Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఇప్పుడు కొత్తమీర కట్ట పార్టీ సభ్యుడు మీకొక పిట్ట కథ చెప్తాడు'' అని స్పీకర్ అన్నాడు.
''పంచపాండవులలో ధర్మరాజు పెద్దవాడు. ఆయన ఎక్కువగా దానధర్మాలు చేసేవాడు. తనకంటే ఎక్కువగా దానాలు చేసిన వారెవరూ లేరని ఆయన అనుకొనేవాడు. ఇది ధర్మరాజుకు అహంకారంగా మారితే ప్రమాదమని కృష్ణునికి అనిపించింది.
ధర్మరాజును తీసుకొని ఆయన మరో రాజ్యానికి వెళ్లాడు. ఆ రాజ్యాన్ని బలదేవుడనే రాజు పాలిస్తున్నాడు.
ఆ రాజ్యంలోకి వెళ్లాక వారికి దాహమేసింది. ఒక ఇంటికెళ్లి మంచి నీళ్లడిగారు. ఆ ఇంటావిడ బంగారు గ్లాసుల్లో నీళ్ళిచ్చింది. వారు నీళ్లు తాగాక ఆ గ్లాసుల్ని వీధిలోకి విసిరేసింది.
ఇది చూసి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు.
''బంగారు గ్లాసుల్ని వీధిలోకి విసిరేస్తే ఎలాగమ్మా!'' అని ఆమెనడిగాడు.
''మా రాజ్యంలో ఒకసారి వాడిన వస్తువులను తిరిగివాడము'' అని ఆమె చెప్పింది.
ఈ రాజ్యం సంపదలకు నిలయమున్నట్లుగా ఉంది అని ధర్మరాజు అనుకొన్నాడు.
ఇద్దరూ కలిసి బలదేవుని దగ్గరకు వెళ్లారు.
కృష్ణుడు : బలదేవునికి, ధర్మరాజును ఇలా పరిచయం చేసాడు. ''రాజా! ఈయన పేరు ధర్మరాజు. ప్రపంచంలోనే ఈయన ఎక్కువ దానాలుచేసాడు'' అని చెప్పాడు.
అయినా ఆ రాజు ధర్మరాజు ముఖాన్ని చూడలేదు. సరికదా- ''కృష్ణా! మీరు చెప్పింది నిజమే కావొచ్చు. నా రాజ్యంలో అందరికీ పని ఉంది. అందరూ కష్టించి పనిచేస్తారు. అందరి వద్దా సంపద ఉంది. నా రాజ్యంలోని ప్రజలు ఎవ్వరినీ బిచ్చమడుక్కోరు. ఎవరు దానమిచ్చినా తీసుకోరు. వాళ్లకా కర్మ పట్టలేదు.
మీరు పరిచయం చేసిన ధర్మరాజు రాజ్యంలో బీదవాళ్లూ సోమరిపోతులూ ఎక్కువగా ఉన్నట్లున్నారు. ప్రజలకు కష్టించి పని చెయ్యడం నేర్పాలి. అంతేకాని దానాలకు అలవాటు చెయ్యకూడదు. దానాలుచేస్తూ ప్రజల్ని బాదవాళ్లుగా, సోమరులుగా మార్చిన ఈ ధర్మరాజు మొహం చూడ్డం నాకిష్టం లేదు.'' అని బలిదేవుడన్నాడు.
ఆయన మాటలు విన్న ధర్మరాజు సిగ్గుతో తలవంచుకొన్నాడు. ఈ పిట్టకథ చెప్పిన తరువాత కొత్తిమీర కట్ట సభ్యుడు సీట్లో కూర్చోన్నాడు. ప్రతిపక్షాల సభ్యులు చప్పట్లు కొట్టారు.
''ఇప్పుడు గడ్డిమోపు పార్టీ సభ్యుడు అడిగే ప్రశ్నలకు మహామంత్రి సమాధానం చెబుతాడు'' అని స్పీకర్ అన్నాడు.
''రాజధానికి సముద్రాన్ని తెస్తాం. అందమైన బీచ్‌ని ఏర్పాటు చేస్తాం. సాయంత్రం పూట పెళ్లాం పిల్లలతో బీచ్‌కెళ్లి ఆనందంగా గడపొచ్చు.
