Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడున్నర దశాబ్దాలకుపైగా ఆయన రాసిన ప్రతి అక్షరం బాలల కోసం జండాయై రెపరెపలాడింది. చేసిన ప్రతి కార్యక్రమం బాల వికాసోద్యమానికి ఊపిరిలూదింది. తొంభయ్యవ దశకంలో ఆయన నిర్వహించిన బాలల కవి సమ్మేళనం ఆనాడు కొత్త చరిత్ర. కవి, రచయిత, పరిశోధకుడు, బాల వికాసోద్యమ కార్యకర్త వి.ఆర్.శర్మ పేరుతో ప్రసిద్ధుడైన డాక్టర్ విఠాల రాజేశ్వరశర్మ ఏప్రిల్ 18, 1956న నేటి కామారెడ్డి జిల్లా కేంద్రంలో పుట్టారు. తల్లిదండ్రులు విఠాల లలిత, బాల రాజయ్య. భాషోపాధ్యాయునిగా తన ప్రస్థానం ప్రారంభించిన శర్మ ప్రధానోపాధ్యాలుగా ఉద్యోగ విరమణ చేశారు.
దాదాపు మూడున్నర దశాబ్దాల ఉద్యోగ జీవితంలో ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా, ఉపాధ్యాయ సంఘాల బాధ్యునిగా అత్యంత నిబద్ధతతో పనిచేసిన శర్మ తాను నమ్మిన విలువలు, ఆశయాల కోసం నేటికీ పనిచేస్తున్నాడు. ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంత జీవితాన్ని బాల సాహిత్య వికాసం కోసం అవిశ్రాంతంగా వెచ్చిస్తున్నాడు. ఇవ్వాళ్ళ తెలుగునాట జరుగుతున్న అన్ని బాలోత్సవాలలో శర్మ లేని సందర్భం లేదనడం అతిశయోక్తి కాదు. బాల సాహిత్య కార్యశాలలకు వెన్నుదన్నుగా నిలిచిన వారిలో శర్మ ఒకరు. విద్యార్థి దశలోనే 'ఆదర్శ కళాసమితి కామారెడ్డి'తో ప్రారంభమైన సాహితీయాత్ర తరువాత తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ బాల సాహిత్య పరిషత్తు వరకు వివిధ హోదాలలో సాగింది. తాను స్థాపించిన 'పిల్లల లోకం' గురించి తెలియని బాల సాహితీ కార్యకర్త ఉండడు. పిల్లల కథల లోకాన్ని మరింత విస్తృతం చేసి బడి పిల్లల కథలను ప్రత్యేకంగా రికార్డుచేసి, పోటీలు పెట్టి పిల్లలకు స్ఫూర్తి కలిగించేందుకు స్థాపించిన సంస్థ ఇది.
రచయితగా తన తొలికథ 'దోయాయణం'తో 1978లో ఆరంగేట్రం చేసిన శర్మ 'తెలంగాణ', 'వానపూల కొండ', 'తెల్ల చీకటి', 'సూర్యుడు అనేక రంగుల్లో ఉదయిస్తాడు', 'ప్రత్యేక తెలంగాణ', 'నాలుగున్నర కోట్ల నదులు హోరు', 'మా ఊరి మట్టివాసన' కవితా సంపుటాలు తెచ్చాడు. మరో కవి మిత్రుడు 00000 00 కలిసి తెచ్చిన (జంట కవుల) సంపుటి 'గులేర్'. ఇవేకాక 'సూర్యుళ్ళను వెలిగిస్తూ..' పాటల పుస్తకం, 'కొందరు విద్యావేత్తలు' పేర వ్యాస సంకలనం తెచ్చాడు. 'సాహూ జీవితం-రచనలు, పరిశీలన', 'ఆధునిక కవిత్వంలో బాల్య చిత్రణ' శర్మ ఎం.ఫిల్ మరియు పిహెచ్.డి పరిశోధనా పుస్తకాలు.
