Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యం. ప్రగతి, జి.నిర్మలరాణి, బి.హేమామాలిని సంపాదకులుగా, అనంతపురం జిల్లా మహిళా కథకుల 'ముంగారు మొలకలు' కథా సంపుటి అభినందించతగ్గ సాహితీ సత్కృషిగా ప్రశంసనీయం. 25 కథలు ప్రచురించబడిన ఈ సంపుటిలో కథా నిర్మాణం, వస్తు వైవిధ్యం, సరళమైన శైలితో (తెలుగు కథ తొలి రచయిత్రి భండారు అచ్చమాంబ స్మృతి కీర్తిమంతంగా) మహిళా కథకులు తమ కలాలకు పదును పెట్టారు. కథాసంపుటికి తొలకరి మొలకలు అని పేరు పెట్టినా నాలుగు తరాల మహిళలు రాసిన కథలివి. 'అమళ్ళదిన్నె పద్మజ' సంపుటిలోని మొదటి కథగా అనూహ్యమైన ముగింపుతో, హేతువు కళ్ళు తెరిపించింది! 'చిలుకూరి దీవెన' 'ఆటపట్టు' కథలో కులవివక్ష కారణంగా క్రీడారంగంలో బంగారు కతకాలు రావటం లేదనే అభిప్రాయం కథ నడిపిస్తుంది. 'పరిణీత' లో 'సి.ఎమ్. అనూరాధ', ప్రేమోన్మాదాన్ని సంయమనంతో ఎలా పరిష్కరించవచ్చో వివరించారు. 'మెరవణి' కథలో 'భాస్కర బాల భారతి', పెళ్ళిళ్ళ మోసాలు ఎదుర్కొన్న ఒక మహిళ, తన చిరకాల కోరికను వివాహాలు జరిపించి తీర్చుకోనటంగా కథ నడుస్తుంది. బ్రతుకుపోరులో హెచ్.కె. ఫైరోజాబాను యువతలో ఆత్మస్థైర్యం ఓటమిని జయించాలంటారు. చేలూరు రమాదేవి 'ఊర్నుండి ఎల్లగొడదాం' కథలో మద్యంపై పోరాటం, ఎం.కె. దేవకి 'సంపూర్ణక్క - తవుసుమాను' అనంత గ్రామీణ మాండలిక అద్భుతాలను ప్రతిబింపచేసింది. పి.షహనాజ్ 'అమ్మకో గూడు' కథలో శేష జీవిత ప్రశాంతత, ఆలూరి లక్ష్మీదేవి 'మనసున మనసై'లో కేవలం పురుషునిగానే కాకుండా మంచి వ్యక్తిత్వం కోసం యువతుల బాధలు స్పష్టం అవుతున్నాయి. అరుణ కాకి రచన 'సాబువ్వ', ఉన్నమట్ల స్వర్ణకుమారి కథ 'బ్రతుకుతెరువు' పోరాల శారద కథ 'నారాయణమ్మవ్వా', బి. హేమామాలిని 'ధైర్యం'లో లైంగిక వేధింపులు ఎదుర్కోవటం, కె.సుభాషిణి 'మెరుసు సీమ'లో ఆనకట్ట నిర్మాణ నిర్లక్ష్యం, 'కొండసాని రజిత 'బహుమతి'లో బాలికలో శారీరక మార్పు, లక్ష్మీ కుడాల 'అపరాధం' కథలో అమ్మ భాష మీద ప్రేమ, యం.ప్రగతి రచన 'రైటింగ్ కౌచ్'లో వాట్సప్ సందేశాలు, ఫొటోలు సృష్టించే వేదన, ఆవుల జయప్రద కథ 'ఋణ చిత్రం'లో కరువు సీమలో బడుగు రైతుల జీవన వ్యథ, ఎ.జయలక్ష్మీరాజు కథ 'వరాహమూర్తి'లో కాలనీలో పందుల బెడద, ఆర్.శశికళ 'అమ్మమ్మ మనసు' లో కాలనీలో భూ సమస్య, డా.పుట్టపర్తి నాగపద్మిని కథ 'భూల్ భువైయ్యా..!' కథలో రైలు ప్రయాణంలో పిల్లల్లేని ఒక మహిళ పరాయి పిల్లాడి పట్ల చూపించిన అనురాగం త్రిప్పిన మలుపు, సింగాడి శోభామణి కథ 'కాకి'లో కాకి బతుకు పోలిన వృద్ధుని వేదన, బి.బిజిలి చిన్న కథ 'పేరేందబ్బా...?'లో కథ రాసే తాపత్రయం, సులోచనా దేవి మాడుగుల 'రానిక నీకోసం'... కథలో చెలిమిపల్లి నుంచి బస్తీకి కొడుకింటికి వచ్చిన కన్నతల్లి విషాద కథనం, సంపుటిలో అన్ని కథలలో మానవతా విలువలు, జీవిత సత్యాలు, మహిళలు అనుభవించే వేదనాయుత సమస్యలు కథా రూపంలో పరిష్కార ప్రతిభావంతంగా ప్రతిబింబింపచేసారు. రచయిత్రులందరూ అభినందనీయులు.
ముంగారు మొలకలు (అనంతపురం జిల్లా మహిళా కథకుల కథలు)
సంపాదకులు : యం.ప్రగతి, జి.నిర్మలారాణి, బి.హేమామాలిని
పేజీలు : 224, వెల : రూ.250/-
ప్రతులకు : యం.ప్రగతి, 1-4-193, జానకిరామ నగర్, అనంతపురము - 515004; అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...
ఫోన్ : 94407 98008
- జయసూర్య, 9014948336