పిచిక గూళ్లు కట్టి ఆడుకోవచ్చు. ఇసుకలో గుర్రాల మీద స్వారీ చెయ్యొచ్చు. పల్లీలూ, చుడువా కొనుక్కొని తినొచ్చు. సముద్రపు నీళ్లతో కాళ్లు తడుపుకోవచ్చు. సూర్యాస్తమయాన్ని ఫొటో తీయవచ్చు అంటూ ఊరించారు. ఇంతకూ రాజధానికి సముద్రాన్ని ఎప్పుడు తెస్తారు?''
''లక్షమంది కూలీలను పెట్టి నేల తవ్విస్తున్నాం. సముద్రమంటే చెరువు లాంటిది కాదు కదా. చాలా లోతుగా ఉంటుంది. లోతుగా తవ్వడానికి సమయం పడుతుంది. తవ్విన తరువాత గూడ్సు రైళ్లల్లోనూ, ట్యాంకర్లలోనూ నీళ్లు తెచ్చిపోస్తాం. చేపలనూ, తాబేళ్లనూ, మొసళ్లనూ, తిమింగలాలనూ దానిలోకి విడుస్తాం. సముద్రంలో బోటు షైరు ఏర్పాటు చేస్తాం. విత్తనం పెట్టగానే మొక్క మొలుస్తుందా? ఇల్లు అలకగానే పండగొస్తుందా?'' అని మహామంత్రి అడిగాడు.
''మీ బొచ్చె ప్రభుత్వంలో జెనాలకు పని లేకుండా పోయింది?''
''మీరంటున్నది శుద్ధ అబద్ధం. అందరూ పని చేస్తున్నారు. తినడం పనికాదా? వండుకోవడం పని కాదా? మాట్లాడటం పనికాదా? పడుకోవడం పని కాదా? ఛారు చెయ్యడం పని కాదా? మిర్చి బజ్జి వెయ్యడం పని కాదా? మా ప్రభుత్వం వల్లే ఛారుపత్తా దొరుకుతున్నది. పాలు దొరుకుతున్నాయి. బొగ్గులు దొరుకుతున్నాయి. అగ్గిపెట్టెలు దొరుకుతున్నాయి. మిరపకాయలు దొరుకుతున్నాయి. శనగపిండి దొరుకుతున్నది. నూనె దొరుకుతున్నది. మా ప్రభుత్వం వల్లే అందరికీ పనులు దొరుకుతున్నాయి.''
''మీరు ఆ మధ్య బురద నేలలో చెట్టు నాటారు. మీ కాళ్లకు బురద అంటకుండా శాబాద్ బండ వేసారు. ఆ బండ మీద మీరు నిలుచున్నారు. నిలుచుని నాటి చెట్టుకు నీళ్లు పోశారు. అప్పుడు వాన కురుస్తున్నది. బాడీగార్డు మీకు గొడుగు పట్టాడు. వానలో చెట్టుకు నీళ్లు పోస్తూ మీరు ఫొటో దిగారు'' అని గడ్డిమోపు సభ్యుడన్నాడు.
గాలి బుడగ పేలినట్లు, అద్దం బద్దలయినట్లు ప్రతిపక్ష సభ్యులందరూ భళ్లున నవ్వారు. ఆ నవ్వులు బాగోతం చూస్తున్న జెనాల్లో ప్రతిఫలించాయి.
''చెట్టు బెట్టి నీళ్లు పోయకపోతే మహామంత్రి చెట్టు పెట్టాడు కానీ నీళ్లు పొయ్యలేదని మీరే అంటారు. నీళ్లు పోసానంటే దానికి రుజువేముందని అడుగుతారు. అందుకే చెట్టుకు నీళ్లు పోస్తూ ఫొటో దిగాను.''
''బండ్ల సర్వీసునెందుకు రద్దు చేస్తున్నారు?''
''గడ్డిమోపుల ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బండి చక్రాలు కూడా తొందరగానే పాడవుతున్నాయి. బండ్లను తోలే వాళ్లు కూడా జీతాలు పెంచమని కోరుతూ నెల రోజుల పాటు సమ్మె చేశారు. ఎంత కాలమని నష్టాల్ని భరిస్తూ బండి సర్వీసుల్నీ నడపాలి. బండి చార్జీలు పెంచినా లాభం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో బండి సర్వీసుల్ని రద్దు చేద్దామనుకుంటున్నాము''
''బండి సర్వీసుల్ని రద్దు చేస్తే ఎలా?''
