Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరిత్ర మట్టి పొరల కింద కప్పబడ్డ చరితార్థులైన మహనీయుల జీవిత చరిత్రలు ఎన్నో! తెలుగు నాట కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో కమ్యూనిస్టు తాతయ్యగా ఖ్యాతినొందిన మార్పు పద్మనాభం జీవితం నేటి తరాలకు నిత్య స్మరణీయం. ఉత్తరాంధ్ర స్వాతంత్య్రోద్యమ కారులు, ఆ తరువాత కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర వహించిన తొలితరం వారు పద్మనాభం. ప్రజాకవి వాగ్గేయకారుడు, విప్లవవాణి సుబ్బారావు పాణిగ్రాహి లాంటి వారు సైతం ''పద్మనాభం తాతా'' అని పిలిచే వ్యక్తి పద్మనాభం. పద్మనాభం 1896లో పుట్టారు. ఆంధ్ర కమ్యూనిస్టు ఉద్యమంలో ఆ సీనియారిటీ మరెవ్వరికీ లేదు. పుచ్చలపల్లి సుందరయ్య 1913, చండ్ర రాజేశ్వరరావు 1914లో పుట్టారు. వీరి కంటే పద్మనాభం 18 సం|| పెద్ద. ఆంధ్ర రాష్ట్ర పార్టీ కార్యదర్శి మద్దుకూరి చంద్రం 1907లో పుట్టారు. తెలంగాణ రావి నారాయణరెడ్డి 1908, ఆరుట్ల రామచంద్రారెడ్డి 1909, కొల్లా వెంకయ్య 1910లో పుట్టారు. రైతాంగ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో పద్మనాభం పని చేసిన గొప్ప త్యాగమయ జీవితం ఆయనిది. 1940లో ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఆయన మృతి చెంది 56 సం|| అయ్యింది (2022 నాటికి). నేటికీ ఆయన గొప్ప చరిత్రకారునిగా ప్రజలచే శ్లాఘించబడుతున్నారు. కడలూరు జైలులో గానుగుల తరుణాచారి, బెందాళం గౌరయ్యలు తోటి ఖైదీలుగా ఉన్న స్థితి. రైతులు ఆందోళనలు, సత్యాగ్రహ ఉద్యమాలు, అక్రమ అరెస్టులు, జమీందార్లు చేసే దౌర్జన్యాలు, జైల్లో హక్కుల పోరాటాలు, శ్రీకాకుళంలో రైతు సంఘాలు, పార్టీ నిర్మాణంలో పద్మనాభం కృషి విశిష్టమైనది. క్షయవ్యాధి తగ్గించుకోమని తోటి రాజకీయ ఖైదులు రూ.500/- ఇస్తే, ఆ ధనాన్ని పార్టీకి అందజేసిన త్యాగి ఆయన. తన మంత్రి వర్గంలో స్థానం ఇస్తా, ఎర్ర జెండా వదలమని టంగుటూరి ప్రకాశం పద్మనాభాన్ని ప్రలోభపెట్టిన సందర్భంలో ''మూడు రంగుల జెండాలో సుత్తి కొడవలి గుర్తు మీరు పెట్టడానికి ఒప్పుకుంటే, ఈ జెండా వదిలేస్తా'' అని ఎదిరించి మాట్లాడిన ధీరుడు పద్మనాభం. సోంపేట నుంచి సి.పి.ఐ అభ్యర్థిగా పద్మనాభం 1952లో పోటీ చేశారు. ఓడిపోయారు. సోంపేట తాలూకాలో బెందాళం గౌరయ్య, మార్పు పద్మనాభం, తరుణాచారి పూర్తి కాలపు కార్యకర్తలై పార్టీని విస్తరింపజేశారు. ముగ్గురూ ఒక్క భావంతో. 1964లో ఆయన సీపీఎం పక్షం వైపు నిలిచారు. 1966లో మృతి చెందారు. రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ నేతగాఆయన కుమారుడు బాలకృష్ణయ్య ఎంఎల్సీగా పనిచేశారు (1974). ఇంటి పేరునే సార్థకం చేసుకున్న మార్పు పద్మనాభం జీవితం స్ఫూర్తిదాయకం.
1927 నాటికే తరుణాచారి, పద్మనాభంతో జాతీయోద్యమంలో పాల్గొనడం గాంధీని కలవడం, మరో మిత్రుడు గవరయ్యలతో కలిసి పనిచేయడం, ముగ్గురూ క్విట్ ఇండియా ఉద్యమంలో పనిచేసి, జైలు శిక్షలు అనుభవించడం, కమ్యూనిస్టులుగా రూపొందడం, మామిడిపల్లి కమ్యూనిస్టు గ్రామంగా మార్చడం, 1962లో రాజకీయ పాఠశాల పెట్టడం అక్కడే పంచాది కృష్ణమూర్తి, నిర్మలకి పెళ్ళి జరగడం, బెందాళం గవరయ్య అధ్యక్షబాధ్యతలు, తరుణాచారి కార్యదర్శి బాధ్యతలు, రైతు సంఘం పోరాటాలు, ఎన్నెన్నో ఈ పుస్తకం పాఠకుల్ని నాటి ఉద్యమాల్లోకి తీసుకెళుతుంది. ముత్యం కృషి ప్రశంసనీయం. వామపక్ష ఉద్యమ కార్యకర్తలకు, చరిత్ర అధ్యయన వాదులకు చక్కటి కరదీపిక ఈ గ్రంథం.
- తంగిరాల చక్రవర్తి ,
9393804472
ఈ ముగ్గురూ ఒక్కరే
(శ్రీకాకుళం రైతు నేతల జీవిత రేఖలు)
రచన : డా|| కె.ముత్యం,
పేజీలు : 224, వెల : 150/-,
ప్రతులకు : డా|| మట్టాఖగేశ్వరరావు, అధ్యక్షుడు,
మార్పు పద్మనాభం మెమోరియల్ ట్రస్ట్,
హరిపురం, శ్రీకాకుళం జిల్లా - 532242.