Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొంభయ్యవ దశకానికి ముందు బడి ఉత్సవాలు, వార్షికోత్సవాల వంటి కార్యక్రమాల్లో నాటికలు తప్పనిసరిగా ఉండేవి, ఇటీవల ఆ కొరత కొంత ఉందన్నది నిజం. కవయిత్రి, కథా రచయిత్రి, విద్యావేత్త, వదాన్యులు, విధుషీమణి డా. అమృతలత ఈ లోటును కొంత బర్తీ చేస్తూ పిల్లల కోసం చక్కటి నాటికలు రాసి అందించారు. అవన్నీ ఆంధ్రభూమిలో ధారావాహికంగా వచ్చాయి.
డా. అమృతలత నిజామాబాద్ జిల్లా, పడకల్లో 1950లో పుట్టారు. పెరిగింది సమీపంలోని జక్రాన్‌పల్లిలో. విజయ విద్యా సంస్థలు, శ్రీ వేంకటేశ్వర దేవాలయం, పలు కళాశాలలు, కళ్యాణ మంటపం వంటివి నిర్వహిస్తున్నారు. ప్రతియేట ఆమె అందించే 'అపురూప పురస్కారాలు' గురించి తెలిసిందే.
ఆరవ తరగతి విద్యార్థినిగా 1960లోనే 'కమలం' కవిత రాసిన అమృతలత కథ, నవలా రచయిత్రి. 'స్పందన', 'అమృత వర్షిణి', 'గోడలకే ప్రాణముంటే...', 'సృష్టిలో తీయని', 'ఓటెందుకు' వంటి కథా సంపుటాలు, నవలలు రాసిన అమృతలత పాఠశాల స్థాయి నుండే అనేక బహుమతులు అందుకుకున్నారు. వివిధ పత్రికలు నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచారు. రచయిత్రిగా పేరున్న అమృతలత పిల్లల కోసం రాసిన నాటికల సంపుటి 'చుక్కల లోకం చుట్టొద్దాం'. తాను ఈ నాటికలు ఎందుకు రాసిందో చెబుతూ, ''స్కూల్ డే వస్తున్నా, స్కూల్లో మరో ఫంక్షన్ ఏది వచ్చినా ఏం నాటిక వేయాలి అనే ప్రశ్న అందర్నీ వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యకి పరిష్కారమే ఈ 'చుక్కల లోకం చుట్టొద్దాం! నాటికల సంపుటి'' అంటారు అమృతలత. రచయిత్రి అమ్మ... అమ్మమ్మ, ఉద్యోగరీత్యా తొలుత సర్కారు బడి ఉపాధ్యాయిని.. బాలల గురించి, వాళ్ళ మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు తెలిసిన మనస్తత్వ నిపుణురాలు. ఆమె ఇతర రచనల్లో లాగానే బాల సాహిత్యంలోనూ అది అచ్చంగా మనకు కనిపిస్తుంది. 'ఈ చుక్కల లోకం...' లోని ద్రువతారల్లాంటి పదకొండు నాటికల్లో దేని మెరుపు దానిదే!
పాఠశాలకు డి.ఇ.ఓ వస్తే జరిగే తంతు మనకు తెలిసిందే, దానిని చక్కగా వర్ణిస్తూ అమృతలత పిల్లలకోసం రాసిన నాటిక 'ఇన్స్పెక్షన్.' తరగతి గదుల్లో విద్యార్థులు, వాళ్ళ పెబ్బ (మాని టర్), విద్యార్ధుల మధ్య స్పర్థలు, బాగా చదివే విద్యార్థులు అధికారుల ముందు ఎలా పాఠశాల పరువు నిలబెడుతారో వంటివి ఇందులో రచయిత్రి పిల్లల ద్వారా తెలుపుతారు. కేవలం విషయాన్ని చెప్పి ఊరుకోవడం రచయిత్రికి తెలియదు. తన రచన ద్వారా ఏదో ఒక ప్రయోజనం కలగాల న్నది ఆమె తపన. దానిని తాను ప్రతిచోట ఉపయోగించుకుని రాశారు.
