Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశం ముందుగా సాగాలంటే యువత అన్ని రంగాలలో రాణించాలి. అలా రాణించాలంటే నైపుణ్యత చాలా అవసరం. నైపుణ్యతలో ముందుండే వారికే ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయి. అందుకే నైపుణ్యాల ఆవశ్యకతను ఎప్పటికప్పుడు గుర్తు చేసేందుకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై 15వ తేదీన ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని (WYSD) జరుపుకుంటారు. ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం ప్రపంచ స్థాయిలో యువత నైపుణ్యాల అభివృద్ధి, ప్రాముఖ్యతను హైలైట్ చేయడం. యువత అవసరమైన నైపుణ్యాలను పొందేలా ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. యువతను ఒక నిర్దిష్ట రంగంలో నిష్ణాతులుగా చేసేందుకు దోహదపడుతుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వల్ల వ్యక్తిగత వృద్ధికి, కెరీర్ వృద్ధికి తోడ్పడుతుంది. ఈ వేడుక యువత, నిరుద్యోగులకు సాంకేతిక వృత్తి విద్య శిక్షణ గురించి అవగాహన కల్పించడంతో పాటు స్థానిక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన ఇతర నైపుణ్యాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుంది.
యువతను పని చేయడానికి అనుమతించని నైపుణ్యాల కొరత గురించి కూడా అవగాహన కల్పిస్తుంది. వరల్డ్ యూత్ స్కిల్స్ డే యువత తమ కెరీర్ లక్ష్యాలను, విజయాన్ని సాధించడంలో సహాయపడే కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలను పొందేందుకు ప్రోత్సహిస్తుంది. అంతేకాదు తాము చేస్తున్న పని పట్ల విశ్వాసాన్ని అందిస్తుంది.
చరిత్ర
మొదటి ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం జూలై 15, 2015న నిర్వహించారు. 18 డిసెంబర్ 2014న, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) జూలై 15వ తేదీని ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవంగా తీర్మానాన్ని ఆమోదించింది. మెరుగైన సామాజిక-ఆర్థిక పరిస్థితులను సాధించడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం.
యువత నైపుణ్యాల అభివృద్ధి ప్రాముఖ్యతను ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకువెళ్లేందుకు G77 & చైనా మద్దతుతో శ్రీలంక ఈ తీర్మానాన్ని ప్రోత్సహించింది. నిరుద్యోగం, ఉపాధి కల్పన వంటి అంశాలలో యువతకు మెరుగైన సామాజిక-ఆర్థిక పరిస్థితులను సాధించేదిశగా ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.
ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం ప్రాముఖ్యత
2020లో ప్రపంచవ్యాప్తంగా, COVID-19 కారణంగా, యువత ఉపాధి 8.7 శాతం తగ్గింది. చిన్న చిన్న వ్యాపారులు వ్యాపారాలను మూసివేశారు. 6 మంది యువకులలో ఒకరికంటే ఎక్కువ మందికి ఉపాధి లేదు. ఈ క్లిష్ట పరిస్థితిలో నైపుణ్యం కలిగిన వ్యక్తులు మాత్రమే ఆర్థికంగా స్థిరంగా ఉన్నారు.
2022 థీమ్
ప్రతి సంవత్సరం, ఐక్యరాజ్యసమితి ప్రారంభించిన ఒక నిర్దిష్ట థీమ్‌తో ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవ సెలవుదినాన్ని జరుపుకుంటారు. 2022 సంవత్సరానికి, థీమ్ ''జీవితంలో స్థిరమైన అభివృద్ధి కోసం నేర్చుకునే నైపుణ్యాలు'' పెంపొందించడం.
ఎలా జరుపుకుంటారు?
ప్రతి సంవత్సరం ఈ రోజున, న్యూయార్క్ నగరంతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐక్యరాజ్యసమితి (UN) ప్రధాన కార్యాలయంలో అనేక యువజన కార్యక్రమాలు జరుగుతాయి. ఫోటోగ్రఫీ, వ్యాసరచన, అనేక ఇతర నైపుణ్య-ఆధారిత పోటీలతో సహా వివిధ ఈవెంట్లు, పోటీలను నిర్వహిస్తారు.
నైపుణ్యం ఆధారంగా కొత్త కోర్సులను ప్రారంభించడం ద్వారా, పాత నైపుణ్యాలను మెరుగు పరచడం, కష్టపడి పనిచేయడం ద్వారా వృత్తి శిక్షణ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం వంటివి ఇందులో ప్రధానమైనవి.
