Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవాళిని ముందడుగేయించిన మహనీయుల్ని స్మరించుకోవడం కూడా రాని వాళ్ళమేమో అనిపిస్తుంది ఒకోసారి! చాలా ఆసుపత్రుల ప్రాంగణాల్లో అడుగుపెట్టగానే యాంటీ సెప్టిక్ లోషన్ కంటే ఘాటుగా ఏదో మఠం తాలూకూ బూడిద వాసన ముక్కుపుటాలు సోకుతుంది. ఆ పెద్ద పాదాలు చరకుడివో, శుశతిడివో కనీసం హిప్పోక్రేట్స్వో అయినా కాకపోతాయా అని అనుకొని కూడా ముప్పైయేళ్ళ పైమాటే! ఇటీవలి కాలంలో కొన్ని హాస్పటళ్ళలో గర్భగుడిని తలపించే హుండీలు కూడా చూశాక ఆ ఆశ చచ్చిపోయింది.
బ్రిటీష్ రాణికి బిడ్డ అడ్డం తిరగకపోతే, స్మెల్లీ చొరవ తీసుకోకపోతే, ప్రసూతి గదిలోకి పురుషుడి ప్రవేశానికి ఇంకెన్నాళ్ళు పట్టేదో! పాలక వర్గాలకు కాకతగిలితే గదా ప్రజోపయోగం అనే మాటకొక అర్థం దొరికేది.
అప్రస్తుతమైనా, డౌన్లోడ్ చక్రాలు ఇవ్వాళ మొరాయించకుండా తిరగడం వెనక జియో రాకుమారి అసహనమే కదా!
ప్రసూతిలో బొడ్డుతాడుని పళ్ళతో కొరికి వేరుచేయడం లాంటి సంప్రదాయం, ప్రతీ అచారంలోనూ సైన్సు దండిగా కనబడే వారికి అభ్యంతరకరం కాకపోవచ్చేమో గానీ ఇలాంటి అమానుషాలు చాలానే వున్నాయి వైద్య చరిత్రలో. ప్రతి జ్ఞానం వెనుకా అజ్ఞానమే వుంటుంది దీపపు నీడలా. ఆ నీడలో దాగొన్న అజ్ఞానాల్ని మాత్రమే కాదు, ఆ దీపపు శిఖ పంచే వెలుగుని కూడా చూపుతుందీ పుస్తకం.
ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, జర్నలిజం బోధించే కవితారావు, ''లేడీ డాక్టర్స్'' (ద అన్ టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ విమెన్ ఇన్ మెడిసిన్) పేరుతో తొలి తరపు ఆరుగురు భారతీయ మహిళలు వైద్యవిద్యను నేర్చుకోవడానికి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఇందులో పరిచయం చేశారు. ఆంగ్లంలో వున్న ఈ గ్రంథాన్ని వైద్యంతోనూ, అంతకంటే మించి సామాజిక స్పహనూ కలిగిన చెలికాని రామారావు ట్రస్ట్ ఈ విలువైన గ్రంథాన్ని తెలుగులో అందించారు. దీన్ని అత్యంత శ్రద్ధగా, వైద్యుడు కాని డాక్టర్ పి.ఎస్ ప్రకాశరావు ఎంత బాగా అనువాదం చేశారంటే, వైద్యరంగంపై ఎంతో అనురక్తి వుంటే తప్ప ఇది అసాధ్యం అన్నట్టు.
మానవ నాగరికత గొప్పగా విలసిల్లుతోంది అనుకున్న కాలం తర్వాత కూడా మహిళ ఈ ప్రపంచంలో భాగస్వామి అనిపించుకోవడానికి కూడా శతాబ్దాలే పట్టింది. మావో ఈ ప్రపంచాన్ని మోసే సగం గురించి మాట్లాడినప్పుడు అది అర్థమే కాలేదు. స్త్రీకి మర్మస్థానమే కాదు హదయం కూడా వుందని చెలం చెబితే అవాక్కయిన సమాజం నిన్న మొన్నటిదే కాదు ఇప్పటిది కూడానూ! 60 రోజులు ఓడలో పస్తులుండి ప్రాణాలు ఉగ్గబట్టుకుని, యావత్ సంప్రదాయం వెన్నుపట్టి వెనక్కి లాగుతుంటే, భర్త అనునిత్యం రిమోట్ సెన్సింగ్ తో పవిట ఎటుతిప్పి వేసుకోవాలో కూడా చెబుతుంటే, పెన్సిల్వేనియాలో వైద్య విద్య పూర్తి చేసుకున్న ఆనందీబాయి అనారోగ్య కారణంగా కంటే పురుషాధిక్యపు దాస్టీకానికే పట్టుమని ఇరవై రెండేళ్లు కూడా నిండకుండానే బలైందని అనిపిస్తుంది ఈ కథనం చదివాక.
కాదంబిని ఎడింబరోలో చదివినా ఆమెకి జరిగిన ఒక్క అవమానం గురించి చెబితే అన్నీ చెప్పుకున్నట్టే!
ఒక ధనికుడి ఇంట్లో పురిటి కేసులో తల్లీ బిడ్డల్ని కాపాడిన ఆమెకు పనిమనిషి పక్కన కూర్చోపెట్టి భోజనం వడ్డించారు. తర్వాత తను కూచొని తిన్న ప్రాంతాన్ని శుద్ది చేయాల్సిందిగా చెప్పారు! కారణం ఏం లేదు వారు మనుధర్మాన్ని అక్షరాలా పాటించారు మరి.
