Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీసీల 'రక్షణల' రక్షకుడు బీపీ మండల్‌కు (బిందేశ్వర ప్రసాద్ మండల్) ఈ పుస్తకం రచయిత అంకితం చేసారు. బీసీలకు ఒక వాదం అంటూ ప్రత్యేకంగా బలపడకపోవడం సాహిత్య చరిత్రలో అతి పెద్ద లోటు అంటారు రచయిత.
చిక్కనవుతున్న పాట - పదునెక్కిన పాట, వెంటాడే కలాలు బహువచనం లాంటివి పూర్తి బీసీ అస్తిత్వ వాదంతో వచ్చిన సాహిత్యమే... వివిధ పత్రికల్లో రచయిత రాసిన వ్యాస సంకలనమే ఈ పుస్తకం. ఇప్పటికే బి.సి. రైటర్స్ వింగ్ బీసీ జీవితాల గురించి శాస్త్రీయ బద్ధమైన చర్చకు సాగుతున్నాయి. బీసీ లిటరసీ ఫెస్టివల్స్ నిర్వహించారు. అస్తిత్వం, జీవితం, ఆత్మగౌరవంకై తండ్లాట బీసీ సాహిత్యకారులు, సంస్థలు, బీసీ అస్తిత్వ కవిత్వం దశ దిశ, తెలుగు కథల్లో బీసీలు, తెలుగు నవలల్లో బీసీలు, రంజ కవిత్వం ఒక పరిశీలన, కుల అస్తిత్వోత్యమాల ఆదికావ్యం గబ్బిలం, పక్కా మూల వాసి కథలు, ఎడారి బతుకులు, వ్యాసాలు... ప్రతికవి, ప్రతి రచయితకు అవగాహన చేసుకునేందుకు ఎంతో ఉపకరిస్తాయి. బీసీలైన దొమ్మరి, పిచ్చుక కుంట్ల, బుడబుక్కల బహురూపుల మొదలైన కులాలకు ఇప్పటికీ ఇళ్లు కిరాయికి ఎవరైనా ఇస్తారా? ప్రశ్నకు మౌనం సమాధానమౌతుంది కదా (పేజీ - 62). రచయిత ఆధ్వర్యంలో 20 జిల్లాలు, 20 సభలు, 10,000 కి. మీ. ప్రయాణం సాగించి ఎంతో భావజాల సంఘర్షణలో అణగారిన వర్గాలు, బి.సీ. ఎస్.సి. ఎస్.టి., మైనార్టీ, ఆదివాసీ, గిరిజన, అగ్రశర్ణ డీకాస్టిఫైడ్ మేధావుల కరస్పర్శలతో కాకతీయ వర్శిటీ ఫూలే స్టాచ్యూ నుండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, న్యూయార్క్, అమెరికా వరకు సాగిన సుదీర్ఘ ప్రయాణం లోని పలు అంశాలకు అక్షర రూపం ఇచ్చారు రచయిత. దాదాపు 56 రిఫరెన్స్ పుస్తకాల అధ్యయనం తో బీసీల జీవితాన్ని అక్షర అద్దంలో ఆర్తితో అక్షరీకరించిన రచయిత కృషి ప్రశంసనీయం. కులం చేత అత్యధికంగా బాధింపబడుతున్నది బీసీలే అంటారు రచయిత (పేజీ - 37)
''బీసీల జీవితాలను చిత్రిస్తూ బిసిలు రాసిన బీసీయేతరులు రాసినదంతా బిసి సాహిత్యమే'' అనే అవగాహన మంచిదే.. ఎమ్.బి.సీ.లు బలంగా తమ గొంతు నేడు వినిపిస్తున్నారు. ''లెఫ్ట్ ఐడియాలజీకి మనువాదులకు కులం విషయంలో దగ్గరి సంబంధం ఉన్నది'' (పేజీ - 23) అన్న రచయిత వాదంతో ఏకీభావం దొరకదు. దేవాలయ ప్రవేశాలు, రెండు గ్లాసుల పద్ధతిపై పోరాటం, నాటి మహార్ చెరువు నీళ్ళ కోసం పోరాటం, నేటి కుల వివక్ష పోరాట సమితి కృషి దాకా ఎన్నో ఉదాహరణలు, వివరాలు ఇవ్వవచ్చు. చార్వాకులు, బుద్ధుడు, ఫూలే, సావిత్రీ భాయి ఫూలే, అంబేద్కర్, పెరియార్, నారాయణ గురు, సాహు మహారాజ్ జీవితాలు, వారి బోధనలే అట్టడుగు అణగారిన వర్గాలకు మార్గనిర్దేశనం చేస్తాయి. బోధించు, సమీకరించు, పోరాడు, రాజ్యాధికారం పొందు అనే అంశాల ప్రతిపాదన అస్తిత్వ పోరాటాలకు ఈ పుస్తకం పదునైన ఆలోచన అంశాలకు అక్షర రూపం ఇచ్చారు రచయిత. దాదాపు 56 రిఫరెన్స్ పుస్తకాల అధ్యయనం తో బీసీల జీవితాన్ని అక్షర అద్దంలో ఆర్తితో అక్షరీకరించిన రచయిత కృషి ప్రశంసనీయం.
బీసీ చౌక్
రచన : డా|| చింతల ప్రవీణ్‌కుమార్
పేజీలు : 192, వెల : రూ. 250/-,
ప్రతులకు : ఫూలేఘర్, ఇం.నెం. 16-10-236, శివనగర్, వరంగల్ - 506002
సెల్ : 9849048884
- తంగిరాల చక్రవర్తి , 9393804472