నిరుద్యోగులుగా ఉండి, వయసు పైబడుతున్న వారు ఇప్పటికే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నారు. తక్కువ నాణ్యత గల ఉద్యోగాలు, ఎక్కువ లేబర్ మార్కెట్ అసమానతలు వంటివి నేడు కనపడుతున్నాయి. అంతేకాదు, మహిళలకు తక్కువ ఉపాధి, తక్కువ జీతం, పార్ట్ టైమ్ ఉద్యోగాలు లేదా తాత్కాలిక ఒప్పందాల కింద పని చేసే అవకాశాలు మాత్రమే ఉన్నాయి.
ఉద్యోగాల ప్రామాణికతను పరిగణలోకి తీసుకుంటే యువత నిరుద్యోగానికి ప్రధాన కారణం నైపుణ్యత కలిగిన వారికే ఉద్యోగావకాశాలు మెండుగా ఉండడమే. ఇటువంటి వారినే యాజామాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అటువంటి వారికే ఉద్యోగ భద్రత ఉంటుండటం వల్ల నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ఇది ఏ ఒక్క దేశానికో పరిమితమై ఉండడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలను ప్రభావితం చేస్తోంది. ఆర్థిక వ్యవస్థ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అయితే, సుస్థిర అభివద్ధి కోసం 2030 ఎజెండాలో ఈ అంశాన్నే చేర్చారు.
నైపుణ్యాలను నేర్చుకొకపోతే ?
మత్తు పదార్థాలకు అలవాటు పడటం, హింసాకాండ, సంఘం వ్యతిరేక దిశలో పయనించడం, నిరుద్యోగులు పెరగడం, పేదరికం పెరిగిపోవడం, ఆత్మహత్యలకు పాల్పడటం, హత్యలు చేయడం, యువత శారీరక, మానసిక సమస్యలకి లోనవ్వడం తదితర అంశాలు యువత ఆత్మస్థైర్యం తగ్గిపోవడం, నైపుణ్య లేమి వంటి అంశాలు తలెత్తుతున్నాయి.
స్కిల్స్ డే కోసం
1. నేటి యువత సమయం వృథా చేయకుండా సాంకేతిక పరంగా ముందంజలో నిలవాలి.
2. ఒకరి నైపుణ్యాలను మరొకరితో పోల్చుకోవద్దు. ఇది మానసికంగా వెనుకంజ వేయించే ప్రమాదం ఉంది.
3. జీవితంలో యవ్వనం ఒక్కసారి మాత్రమే వస్తుంది.
4. ఆలోచనా సరళి మొత్తం నైపుణ్యాలను పెంపొందించుకునే విషయాల గురించి మాత్రమే ఉండాలి.
5. యువత తమలోని ప్రతిభ, నైపుణ్యాలను వెలికి తీసి ప్రపంచం ముందుకు నడిచేందుకు దోహదపడాలి.
6. ప్రతి వ్యక్తి నిత్య విద్యార్థి కావాలి. జీవించి ఉన్నంత వరకు ఏదొకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఏదైనా కష్టంగా అనిపిస్తే దానిని మరింత శ్రద్ధతో నేర్చుకోవాలి. నేర్చుకోవడంలో అలసిపోతే వ్యక్తిగా లెక్కలో లేనట్లే భావించాలి.
7. నైపుణ్యాలు ఎంత నేర్చుకుంటే నిరుద్యోగ సమస్య అంత అంతరించిపోతుంది.
8. స్కిల్ డెవలప్మెంట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే సమర్థులుగా ఎదుగుతారు, బాగా జీవిస్తారు.
9. నేర్చుకోవడం, జీవించడం రెండూ ఒకదానితో మరొకటి విడదీయరానివిగా కలిసి ఉండేవి.
10. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపించే వారి జీవితం ఎప్పటికప్పుడు కొత్తదనంతో ముందుకు సాగుతుంది.
నేటి పోటీ ప్రపంచంలో యువత ముందుకు సాగాలంటే నైపుణ్యాల మీద దృష్టి సారించడం చాలా ముఖ్యం. తద్వారా వారి భవిష్యత్తు, దేశ ప్రగతి, ప్రపంచ పురోగామి సాధిస్తుంది. ప్రపంచ మనుగడ ఉన్నది యువత చేతుల్లోనే...!!
- డా.హిప్నో పద్మా కమలాకర్, 9390044031
కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్