Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బానిసత్వం నీడలా వెంటాడితే అలాంటి జీవితాలలో ఎప్పుడు వెలుగు పూలు పూయవు. అమాయకత్వాన్ని నిరక్షరాస్యుల అసమర్ధతను ఆసరాగా చేసుకొని పశువుల కన్నా హీనంగా మనుషులను చూసిన అగ్రవర్ణ బ్రాహ్మణ వ్యవస్థ స్వాతంత్రానికి పూర్వం (18 శతాబ్దం) దేశంలో ఉంది. సాటి మనిషిని మనిషిగా చూడని వ్యవస్థ ఆనాడు ఉండేది. నేటికీ అక్కడక్కడ చాపకింద నీరులా పారుతానే ఉంది. విద్య, విజ్ఞానం, ఆస్తి, అధికారం సమస్త సామాజిక సంపదంతా కూడా అగ్రవర్ణాల గుత్తాధిపత్యంలో ఉండటంతో చదువుకు, జ్ఞానానికి దూరమైన బహుజన మూలవాసులు వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల పడి ఉండే పరిస్థితి ఆనాడు దాపురించింది. ఎప్పుడైతే బహుజనులు అక్షరాలతో దోస్తీ చేసిండ్రో అప్పుడు తెలిసింది. ఇన్నెండ్లు ఎంత అమానవీయ జీవితాలను గడిపామని.
ఆనాటి కాలంలో అగ్రవర్ణ బ్రాహ్మణులు తప్ప మిగతా కులాలు ఎవరు కూడా విద్యను చదవకుండా వారికి దూరం చేశారు. బ్రాహ్మణీయ వ్యవస్థ శాసించిన శాసనాలను ఆచారాలను ధిక్కరిస్తూ ఆధునిక మానవతా ఆలోచన పరులైన రాజా రామ్మోహన్ రారు, స్వామి దయానంద సరస్వతి, మహాత్మా జ్యోతిబాపూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి ప్రముఖులు జ్ఞానవంతులై సామాజిక సంఘసంస్కరణ దిశగా కుల నిర్మూలన దిశగా పీడిత వర్గాన్ని సాంఘిక విప్లవోద్యమానికి సన్నద్ధం చేశారు. బహుజనుల ఆరాధ్య దైవమైన జ్యోతిబాపూలే తన జీవితానంత ప్రజల కోసం అంకితం చేశాడు. అట్లాంటి మహనీయుడిని మనకు పరిచయం చేస్తూ ప్రముఖ నవలా రచయిత బెక్కం జనార్దన్ ఆయన జీవిత చరిత్ర సూక్ష్మంలో మోక్షంగా భావితరాలకు ఒక కరదీపికలాగా సత్యశోధకుడు పేరుతో మన ముందుకు తెచ్చాడు. ఇంతకుముందు పాలమూరి ప్రజల ధిక్కార గొంతుక, పేద ప్రజల పెన్నిధి పండుగ సాయన్న జీవితాన్ని నవలా రూపంలో మనకు అందించాడు.
ఎవరి జీవితానైనా కండ్ల ముందు ఉంచాలంటే అలాంటి ఆశయాలు సిద్ధాంతాలు కలిగిన వారే యదార్థ జీవితాలను మనముందు ఉంచుతారు. బెక్కం జనార్ధన్ కవిగా, రచయితగా, వక్తగా రాజకీయ నాయకుడిగా, న్యాయవాదిగా, బహుజన అస్తిత్వాల ఆనవాలుగా ఉద్యమ పోరాట స్ఫూర్తి కలిగిన తెలంగాణ ఉద్యమ నాయకుడిగా నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో చూపిన వ్యక్తిగా ఉండి బహుజనుల ఆరాధ్య దైవమైన జ్యోతిబాపూలే గారి జీవితాన్ని మనం ముందుంచి చదివే వారందరికీ స్ఫూర్తిని పొందేలా సత్యశోధకుడిని పరిచయం చేశారు.
జ్యోతిబాపూలే బానిసత్వం, కుల నిర్మూలన, నిచ్చెన మెట్ల వ్యవస్థను నిరసించి పాలకవర్గ దోపిడి విధానాలను ఎప్పటి కప్పుడు ప్రజలకు తెలిపి వారిలో చైతన్యాన్ని రగిలించాడు. రాజకీయ సాంఘిక ఆర్థిక అణిచివేతలను ఎదిరించి సమ సమాజాన్ని స్వప్నించాడు. శాంతియుత ఉద్యమాలతో పోరాడి విద్యావాప్తి విజ్ఞానానికి మూలమని తలచి ఎందరికి అక్షరాలను పంచిన అక్షర జ్ఞాని. మూఢవిశ్వాసాలను తొలగించి మనుషులు స్వేచ్ఛగా ఆలోచన చేసి స్థాయికి ఎదిగేలా సత్యశోధక సమాజాన్ని స్థాపించాడు. ఒక సంఘ సంస్కర్తగానే కాక ఉపాధ్యాయుడిగా, బహుజన ఆశాజ్యోతిగా, కవిగా విభిన్న పాత్రలు పోషించి తన జీవితాన్ని బహుజనుల కోసం అంకితం చేసిన విధానాన్ని బెక్కెం జనార్దన్ అక్షరాలతో ఒక రూపంఇచ్చి మలిచిన తీరు బాగుంది.
ఆవేశం, ఆలోచన, ఆచరణ కలగలిపి ఆశయాలను జనానికి బోధించి పీడనం, దోపిడి వ్యవస్థను ఆనాటి మానసిక సంఘర్షణను పెత్తందారుల ఆగడాలను పూలే ఏ విధంగా ఎదుర్కొన్నారో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ఈనాటి సామాజిక రుగ్మతల పైన పోరాడ వలసినటువంటి అవసరం ఉందని బెక్కెం జనార్దన్ చెప్పకనే చెప్పారు. జ్యోతి బాఫూలేను గుండెలో దాచుకొని గుప్పెడు అక్షరాలతో మన ముందుకు వచ్చిన సత్యశోధకుడిని చదవండి చదివించండి. బానిసత్వం కులం ఎక్కడున్నా జ్యోతిబాపూలే స్ఫూర్తితో ఎదుర్కొని జ్ఞాన నవ సమాజ నిర్మాణంకై కదులుదాం. సామాజిక స్పహ కలిగిన ప్రజల మనిషిని పరిచయం చేసిన మీ కలం నుండి మరిన్ని ఇలాంటి సామాజిక చైతన్యకావ్యాలు రావాలని ఆశిస్తున్నాను.
- బోల యాదయ్య,
9912206427