద్ద రచయితగా నిలబెట్టాయన్నది నిస్సందేహం. అయితే పిల్లల్ని అలరించాలంటే పిల్లల యాస లోనే రాయాలన్న ఆలోచన వచ్చిన తరువాత, ఆ యాస కోసం, సంబంధిత మాండలికాల కోసం అతను చేసిన ప్రయత్నం ఎంతో గొప్పది. ఆ ప్రయత్నంలో జగదీశ్వర్ పిల్లల శ్వాసగా, యాసగా మారిపోయాడన్నది అతిశయోక్తి కాదు.
పాఠశాల ప్రార్థన సమయాన్ని గమనిద్దాం. ఆ సమయంలో పిల్లలు పాడే జనగణమన ప్రార్థనాగీతం మనకు మూడు రకాలుగా వినిపిస్తుంది. అంటే ప్రాథమిక విద్యార్థులు, ప్రాథమి కోన్నత విద్యార్థులు, ఉన్నత విద్యార్థులు పాడే జనగణమన ప్రార్థనా గీతం మూడు రకాల వేగంతో ముగుస్తుంది. దీనికి వారి వయస్సులో ఉన్న తేడాలతో పాటు వారి వారి ఉఛ్వాస నిశ్వాసాల్లో ఉన్న తేడాలే కారణం.
ఇక్కడ దీనిని ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటంటే, ఉఛ్వాస నిశ్వాసాలు, భాష, యాసలకు సంబంధముంది అని చెప్పడం. సాంకేతికత అందుబాటులో లేని అతి పురాతన కాలంలో మాన వుడు తన మనుగడ కోసం తన నివాస ప్రాంత పరిస్థితులతో (భౌగోళిక) పోరాడుతుండే వాడు. ఈ క్రమంలో వ్యక్తమయ్యే మాటలు ప్రాంతీయ అస్థిత్వ సంకేతాలతో ఉనికిలోకి వచ్చి, అవి ప్రాంతీయ భాషలుగా రూపొం దాయి. మరి యాసల పరిస్థితి ఏమిటి అనుకు న్నప్పుడు, మనిషి పోరాటం అంటే అప్పటి కాలంలో శారీరక పోరాటమే. ఆ సందర్భంలో అలసటకు గురైనప్పుడు వ్యక్తం చేసే మాటలు ఉఛ్వాస నిశ్వాసాల వేగానికి అనుగుణంగా వ్యక్త మయ్యేవి. కొండ ప్రాంతాల్లో నివసించే వారి శరీరం ఎక్కువగా అలసటకు గురయ్యేది కాబట్టి వీరి మాటల్లో వేగం ఎక్కువగా ఉంటుంది. దీని ప్రకారం పీఠభూముల్లోను, మైదానాల్లోనూ, నివసించే ప్రజల భాషల్లోనూ తేడాలు వచ్చాయి. అందుకే కొండ ప్రాంత ప్రజల మాటలు తరుముతూ ఉన్నట్టుగా ఉంటే, మైదాన ప్రాంత ప్రజల మాటలు దీర్ఘంతో కూడిన విగా ఉంటాయి. పీఠభూమిపై ఉండే ప్రజల మాటలు వీటికీ మధ్య రకంగా ఉంటాయి. ఈ విధంగా భౌగోళిక, చారిత్రక పరిస్థితులు మాండలికాల పుట్టుకకు కారణమైతే, ఉఛ్వాసనిశ్వాసాలు దాని యాసలకు కారణ మయ్యాయి.
