Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేనేత కుటుంబంలో పుట్టి పెరిగి, చిత్రగీత, అక్షరాల రాతలో అంచలంచెలుగా ఎదిగి, ఒదిగిన కృషీవలుడు, విశ్రాంత ప్రధానాచార్యులు శ్రీ చెన్నూరి సుదర్శన్. పుట్టింది అమ్మమ్మ ఇంట్లో హుజురాబాద్‌లో. తండ్రి శ్రీ చెన్నూరి లక్ష్మయ్య, పోలీసు. తల్లి శ్రీమతి లక్ష్మి (గౌరమ్మ). మే 18, 1952న పుట్టారు. హుజూరాబాద్‌లో తాత అక్షరభ్యాసం చేయించాడు. కాని తండ్రి ఉద్యోగరీత్యా, చదువు వరంగల్ జిల్లాలోని వివిధ ఊళ్ళల్లో కొనసాగింది.
పోస్ట్ గ్రాడ్యూయేషన్, ఎంఫిల్‌లు పూర్తి చేసిన సుదర్శన్ తొలుత 'టెలిఫోన్ ఆపరేటర్'గా ఉద్యోగం చేశారు. బాల్యం నుంచి రంగస్థల నటనపై మిక్కిలి ఆసక్తితో పాఠశాల దశలోనే ముఖానికి రంగేసుకుని ప్రశంసలు పొందారు. బాల్యం నురచి చందమామ చదవడం ఒక వ్యాపకంగా చేసుకున్న వీరిపై తదనంతరం గురువైన శ్రీ దూపాటి రమణాచారి ప్రోత్సాహం లభించింది. విద్యార్థి దశలోనే ఆంగ్ల పుస్తకంలోని కవితలను తెలుగులోకి అనువాదం చేసుకునేవారు. రేడియోలో ఆదివారం ప్రసారమయ్యే 'బాలానందం' కార్యక్రమానికి రకరకాల జోక్స్ పోస్ట్ కార్డు మీద రాసి పంపగా అవి ప్రసారమయ్యాయి. తొలి కథ 'నా అనుభవం' పంపగా, 1 జనవరి, 1970న ప్రసారమైంది. అది మొదలు 'యువకవి'గా పాఠశాల సన్మానం, మొదటి కవిత 'రజతోత్సవం' హుజూరాబాద్ పాఠశాల మ్యాగజైన్ (1972)లో వచ్చింది. ఇదే సమయంలో 'నిండు మనసులు' అనే నవల రాసారు. బహుశః డెబ్బయ్యవ దశకంలో విదార్థి రచనగా వచ్చిన నవల ఇదే కావచ్చేమో... పరిశోధించాలి. ఇదే సమయంలో గూడూరి రాఘవేంద్ర 7వ తరగతి విద్యార్థిగా బాలల కథలు రాయడం విశేషం. పదవ తరగతిలో పాఠశాల కల్చరర్ సెక్రటరీగా ఎన్నుకోబడి, నాటికలు వేసి వచ్చిన డబ్బుని సుదర్శన్ బృందం పేద కళాకారులకు ఇవ్వడం అభినందనీయం. అంతేకాక పాఠశాల గది నిర్మాణం కోసం సినిమా ప్రదర్శింపజేసి అందులో విజయం సాధించిందీ బృందం. వాలీబాల్ క్రీడాకారునిగా అంతర్ జల్లా స్థాయిలో అనేక బహుమతులు అందుకున్న వీరి మిత్రుడు గుర్రాల బాలరాజు ప్రోత్సాహంతో చిత్రలేఖనం వైపు దృష్టి సారించారు. ప్రముఖ ఆర్టిస్ట్, శిల్పి సురేంద్రనాథ్ శిష్యరికంతో పోట్రేట్స్, ల్యాండ్ స్కేప్స్, గ్లాస్ పెయింటింగ్స్‌లో అనుభవం గడించి, కార్ట్యూన్స్ గీయడం నేర్చుకుని బహుమతులు అందుకున్నారు. ఇదే సమయంలో సీతారామయ్య వద్ద సుద్దముక్కలపై శిల్పాలు చెక్కడం నేర్చుకున్నారు. పూక్షకళలోని ఈ నైపుణ్యంతో బియ్యం గింజపై 16 అక్షరాలు రాయగలరు చెన్నూరి.
