Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాలల లోకం-భలే ప్రపంచం / ఆటలు పాటలు ఆనందాలు / ఆనందాలే అందాలు' అన్నది డాక్టర్ మలయశ్రీ బాలల లోకానికి, వాళ్ళ ఆనందాల తీరానికి తన బాల గేయాల్లో రూపుకట్టిన అక్షరచిత్రం. డా. మలయశ్రీ హేతువాది, బౌద్ధ తత్వ్తానుయాయి. మానవతావాద బాల సాహితీమూర్తి. పద్యం, వచనం, గేయం, విమర్శ, నవల, కథారచన, అనువాద రంగాల్లో ఐదున్నర దశాబ్ధాలుగా కృషిచేస్తున్న సాహితీవేత్త. వీరు 1940వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా చంజర్లలో పుట్టారు. వందకు పైగా పుస్తకాలు రాసిన మలయశ్రీ పిల్లలకు గేయం, కథ, కవిత్వం, చైతన్య గీతాలు, నర్సరీ గేయాలు, జీవిత చరిత్రలు వంటి 26 పుస్తకాలు కానుకగా అందించారు. 'వెయ్యేండ్ల కరీంనగర్ జిల్లా సాహిత్యం'పై సాధికారిక పరిశోధన చేసి పిహెచ్.డి పొందారు.
మలయశ్రీ శతాధిక రచనల్లో ఎనమిది కథా సంపుటాలు, 26 నవలలు, 3 వ్యాస సంపుటాలు, 10 కవితా సంపుటులు, 5 నృత్య నాటికలు, 7 నాటకాలు, 4 హాస్య గీతికలు, 2 బుఱ్ఱకథలు ఇంకా అనువాదాలు, వ్యాఖ్యానాలు వంటి అనేక గ్రంథాలు ఉన్నాయి. ఇవేకాక వివిధ పత్రికల్లో వీరు రాసిన కాలం రచనలు దాదాపు 1000 వరకు ఉండడం విశేషం.
బాల సాహితీవేత్తగా మలయశ్రీకి మిక్కిలి పేరుతెచ్చిన పుస్తకాలు 'రంగుల పిట్టలు', 'సరదా కథలు', 'బంగారు బొమ్మలు', 'చుక్కల లోకం', 'పసిడి పలుకులు', 'పాలమనసులు' మొదలైనవి. ఇవేకాక 'విజ్ఞానదర్శిని, లోకజ్ఞానం 1,2 భాగాలు, భార్గవి, మన శరీరం, గ్రహాలు-నక్షత్రాలు, సుమతి పద్యాలు, రింగింగ్ బెల్స్ అండ్ డాన్సింగ్ డాల్స్, వన్ హండ్రెడ్ కానొడ్రమ్స్, మంత్రాలు-మాయలుతో పాటు నవరత్న వారి కోసం రాసిన 10 దేశనాయకులు జీవిత చరిత్రలు మలయశ్రీ బాల సాహిత్యంలో ఉన్నాయి. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను చేపట్టి వాటిని సుసంపన్నం చేసిన మలయశ్రీ బాల సాహిత్యాన్ని అదే స్థాయిలో అందించారు. బాల సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో రచనలు చేసినప్పటికీ, ప్రధానంగా బాల గేయాలు రాశారు.