కాలక్రమేణ రాజ్యాల ఆక్రమణ, ప్రజల వలస జీవితం, రాజుల భాషా పోషణ, మత మార్పిడుల కారణంగా ఈ భాషలు అనేక స్థానిక పరిస్థితుల సహజీవనంతో మరింత పరిపుష్టి చెంది, కొంగ్రొత్త పదాలుగా ఆవిర్భవిం చాయి. అయినప్పటికినీ కొన్ని పదాలు మార్పు చెందక, పలుకుబడులు, నుడికారాల రూపం లో సజీవంగా మిగిలిపోయి, పరిసర ప్రాంతాల సంస్కతుల ప్రతీకలు గా మారిపోయాయి. ఇప్పటికీ ఇవి సాంద్రతాపూరిత ధ్వని సంకేతా లతో సామెతలుగా, జాతీయా లుగా ఏర్పడి ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అందుకే మాండలికాలను జీవభాషగా చెప్పుకుంటారు. స్థానిక మాండలికాలు అక్కడి ప్రజల్ని మన అన్న భావనలోకి తీసుకెళ్ళి వారిని ఐక్యంగా మనగలిగేలాగ చేస్తాయి. సుదీర్ఘ కాలం తర్వాత తన మనుగడకు ప్రమాదం ఏర్పడినపుడు అస్తిత్వ శక్తిగా మారి పోరాటాలకు ఊతమిస్తాయి. ఈ పోరాటాలే తిరిగి ఈ భాషలకు జీవం పోస్తాయి. తెలంగాణ ఉద్యమంలో ఇది మనకు విధితమే. అయితే నిజంగానే కొందరు రచయితలు పోరాటకాలంలో చారిత్రకంగా తెలంగాణ సాంస్క తిక వైభవాన్ని నిలబెట్టాలన్న ధ్యేయంతో గ్రాంథికం నుండి మాండలిక రచనలకు పూనుకుంటే, కొందరు చరిత్రలో తమ పేరు నమోదు కోసం రచనలు చేశారన్నది కాదనలేము. వీటిలో మొదటి కోవకు చెందిన వాడు బాలల కథా రచయిత పెండెం జగదీశ్వర్, జగదీశ్వర్ అందరిలాగే మొదట గ్రాంధికంలో రచనలు మొదలు పెట్టినా అది సరళ గ్రాంధికమే. పిల్లలకోసం రచనలు చేయాలన్న ఆసక్తి అందుకు కారణం కావచ్చు.
మాండలిక శబ్దాలను గుర్తించటం వేరు. దానిని లిపిలో ఒదిగించటం వేరు. గ్రాంథికమైనా, వ్యవహారికమైనా దానికి ముందు వెనకాల నిలిపే పదాన్ని బట్టి సంభాషణా మాధుర్యం ఉంటుంది. వీటికి కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. ''మస్క శీకటి'' అనే మాటను ''మస్క చీకటి'' అనటం కన్న ''మస్క శీకటి'' అంటేనే బాగుంటుంది, లేదా 'మసక చీకటి'' అంటే బాగుంటుంది. అలాగే 'నిమ్మలంగ లేశి'' లేదా ''నెమ్మదిగా లేచి'' అనేవి దేనికదే సౌలభ్యంగా వుంటాయి. లాషిగ నవ్విండు, శిత్రబోయిండు, శెంగ శెంగ వంటి పదాలను మరికొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇతని రచనల్లోని యాసల మాధుర్యం చూడాలంటే, బడిపిల్లగాళ్ళ కథలు గమ్మతి గమ్మతి కథలు చదివి తీరాల్సిందే. ఇటువంటి నేర్పును సాధించటానికి ఆయన ఎన్నిసార్లు తన (నోటిలోని ) స్థాన కరణాలకు పని చెప్పి తనను తాను పరిశీలించుకున్నాడో లెక్కే లేదు. (అద్దంలో తన ముఖ కవళికల్ని తానే చూసుకుని కార్టూన్లు వేసుకున్న వాడు కదా ! భాషా, యాసల సాధనలోనూఅంతే )
జగదీశ్వర్‌కు చొరవ ఎక్కువ. కొత్త వారిని సైతం ఇట్టే ఆకర్షించి, చర్చల ముగ్గులోనికి దింపుతాడు. ఎదుటివారి అభిప్రాయాలు తీసుకోవడంలో ఏమాత్రం మొహమాటం లేని తనమే, ఆయనలోని భాషా పరిణతిని మరింత పెంచిందని చెప్పవచ్చు.
పిల్లల కోసం పిల్లల భాషలోనే రాయడం, పిల్లలకే అంకితం ఇవ్వడం, పిల్లల చేత రాయించి, పిల్లల చేతనే సమీక్షలు జరిపించడం, జగదీశ్వర్ పసితనాన్ని తెలియజేస్తుంది. చనిపోయేదాకా కూడా తనకు దగ్గరైన వారి పట్ల, తనకు చేయూతనిచ్చిన పెద్దల పట్ల అలకలు పూని వారిచే బుజ్జగింపులకు లోనైన స్థితిని బట్టి అతను పసితనం ఛాయల్ని వదులుకోనే లేదనిపిస్తుంది. యవ్వనంలోనూ పాల నురుగుల నవ్వే. అందుకే అతడంటే అందరికీ ఆత్మీయతే, బహుశా మత్యువుకూ అంతేనేమో......! బాల సాహిత్యంతో రచనలు ప్రారంభించినప్పటికినీ, సామాజిక ఇతివత్తాలను తీసుకుని, స్వతంత్ర రచనలతో మరింత ముందుకు సాగుతున్న దిశలో అతని మరణం సాహితీలోకానికి నష్టదాయకం.
- ఏబూసి నర్సింహ, 9542806804