రుక్మా బాయి రౌత్ అనే మేలిమి బంగారం, ఒక శూద్ర మహిళ, అతివాద జాతీయ నాయకుడు తిలక్ చెప్పినట్టు పారిశుధ్యం, పాచిపనీ, కుట్టుపనీతో సరిపెట్టుకోకుండా ఏకంగా వైద్య వత్తిలో అసమాన ప్రతిభాశాలిగా పేరుతెచ్చుకుని ఎదిరించిన కథనాన్ని చదివితీరాల్సిందే. స్త్రీ విద్య నుంచి, వివాహ వయస్సు వరకూ వినాశకర సంస్కత భాషా జ్ఞానంతో ఆదిమ సమాజం కూడా గర్హించే అనేక విషయాలను తిలక్ ఎంత బాగా సమర్ధించేవాడో తెలుసుకోవాలంటే ఇది చదవాలి. దురదష్టవశాత్తూ వైద్యుడ్ని పంక్తి భోజనానికి అనర్హుడిగా ప్రకటించిన మనుధర్మం బోధిస్తూ, అదే 'అప్రాచ్యపు' వైద్యుడితో పీఠాధిపతులు వాక్సిన్ వేయించుకొనే గడుసుదనం ఈ పుణ్య భూమిలో తప్ప మరెక్కడా చూడం.
ఎనభైసంవత్సరాల వరకూ ట్రంక్ పెట్టెలో దాగిపోయిన ఒక అబల తాలూకూ జీవితం హైమవతీ సేన్ ది.
తొమ్మిదో యేట పెళ్లి, 12 ఏళ్లకు వైధవ్యం, అచ్చం మనుధర్మశాస్త్ర శాసనబద్ధమే జీవితం. కానీ దాన్ని ఎదిరించి వైద్యురాలి గానే కాదు, పునర్వివాహం కూడా చేసుకొని ధాతత్వానికి నిలువెత్తు దర్పణంగా, హరించిపోతూ వెలుగు పంచిన ఈ మాణిక్యం గురించి చదివితీరాలి.
ముత్తు లక్ష్మీరెడ్డి అనే ఈ ఆణిముత్యం దేవదాసీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా అసాధారణమైన ప్రజ్ఞతో, అపారమైన విశ్వాసంతో, అనితర సాధ్యమైనరీతిలో వైద్యురాలైన తీరు స్ఫూర్తిదాయకం. బాలికల వివాహ వయస్సును 16 దాకా పెంచడంపై గాంధీని సైతం ఒప్పించిన ముత్తు, కౌన్సిల్ సభ్యుడు సత్యమూర్తి దేవదాసీ వ్యవస్థ రద్దు వద్దన్నప్పుడు, ''అలా అయితే ఏళ్ల తరబడి దేవదాసీలు ఆ పనులు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ సారి ఆ విధుల్ని బ్రాహ్మణ బాలికలకు అప్పగిద్దాం'' అని తెగేసి చెప్పగలిగింది.
ఇంకా, ''ప్రసూతీ - శిశుపోషణా'' గ్రంధాన్ని రాసిన ప్రసిద్ధ వైద్యురాలు కొమర్రాజు అచ్చమాంబ గారి గురించీ, రెండో ప్రపంచ యుద్ద సమయంలో భారతీయ వైద్య సేవా విభాగంలో సేవలందించిన హిల్డా మేరీ లాజరస్ గారి గురించీ, తూర్పు గోదావరి జిల్లాలో తొలితరం మహిళా వైద్యులుగా ఎందరి మన్ననలో అందుకున్న డాక్టర్ కమలమ్మ గారి గురించీ ఈ పుస్తకంలో సంక్షిప్తంగానైనా విలువైన విషయాలు చర్చించారు.
శాస్త్ర గమనమంతా ఎదురీత! యే యుగంలో నైనా సాఫీగా సాగనివ్వకుండా అడ్డుకుంది మతమో, ఆ పేరుతో పురుషుడో! అడ్డుకున్న పురుషాధిక్యతనూ చూస్తారు, అదే సమయంలో ఆదరించిన పురుషులూ కనబడతారిందులో! పుస్తకం పేరు లేడీ డాక్టర్స్ అయినా ప్రధాన విషయం అంతా సామాజికమే! ఇది సమాజ ప్రగతిని కాంక్షించే ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.
మరీ ముఖ్యంగా, ఈనాడు స్వేచ్ఛగా వైద్య విద్యని అందుకోవడానికి పరోక్షంగా ఎందరు త్యాగమూర్తులు కారకులయ్యారో తెలుసుకోవడానికి ప్రతీ వైద్య విద్యార్థీ తప్పకుండా చదవాల్సిన పుస్తకమిది.
ఇంత విలువైన గ్రంధాన్ని తెలుగులో అందించిన చెలికాని రామారావుగారి ట్రస్ట్ కూ అంతే శ్రద్ధతో చక్కని అనువాదం చేసిన పి.ఎస్. ప్రకాశరావు గారికి ధన్యవాదాలు.
- వి. విజయకుమార్, 8555802596