'అమ్మ అంటేనే కళ్ళు చెమ్మగిల్లుతాయి / తల్లి కంటే వేరే దైవం లేదోయి!' అంటూ 'రంగుల పిట్టలు'లో అంటాడు. మరోచోట- 'అమ్మ నాకు దేవత - నాన్న నాకు దేవుడు / అమ్మా-నాన్న దేవుళ్ళు - అందరికన్నా మంచోళ్ళు' అని దండం పెడతారు. ఇది మలయశ్రీ తల్లితండ్రులకు తన గేయాల్లో కల్పించిన స్థానం. బాల్యం నుండే బాలల్లో నాటుతున్న సంస్కారభీజాల ఆరోపం. పిల్లల కోసం ఏది రాసినా అందుకు ప్రయోజనాన్ని ఎంచి రచన చేసే మలయశ్రీ తన గేయాలన్నీ ఆ దిశగానే మలిచారు. 'కారం కారం ఓ కారం / కారం కానిది ఉపకారం / కారం నేరం అపకారం / శ్రీకారం ఓ కారం', 'మాటకు ధాటి / పాటకు పోటి / వేటకు సూటి / ఆటకు మేటి / కావాలీ కావాలి!', 'అందాం అందాం ఏమందాం / అందరం మనమందరం ఒకటే అందాం' వంటి గేయపాదాలు మలయశ్రీ రచనాశక్తికి ఉదాహరణలు. ఇతర బాలగేయ కర్తల రచనలను, వీరి రచనలు చూసినప్పుడు వాటిలో ఆయనదైన ఒక శైలి, పద్దతి కనిపిస్తుంది. 'కులమేదైనా / గుణమే మిన్నా / మతమైదైనా / మనసే మిన్న / భాషేదైనా / భావం మిన్న / దేశమైదైనా / మనిషేకదన్న!' అన్నది మలయశ్రీ సందేశం.
రచయితగానే కాక వ్యక్తిగా కూడా మలయశ్రీ పిల్లల పక్షపాతి. 'ఆటలాడే పాపాయి / పాటలు పాడే పాపాయి / ఆటలు మంచివి - పాటలు మంచివి!' అని నమ్మినవారాయన. పిల్లలకు సరదా గేయాలతోపాటు ఆరోగ్య సూత్రాల్ని గేయాల్లో 'అమ్మ'లాగా చెబుతారు. ఆరోగ్యాంశాలేకాక వైజ్ఞానికాంశాల్ని కూడా తన రచనల్లో పొందుపరిచారు మలయశ్రీ. సూర్య చంద్రులు, పంచభూతాల గురించి వారు రాసిన గీతం చూస్తే పాటలతో పాఠాలు ఎంత తేలికగా అర్థమయ్యేట్టు చెప్పచ్చో తెలుస్తుంది.
'సూర్యుడు చంద్రుడు / చుట్టాలు మనకు / మెరిసేటి తారలు / మిత్రులు మనకు / నేల మన తల్లి / నీరు మన ప్రాణం గాలి మన ఊపిరి / నిప్పు మన వేడి /... పంచభూతాలు ప్ర / పంచ బాంధవులు' అంటూ- ఇవన్నీ 'ఆమ్లజని, అన్నవస్త్రాలు' ఇస్తాయంటారు. తెలుగు విశ్వవిద్యాలయం బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు.
అర్థంపర్థం లేకున్నా రంజింపజేసి, ఆనందింపజేసే పదాలతో రాసిన 'ఇంగ్లీష్ నాన్సెన్స్ రైమ్స్'కు ఉన్న స్థానం మనకు తెలిసిందే. మలయశ్రీ బుడి బుడి అడుగుల పిల్లలు ఆడుతూ పాడుకునేందుకు 'పసి (డి) పలుకులు' పేరుతో తెలుగు రైమ్స్ రాశారు. లయతో, అంత్యప్రాస పదాలతో ఇవి ఇంగ్లీష్ రైమ్స్కు ఏమాత్రం తీసిపోకుండా సాగాయి. 'పువ్వోరు పువ్వు / నవ్వోరు నవ్వు / నువ్వే నవ్వు / నవ్వే నువ్వు', ౖ'రొట్టె రొట్టె ఎట్టాయె? / మొక్క పెరిగి చెట్టాయె! / కుక్క మొరిగి రట్టాయె! / అక్క చీర పట్టాయె!' చదివినాకొద్ది చదవాలనిపించే తత్త్వం వీరి రైమ్స్లో ఉన్నాయి. ఇలా విలక్షణ రచనల ద్వారా తెలంగాణలో బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన స్వాతంత్య్రానంతర తెలంగాణ బాల సాహితీవేత్తల్లో డా. మలయశ్రీ ముందు వరుసలో నిలుస్తారు. జయహో! మలయశ్రీ గారు!
- డా|| పత్తిపాక మోహన్, 9966229548