''వాటి స్థానంలో జట్కా సర్వీసుల్ని ప్రవేశపెడతాం. బండి కన్నా జట్కా స్పీడ్‌గా వెళుతుంది. బండ్లు తోలిన వారికి జట్కా నపడంలో శిక్షణ ఇప్పిస్తాం. అంతేకాకుండా ఈ సర్వీసుల వల్ల అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి.'' అని మహామంత్రి అన్నాడు.
''ఇప్పుడు కొత్తిమీర కట్ట సభ్యుడు ఒక పిట్టకథ చెబుతాడు'' అని స్పీకర్ అన్నాడు.
ఆ ప్రతిపక్ష సభ్యుడు లేచి నిలుచున్నాడు. సభనంతటినీ ఓ సారి పరికించి చూసాడు. గొంతు సవరించుకొన్నాడు.
ఓ అప్పారావు అప్పులతో సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. మొగుడు గురించి అతని భార్య-
మొదటి నెల : నా మొగుడికి నా మీద ఎంత ప్రేమో
రెండో నెల : నా కోసమే కదా అప్పులు చేస్తున్నాడు.
మూడో నెల :ఏదైనా పని చేసి సంపాదిస్తే బాగుండు.
నాలుగో నెల : అప్పులు చేసి ఎన్ని రోజులు పోషిస్తావు. ఏదైనా పని చెయ్యొచ్చు గదా.
ఐదో నెల : నీకు సిగ్గు శరం లేదా? అప్పులు చేసి ఎన్ని రోజులు బండి నెట్టుకొస్తావు.
ఆరో నెల : అప్పులు చేసి బతికే నీలాంటి మొగుడు ఉన్నా లేకున్నా ఒకటే. నేను మా పుట్టింటికి పోతున్నాను.
పిట్టకథ అయిపోగానే షేమ్, షేమ్ అంటూ ప్రతిపక్ష సభ్యులు అరిచారు.
''ఈ అసెంబ్లీ బాగోతాన్ని రేపటికి వాయిదా వేస్తున్నాను'' అని స్పీకర్ ప్రకటించాడు.
లిలిలి
చిత్రపురి ఒలంపిక్స్ జరిగాయి. అందులో దిక్కుమాలిన రాష్ట్ర ఆటగాళ్లు అన్ని ఆటలాడేరు. కానీ ఏ ఆటలోనూ వాళ్లకు ఒక్క పతకమైనా రాలేదు. మహామంత్రి లత్కోర్ విచారంలో మునిగిపోయాడు. ఏం చేస్తే తమ ఆటగాళ్ళకు పతకాలొస్తాయని ఆలోచించాడు. ఆలోచించి ఆలోచించి ఆఖరికి క్రీడాశాఖ మంత్రిని పిలిచాడు.
''మన అమ్మో నగరంలో ఒలంపిక్స్ పెడితే ఎలా ఉంటుంది'' అని అడిగాడు.
''అమ్మో నగరంలో ఒలంపిక్సా!''
''అవును''
''ఒలంపిక్స్ జరపాలంటే బోలెడన్నీ క్రీడా మైదానాలు కావాలి. పెద్ద ఎత్తున ఏర్పాటు చెయ్యాలి'' అని క్రీడాశాఖ మంత్రి అన్నాడు.
''అవేం లేకుండా ఒలంపిక్స్ జరపలేమా?''
''జరపలేం''
'జరపగలం. అమ్మో ఒలంపిక్స్‌కు ఆటల మైదానాలతో పని లేదు''
''ఆటల మైదానాలు లేకుండా ఒలంపిక్సా'' మరోసారి ఆటలమంత్రి ఆశ్చర్చపోయాడు.
''రన్నింగ్ రేస్‌కు మైదానాలక్కర్లేదు''
''మైదానాలు లేకుండా రన్నింగ్ రేస్ ఎలా జరుపుతాం''
''స్టేజిలో ఆగని సిటీ బస్సు ఎక్కేందుకు పరిగెత్తమనాలి. ఎవరు ముందుగా బస్సుపట్టుకుంటే వారికి స్వర్ణ పతకమివ్వాలి. రెండు, మూడు స్థానాల్లో వచ్చిన వారికి రజత, కాంసయ పతకాలివ్వాలి. ఈ రన్నింగ్ రేస్‌లకు మైదానాలతో పనిలేదు. ఇలా రోడ్ల మీద రన్నింగ్ రేస్‌లు పెడితే మనవాళ్లకే అన్ని పతకాలొస్తాయి.''