ఇదే సమయంలో లెక్చరర్‌గా 1982లో శ్రీకాకుళం డిగ్రీ కాలేజీలో చేరారు. తీరిక వేళల్లో తిరిగి బొమ్మలు గీయడం.. అప్పుడప్పుడు కవితలు రాసేవారు. తరువాత పటాన్చెరు జూనియర్ కాలేజీలో డా.నాళేశ్వరం శంకరం ప్రోత్సహంతో తిరిగి కవిత్వం వైపు మరలారు. 2012 మార్చిలో ఆత్మకథను రాసుకున్న సుదర్శన్ రచయితగా, సబెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా వివిధ రచనలు చేశారు. 200ల కథలు, 150 కవితలు, 60 కార్టూన్లు వీరి సృజన. కథలు తెలంగాణ భాషలో రాయడంలో వీరు సిద్ధహస్తులు కూడా.
'ఎం.సెట్ ప్రశ్నలు-సాధనాలు' (తెలుగు, ఆంగ్ల మాధ్యమం) జె.పి వారి కోసం రాశారు. 'జీవనచిత్రం', 'రంగుల వలయం' చెన్నూరి సుదర్శన్ ఆత్మకథ, కథల సంపుటి 'ఝాన్సీ హెచ్.ఎం' పేరుతో ప్రచురింపబడింది. మరో రెండు కథా సంపుటాలు 'మహా ప్రస్థానం', 'జీవనగతులు' పేరుతో వచ్చాయి. పదవ తరగతి విద్యార్థిగా నవల రాసిన చెన్నూరి సుదర్శన్ రాసిన మరో నవల 'జర్నీ ఆఫ్ ఏ టీచర్'.
చెన్నూరి సుదర్శన్ రచయిగా, చిత్రకారునిగా, మెజీషియన్‌గా, క్రీడాకారునిగా, కార్టునిస్ట్గా, బాల సాహిత్య కారునిగా చేసిన సృజన వెలకట్టలేనిది. తన రచనలకు తానే చిత్రాలు గీసుకుని, ముఖచిత్రాలు కూర్చుకుని పిల్లలకు కానుకగా అందించడం ఈ కథల బొమ్మల తాతకు బాగా తెలుసు. జీవన సత్యాలను, జీవితంలోని వివిధ అంశాలను అత్యంత సులభంగా పిల్లలకు అర్థం అయ్యేలా తన అక్షరాలతో... కుంచెతో చెప్పడం ఈయనకు బాగా తెలుసు. అలా పిల్లల కోసం రాసిన రచనలు... 'ప్రకృతిమాతజ పిల్లల కథలు. 'రామచిలుక', 'రామబాణం' కూడా వీరి బాలల కథా సంపుటాలే. ఇవేకాక 'చెన్నూరి సుదర్శన్ కథలు', 'అనసూయ ఆరాటం' నవల అచ్చులో ఉంది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, రాష్ట్ర ఉత్తమ టెలిఫోన్ ఆపరేటర్ అవార్డు, హాస్య కవి, యువకవి, సన్మానాలు. శ్రీవాకాటి పాండురంగారావు స్మారక పురస్కారం, గిడుగు రామమూర్తి పంతులు సాహిత్య పురస్కారం, ఐతా భారతీ చంద్రయ్య సాహిత్య పురస్కారం వంటి అనేక పురస్కారాలు అందుకున్న చెన్నూరి ఇటు కథా సాహిత్యంలో, చిత్ర లేఖనంలో... అన్నింటికి మించి బాల సాహిత్యంలో విశేష సృజన చేస్తున్న సృజనకారుడు. జయహో! చెన్నూరి...
- డా|| పత్తిపాక మోహన్, 9966229548