'ఆనందం', 'పిల్లల కోసం...', 'పిల్లల లోకం' వర్మ పిల్లలకోసం ప్రచురించిన పాటల పుస్తకాలు. 'కానుక', 'ప్రయాణం', 'బాలవర్ధన్', 'రక్ష' వీరి పిల్లల నవలలు. ఇవేకాక మరో వారం రోజుల్లో 'మారుతున్న వేళ' ఈ తరం పిల్లల కథలు, 'పంచ తంత్రం' బాల లయలు', 'ఆడుతూ.. పాడుతూ...' పిల్లల పాటలు రానున్నాయి. మౌళిక రచనలేకాక శర్మ 1999 నుండి పిల్లలు రాసిన పలు రచనలను తన సంపాదకత్వంలో వెలువరించాడు. వాటిలో 'ఆకాశం', 'పిల్లల లోకం 1Ê2', 'చుక్కలు', 'బుంగారు నెలవంకటు', 'అలలు', 'కవులు-పిల్లలు' వంటివి ప్రధానంగా పేర్కొనవచ్చు.
నిరంతరం పిల్లల కోసం పరితపించే వి.ఆర్.శర్మ మూడున్నర దశాబ్ధాల నుండి పిల్లల కోసమే రాస్తున్నారు, వివిధ సంస్థలు, వ్యక్తులు నిర్వహించే బాల వికాస కార్యక్రమాలలో కార్యకర్తగా ముందుండి నడుస్తున్నాడు, కేవలం శర్మ ఒక్కడు కాదు ఈ బాల వికాస కార్యక్రమాలలో శర్మ శ్రీమతి పద్మావతి కూడా పాల్గొని అదే స్థాయిలో పనిచేయడం విశేషం. శ్రీమతి పద్మ రచయిత్రి, అనువాదకులు కూడా. పిల్లలను మనం సాధారణంగా ఏమీ తెలియని వారిగా భావిస్తాం, కానీ వారి శక్తిని గురించి ఎంతో అద్భుతంగా తన గేయంలో చెబుతాడు శర్మ. 'పిల్లలే అనుకుంటె కాని దేమున్నదీ / ఎవరెస్టు శిఖరమే కాలికిందైనది' అంటూ వాళ్ళ సంకల్పబలం ఎంత గొప్పగా వాళ్ళను తీర్చిదిద్దుతుందో చెబుతాడు. ఇంకా... 'ఈనాటి పిల్లలు కాబోయే పౌరులు-రాబోయె కాలన్నీ రక్షించేవీరులు' అంటాడు. ముఖ్యంగా ఈనాటి పిల్లల గురించి రాస్తూ.. 'ఈనాటి పిల్లలు మేము / ఏదైనా సాధిస్తాము/ కంప్యూటర్లకె పాఠాలు నేర్పి/ కాలాన్ని శాసిస్తాము' అంటాడు. ఒక లాలిపాటలో 'కన్నా నువ్వేరా మా కన్నుల వెన్నేల/ నిదుర పో హాయిగా ఈ వేళ/ నీ మోములో నిందు చంద్రుళ్ళు/నీ కన్నుల్లో పండు వెన్నెల్లు' అని వర్ణిస్తాడు. ఇంత అద్భుతంగా యశోదమ్మ కూడా కృష్ణునికి జోల పాడలేదేమో! 'తుమ్మచెట్టు కొమ్మజూడు/ కొమ్మకున్న పిట్ట గూడు జూడు/ గూటిలున్న పిట్టజూడు/ దానిపేరే గిజిగాడు' అని రాసినా, 'చిన్నచిన్న పిల్లల్లారా-మల్లెపూల మొగ్గల్లారా' అని రాసినా అందులో వర్మమ్దుర ఉంటుంది. నవలల్లో విజ్ఞానాంశాలు, హేతువు ప్రధానంగా ఉండడం శర్మ రచనలోని విశేషం. మూఢనమ్మకాలు, దయ్యాలు, భూతాల వంటివి ఆయన రచనల్లో ఎక్కడా కనిపించవు. హేతువు ప్రధానంగా రచనలు చేయడం శర్మకు తెలిసిన విద్య. 'తనదేహము తనగేహము..' అన్నట్టు శర్మ కూడా అన్నింటిని బాలల వికాసం కోసం వెచ్చించాడు. జయహో! డా.వి.ఆర్. శర్మ.... జయహో! బాల సాహిత్యం!
- డా|| పత్తిపాక మోహన్, 9966229548