''అమ్మో ఒలంపిక్స్‌లో ఇంకేం ఆటలుంటాయి?''
''వాటర్ వర్క్స్ వాళ్లూ, బి.ఎస్.ఎన్. వాళ్లూ రోడ్ల మీద గుంతలు తవ్వుతుంటారు. ఈ గుంతలున్న చోట్ల లాంగ్ జంప్, హై జంప్ పోటీలు జరుపుదాం. వీటిలో కూడా పతకాలు మనవే''
''అమ్మో ఒలంపిక్స్ల కుస్తీ పోటీలు కూడా పెట్టిపిద్దామంటారా?''
''తప్పకుండా పెట్టిద్దాం. వీటిని వీధి కొళాయిల వద్ద జరిపిద్దాం. వాటి దగ్గర ఆడవాళ్లు కుస్తీ పడుతుంటారు. ఈ పోటీల్లోనూ మన వాళ్లకే అన్ని పతకాలొస్తాయి''
''వెయిట్ లిఫ్టింగ్ పోటీలు పెడితే బాగుంటుంది''
''బడికెళ్లే పిల్లల మధ్యే ఈ పోటీలుంటాయి. రోజూ బండెడు పుస్తకాల్ని మోయడం వారికి అలవాటే. ఆ కారణంగా పిల్లలు తేలిగ్గా బరువులెత్తగలరు. పతకాలు సాధించగలరు.''
''షూటింగ్ పోటీలు పెడదామా?''
''పెడదాం. పోలీసులతో షూటింగ్ పోటీలు జరుపుదాం. నీళ్లలో నీడను చూసి అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టాడు. అలాగే మన పోలీసులు మోకాలు కేసి గురి చూసి మెడ మీద కాలుస్తారు. ఇలా ఏ దేశపు ఆటగాడూ కాల్చలేడు''
''పోల్ వాల్ట్ పోటీలు పెట్టిద్దామా?''
''అవి లేకుండా అమ్మో ఒలంపిక్స్ ఎలా జరుపుదామనుకొంటున్నావు. ఖిల్లా జైలు గోడలు తాటి చెట్టంత ఉంటాయి. ఆ జైలు నుంచి తప్పించుకొని పోయిన ఖైదీలయితే ఈ ఆట బాగా ఆడతారు. ఎక్కడున్నా వచ్చి ఈ పోటీల్లో పాల్గొనవలసిందిగా తప్పించుకొని పారిపోయిన ఖైదీలకు విజ్ఞప్లి చేద్దాం. వాళ్లు పోల్వాల్టె పోటీల్లో పాల్గొంటే మన రాష్ట్రానికే పతకాలొస్తాయి.''
''అమ్మో ఒలంపిక్స్‌లో కబడ్డీ ఉంటుందా?''
''ఎందుకుండదు. ఉంటుంది. మనవాళ్లు ఎదురుగా ఉన్నవాడి కాలు బట్టి గుంజుడు అలవాటే కదా''
''ఇంకేం ఆటలు బెడ్తామనుకుంటున్నరు?''
''ఖో ఖో ఆటను అమ్మో ఒలంపిక్స్‌లో చేరుస్తాను. మన రాజకీయ నాయకులకు ఈ ఆట బాగా ఆడొస్తుంది. వెన్నుపోటుకూ దీనికీ ఎన్నో పోలికలున్నాయి. ఈ ఆటలో అన్ని పతకాలూ మనకేనని వేరే చెప్పాలా?''
''మొదట అన్ని రాష్ట్రాలకూ, దేశాలకూ అమ్మో ఒలంపిక్స్ గురించి వర్తమానం పంపుదాం. అందరి వీలును బట్టి ఒలంపిక్స్ జరుపుదాం. ఇండోర్ గేమ్స్ కూడా జరిపితే బాగుంటుంది. ఏమంటావు.'' అని లత్కోర్ అడిగాడు.
''మీ మాట ఎన్నడన్నా కాదన్నానా?''
''పచ్చీసూ, అష్టాచెమ్మా, వైకుంఠ పాళీ, చోర్ పోలీస్ ఇంటి ఇండోర్ గేమ్స్ జరుపుదాం. వచ్చే నెలా అమ్మో ఒలంపిక్స్ జరుపుతామని పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇద్దాం.''
తరువాయి వచ్చేవారం....
- తెలిదేవర భానుమూర్తి
99591 50491