Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'టసా వృత్తిగా, పాట ప్రవృత్తి'గా వెలుగుతున్న కవి 'గేయ కిరీటి' డా. వడ్దెపల్లి కృష్ణ. కవి, రచయిత, లలితగీత రచయిత, పరిశోధకుడు, విమర్శకుడు, సినీ గీత రచయిత, టి.వి., సినీ దర్శకుడు, బుల్లి తెర నిర్మాత, నటుడు అయిన వడ్డేపల్లి గేయాన్ని ప్రతిభావంతంగా రాస్తున్న కవుల్లో ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా సంగీత గేయ రూపకాల రచనలో అయనది అందెవేసిన చేయి. నేతి తరం రూపక రచయితల్లో అగ్రశ్రేణి కవి. 1948లో నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పుట్లారు వడ్డేపలి లక్ష్మమ్మ-లింగయ్యలు తల్లితండ్రులు. బాల్యం, విద్యాబ్యాపం సిరిసిల్లలోనే జరిగింది. తపాలాశాఖలో ఉద్యోగిగా స్వస్థలం సిరిసిల్లలోనే ఉద్యోగ జీవితం ప్రారంభించి, తరువాత హైదరాబాదుకు బదిలీ అక్కడే నివాసం ఉంటున్నారు.
1968 నుండి పత్రికల ద్వారా, 1969 నుండి ఆకాశవాణి, 1980 నుండి దూరదర్శన్, తెలుగు చలనచిత్రాల ద్వారా గీత రచయితగా సుపరిచితులైన వడ్డెపల్లి బుల్లి తెరకోసం అనేక దారావాహికలు రచించి, నిర్మంచి, దర్శకత్వం వహించారు. దాదాపు రెండు వందల వరకు సినీ గీతాలు రాయడమేకా స్వయంగా రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో వేయికి పైగా లలిత గీతాలు రాసి 'లలితశ్రీ' బిరుదు పొందారు. 'కనారా నీదేశం' గేయ కవితా సంపుటి, 'అంతర్మథనం' కవితా సంపుటి, 'వెలుగు మేడ' గేయ నాటికలు, 'వసంతోదయం' గేయ కావ్యం, 'రాగ రథం' లలిత గీతాలు, 'హాలాహలం' కవితా సంపుటి, 'మనసా తెలుసా' ముక్తకాలు, 'వడ్డెపల్లి లలిత గేయాలు', 'వడ్డెపల్లి రూపకాలు', 'తెలంగాణ రూపకాలు' వీరి ముద్రిత గ్రంథాలలో కొన్ని.
గేయ రచనలో అందెవేసిన వడ్దెపల్లి ఆటవెలది పద్యానికి కొత్త ఛందస్సును కూర్చి రాసిన కవితా రూపం 'పాటవెలదులు'. 2010లో స్వయంగా 'పాట వెలదులు' పేర గ్రంథాన్ని వెలువరించారు. ఇటీవల అనేకమంది పాట వెలది పద్యాలు రాయడం విశేషం. ఉస్మానియా తెలుగుశాఖలో 'తెలుగులో లలిత గీతాలు' అంశంపై సాధికారిక పరిశోధన చేసి పిహెచ్.డి పొందారు. వీరి సినిమా పాటలు పుస్తక రూపంగా రావాల్సివుంది. లలిత గేయాలతో పాటు ఇతర గీతాలు దాదాపు ఇరవై అయిదుకు పైగా ఆడియో, వీడియోల రూపంలో వచ్చాయి. ముక్తకాల వంటివి హిందీలోకి అనువదింపబడి ఖ్యాతిని పొందాయి.
1992లో తెలుగు విశ్వవిద్యాలయం బాల సాహిత్య రచనా పోటీలను నిర్వహించింది. ఆ పోటీల్లో వడ్డెపల్లి బాల గేయ సంపుటి 'చిరుగజ్జెలు' ఉత్తమంగా నిలిచి విశ్వవిద్యాలయ ఉత్తమ రచనా పురస్కారం పొందింది. ఆకాశవాణి, దూరదర్శన్ లో అప్పటికే పిల్లల కోసం రాస్తున్న వడ్డేపల్లికి మిక్కిలి పేరు తెచ్చిన బాలల సంగీత నృత్య రూపకాలు 'భావి పౌరులు', 'బాలానందం-భాగ్యనగరం'. ఈ రెండు ఎనభయ్యవ దశకంలో దూరదర్శన్ ద్వారా ప్రసారమయ్యాయి. 'గాంధీ-గణాధిపత్యం' రూపకాలు అమెరికా తెలుగు పిల్లల కోసం రాయగా ఆటా-తానా వంటి సంస్థల ఉత్సవాల్లో వీటిని పిల్లలు ప్రదర్శించారు. వడ్డెపల్లి గేయాలు చాలా కాలంపాట మహారాష్ట్ర ప్రభుత్వ తెలుగు రెండవభాష విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇటీవల ఆంధ్రప్రభలో రాసిన బాల రామాయణాన్ని 'వడ్డేపల్లి రాగ రామాయణం'గా ప్రచురిం చారు. నేటినిజంలో సంవత్సరం న్నర పాటు వచ్చిన గేయాలు 'బాల రసాలం'గా వచ్చాయి.
'పిల్లల్లారా! పిల్లల్లారా!/ అల్లరి చేష్టల పిడుగుల్లారా' అంటూ ఒకచోట పిల్లలను సంబోదించిన కవి కృష్ణ 'తెలుగు వారలం / మనం తెలుగు వీరులం / వెలితిలేని సాహసాల / వెలుగు ధీరులం / వీరనారి రుద్రమాంబ / వీరపత్ని మాంచాల / అబలలన్న అతివలనే / సభలు చేశారురా' అంటూ అలతి అలతి పదాలతో లలిత సుందరంగా రాస్తారు. ఇదే గీతంలో తెలుగు బాల వీరుడు బాల చంద్రునివంటి వారి వీరత్వాన్ని, శౌర్యాన్ని బాల్యంలోనే బాలలకు 'అలనాటి పలనాటి / బాలచంద్రుడే గాక / తెలుగునాట ఎందరో / తేజరిల్లినారురా!' అంటూ ఉద్భోదిస్తారు. లలితగీత రచనలో అంచుల్ని ముట్టితేనే ఈ లయ, ఈ సౌందర్యం సాధ్యం. హైదరాబాద్ మొదలుకుని గాంధీ వరకు, పర్యావరణం మొదలుకుని ప్రయాణ సాధనాల దాకా వందలాది అంశాలను బాలలకు తెలుపుతూ గేయాలు రాశారు వడ్డెపల్లి. జెండాను గురించి రాస్తూ, 'ఎగరేయీ మన జెండా! / సొగసైనా పూదండ ! / ఎగరేయీ పూదండా / గంగనేందిర సిగనిండా' అంటారు. 'మనమంతా బంధువులం / మానవతా సింధువులం', 'రెండు చేతులా నమస్కారం / నిండు మనసు మన సంస్కారం' అంటూ బాల్యం నుండే బాలల్లో చక్కని భావాలను గేయాలతో ప్రసరింపజేసిన వడ్డెపల్లి పర్యావరణం పట్ల పిల్లలకు అవగాహన కలిగించేందుకు 'చెట్లే ప్రగతికి తొలిమెట్లు / చెట్లే ప్రగతికి పనిముట్ల'ని చెబుతారు. భాషలో మెత్తదనం, భావాల్లో కొత్త దనంతో బాలల కోసం రాస్తున్న సిరిసిల్ల 'సిరివెలుగు' డాక్టర్ వడ్డెపల్లి కృష్ణ.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548