Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైఎస్ఆర్ శర్మ, గోరేటి వెంకన్న, డా|| కొలకలూరి ఇనాక్, డా|| నాళేశ్వరం శంకరం, సత్యాజీ, విజయలక్ష్మీ పండిట్ లాంటి సాహితీ వేత్తలు ఈ పుస్తకానికి ముందు మాటలు రాసారు.1965లో ఆంధ్రప్రభలో దాశరథి ఉగాది గజల్ అచ్చయింది. సినారె, రెంటాల, పెన్నా శివరామకృష్ణ లాంటి వారు తెలుగునాట గజల్ ప్రక్రియ విస్తృతం చేసారు. పర్షియన్ సూఫీ తత్త్వం నుంచి ప్రణయతత్వం, ప్రేమతత్వం, ప్రకృతి తత్వం, సాంఘిక, సామాజిక చైతన్యాంశాలతో గజల్ ప్రక్రియ బాగా వ్యాప్తి చెందింది. శేషేంద్ర, సదాశివ, అద్దేపల్లి లాంటి వారి విశ్లేషణలతో గజల్ ప్రక్రియ సామాన్యుల చెంతకు చేరింది. బిక్కికృష్ణ ఆంధ్రప్రభ దినపత్రికలో గజల్ కవుల కవిత్వంపై రాసిన విశ్లేషణా వ్యాసాలే ఈ సంపుటి. జగద్ధాత్రి, శ్రీపతి, దాలినాయుడు, రాజావాసిరెడ్డి మల్లీశ్వరి, డా|| వడ్డేపల్లి కృష్ణ, ఎన్.వి.రఘువీరప్రతాప్, సూరారం శంకర్, గడ్డం శ్యామల, డా|| దిలావర్, వై.శ్రీదేవి, ఇరువింటి వేంకటేశ్వరశర్మ లాంటి కవుల కవయిత్రుల గజల్స్‌ను విమర్శనాత్మకంగా విశ్లేషణాత్మకంగా (దాదాపు 30 మందివి) రాసిన వ్యాసాలు ఇవి.
కాఫియా, రధీప్, తఖల్లుస్, మత్లా, మక్తా, షేర్లు తెలిస్తే కానీ గజల్స్ రాయలేరు. గజల్స్‌లో 5, 7, 9, 11 షేర్లు ఉండవచ్చు. షేర్ అంటే రెండు పాదాల ద్విపద లాంటిది. మొదటి షేరును 'మత్లా' అంటే ఆఖరి షేరును 'మక్తా' అంటారు. మక్తాలో కవి పేరు ఉపయోగించాలి. దీన్నే 'తఖల్లుస్' అంటారు.
8వ శతాబ్దంలో మొగ్గ తొడిగిన గజల్... 9వ శతాబ్ధిలో అబ్ధుల్ జాఫర్, 12వ శతాబ్ధిలో ఫరుద్దీన్, అత్తర్, 13వ శతాబ్ధిలో జలాలుద్దీన్, అమీర్ ఖుస్రూ, తర్వాత మీర్జా, గాలిబ్, ఇక్బాల్ లాంటి వారు గజల్ ప్రక్రియను విశ్వవ్యాప్తం చేసారు. వాసుదేవ మూర్తి శ్రీపతి గజల్ చూసి ''దు:ఖోపశమనం గజల్'' అంటారు బిక్కి కృష్ణ. గాయపడని హృదయంలో గజల్ మొలవదు అంటారు డా|| సదాశివ. శాంతికృష్ణ కవిత్వంపై (గజల్స్) రాస్తూ శ్లేషలగోల వదలి గజలియత్, దవాదవీల్ల టెక్నిక్ వైపు సారించాలి. ఒక మాత్ర అటు, ఇటు అయినా బహర్ చెడిపోతుంది (పేజీ 48) ల్యాదాల గాయత్రి గజల్స్ పై రాస్తూ 'గానామృతం గజల్' అంటారు.
1721 నాటి ఖజామీర్ 'దర్త్' గజల్స్‌ను గుర్తు చేస్తారు కృష్ణ. ప్రపంచ గజల్ కవుల్ని బాగా అధ్యయనం చేసారు. జర్మన్ కవులు గోథె, స్కెగల్, వోక పాటైన్ (1796 - 1835) రొమాంటిసిజమ్ గజల్స్‌లో ప్రవేశపెట్టారంటారు. ''గానాలు బజానాలు నాకెందుకు ఓ వెన్నెల / నా ఎదలో శ్రావ్యంగా పలుకుతున్న నాదానివి'' (పేజీ 56) అని చక్కని గజల్ రాసారు వెన్నెల సత్యం. అనుకరణ సోయగం గజల్ అంటూ విశ్లేషణ తీరు బాగుంది. ''మేము చేసిన బాసలన్నీ గోడ మీద రాస్తే 'చల్లా', ఆమె హృదయపు పలకపైనేనక్షరాలుగా మారినాను'' అంటారు చల్లా రాంబాబు. గజల్లో వర్ణన క్లుప్తంగా ఉండాలని, ధ్వని పూర్వకంగా, చమత్కార భరితంగా ఉండాలి. వర్ణనావర్ణమే 'గజల్' అంటారు శ్రీవాణీశర్మ. ఆర్ గజల్స్ విశ్లేషిస్తూ బిక్కి కృష్ణ..
కమ్యూనిజం భావాలతో ఫైజ్, మతాజ్్, జబ్బీలాంటి గజల్ కవులు అభ్యుదయ గజల్స్ రాసారు. (పేజీ 79) అంటారు. ప్లేటోనిక్ లవ్‌కు ప్రతీక 'గజల్' అంటారు వాసిరెడ్డి మల్లీశ్వరి గజల్స్ విశ్లేషిస్తూ... కృష్ణ కూడా అద్భుతమైన గజల్స్ రాసారు.
అమీర్ ఖుస్రో నుంచి గాలిబ్ (1869) దాకా కవుల కవిత్వం, గజల్స్ సౌందర్యం చెపుతూనే నేటి కవుల గజల్స్ విశ్లేషణ చేస్తూ ఓ గజల్ సెలబస్ బుక్లా ఈ పుస్తకం ఓ ప్రణాళికా బద్ధంగా స్థిరీకరించి రాసారు. బిక్కికృష్ణ విశ్లేషణ బాగుంది. అభినందనలు.
గజల్ సౌందర్యం
రచన : కళారత్న బిక్కికృష్ణ,
పజీలు : 168, వెల : రూ. 220/-
ప్రతులకు : బిక్కికృష్ణ, ఫ్లాట్ నెం. 311, సెకండ్ ఫ్లోర్, అపెక్స్ అపార్ట్మెంట్స్, ఎసీ గార్డ్స్,
హైదరాబాద్ - 500028.
సెల్ : 8374439053
- తంగిరాల చక్రవర్తి , 9393804472