రచయిత్రికి నిజామాబాద్ గ్రామాలతో, గ్రామీణ జీవితాలతో, అక్కడి ప్రజలతో అమెకు పరిచయమే కాక సన్నిహిత సంబంధముంది. టీ.వి.లు వచ్చిన తొలినాళ్ళలో టీ.వి. వున్న వారి ఇండ్లల్లోని సందడి, ఇబ్బంధి ల్యాప్‌టాప్‌లలో, మొబైల్‌లలో, బెడ్రూమ్లే కాక ఇంట్లోని ప్రతి రూంలో ఒక టీ.వి.పెట్టుకుని చూసే ఈ తరానికి అంతగా తెలియదు. అది తెలుసుకోవాలంటే అమృతలత రాసిన నాటిక 'టీ.వి. న్యూసెన్స్' చదవాలి లేదా ప్రదర్శన చూడాలి. ఈ 'టీ.వి. న్యూసెన్స్' నాటిక చివరి సంభాషణలు ''... పిక్చర్ సగంలో వదిలి మేం ఎలా వెళ్లేది మీరే చెప్పండి? మీకు అభ్యంతరం లేకపోతే- ఆ తాళంకప్పా, తాళం చెవీ ఇలా ఇవ్వండి! టీ.వి. చూశాక మేమే తాళం వేసి, మీరు వచ్చాక- మీ తాళం చెవి జాగ్రత్తగా అప్పగిస్తాం, సరేనా?'' అనే పొరుగింటి సూర్యకాంతమ్మ మాటలు టీ.వి. ఉన్నవాళ్ళ పాట్లను చక్కగా తెలుపుతుంది. 'ప్రెజంటేషన్స్' నాటికలో రచయిత్రి పాఠకులకు మనస్తత్వ నిపుణురాలుగా కనిపిస్తే, 'హాలిడె' నాటికలో తల్లితండ్రులుగా మనం మనకు కనిపించేట్టు రాశారు. 'ప్రెంజటేషన్స్' నాటికలో రచయిత్రి విభిన్న మనఃప్రవృత్తుల స్త్రీలను కూడా రంగుల బొమ్మలాగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు.
నిజానికి పిల్లల కోసం రాయడం కష్టమైన పనైతే, అందులోనూ సంభాషణలు వారి స్థాయిలో రాయడం మరింత కష్టం. ఇది అందరికీ సాధ్యమమయ్యే పని కాదు కూడా. రచయిత్రి అమృతలత చేయి తిరిగిన రచయిత్రే కాక బాలలలోకం తెలిసిన వారు. అందువల్లె ఇందులోని ప్రతి నాటిక చక్కని రచనగా అలరింది. రచయిత్రి ఈ నాటికల్లోని ప్రతి పదాన్ని పిల్లల స్థాయిలో రాయడం వల్లనే ఇప్పటికీ 'ఈ చుక్కల లోకం చుట్టొద్దాం!' వెలుగులను విరజిమ్ముతోంది. 'పవర్‌కట్', 'బి వేర్ ఆఫ్ మైక్స్' మరియు 'ట్యూషన్స్' ఇందు లోని ఇతర నాటికలు. ఇవి కూడా అటువంటి నాటికలే. వీటిలోని ఒక నాటిక వాతావరణ కాలుష్యాన్ని గురించి తెలిపితే, మరొకటి వ్యంగ్యంతో పాటు 'పవర్‌కట్' వల్ల ఇబ్బంధులు పడే మహిళల గురించి చూపుతుంది. పిల్లల కోసం కాదు కానీ పిల్లలే ప్రధాన ఇతివృత్తాలుగా అమృత లత రాసిన మరో సంపుటి 'గోడలకే ప్రాణముంటే...' ఇందులో కూడా రచయిత్రి సమకాలీన సమస్యలను, అంశాలనే కాక తెలంగాణ భాషలో సంభాషణలు రాశారు. ఏడున్నర పదులు చైతన్యశీలి అమృతలతమ్మకు జయహో!
- డా|| పత్తిపాక మోహన్, 9966229548