Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా దిక్కుమాలిన రాష్ట్రంలోకి అడుగు పెట్టింది. కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. ఆస్పత్రుల్లో బెడ్లు కరువయ్యాయి. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించారు. దుకాణాలూ, సినిమా హాళ్లూ, స్కూళ్లూ బందయ్యాయి. అందరూ మాస్కులు పెట్టుకున్నారు. వైన్ షాపులూ, బార్లూ మూతబడ్డాయి. మందు దొరక్క పోవడంతో మందుబాబులకు పిచ్చెక్కినట్లైంది. వైన్ షాపుల్లో దొంగలు పడటంతో విస్కీ, బ్రాందీ, బీరు సీసాలకు కాళ్లొచ్చాయి.
బస్సులు నడవడం లేదు. రైళ్లు తిరగడం లేదు. విమానాలు పైకెగరడం లేదు. రాష్ట్ర సరిహద్దుల్ని మూసేసారు. అనవసరంగా రోడ్ల మీద తిరిగే వారిని లాటీలతో పోలీసులు సత్కరించారు. మొదటి సారిగా పక్కింటి వాళ్లూ క్షేమంగా ఉండాలని జెనం కోరుకున్నారు. ఉద్యోగులు ఇండ్లకే పరిమితమయ్యారు. అంట్లు తోమారు. ఇల్లు ఊడ్చారు. పిల్లలనాడించారు. తమ పాక కళా శాస్త్రాన్ని ప్రదర్శించారు. లాక్‌డౌన్‌తో రోడ్లన్నీ బోసిపోయాయి. దాంతో ఏనుగులూ, ఎలుగు బంట్లూ, జింకలూ, లేళ్లూ, నెమళ్లూ రోడ్డెక్కాయి.
పని దొరక్క వలస కూలీలు ఆకలితో అలమటించారు. కొందరు దాతలు వారికి బియ్యం, నూనె, పప్పులతో పాటు కూరగాయలిచ్చారు. కొందరు అన్నందానం చేసారు. మాస్కులూ, శానిటైజర్లూ పంచారు. రోడ్డు మీద ఉమ్మినా, మాస్కు పెట్టుకోకపోయినా పోలీసులు జరిమానా విధించారు. కరోనా పాజిటివ్ కేసులున్న ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా లేని ప్రాంతాన్ని గ్రీన్ జోన్‌గా విభజించారు. గ్రీన్ జోన్లో లాక్డౌన్ ఎత్తివేశారు. మందు అమ్మకాలు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయం తగ్గింది. దాంతో గ్రీన్ జోన్లో వైన్ షాపులు తెరిచేందుకు అనుమతినిచ్చారు. మందు ధరలు 50 నుంచి 100 రూపాయల వరకు పెరిగాయి. మందు బాబులు మైలుదూరం వరకు వైన్‌షాపుల వద్ద క్యూ కట్టారు. మందు సీసాలు పట్టుకుని కొందరు దేవదాసులు వైన్ షాపుల వద్ద డ్యాన్సులు చేశారు. ఇంటికెళ్లే దాకా ఆగకుండా వైన్ షాపుల దగ్గరే మందు కొట్టారు.
''కూర ఇలా వండావేమిటి? రుచీ పచీ లేదు'' అని ఒకడు తన భార్యతో అన్నాడు.
వెంటనే ఆమె తన అన్నకు ఫోన్ చేసి విషయమంతా చెప్పింది. అతనొచ్చి తమ బావగారికి రుచీ పచీ తెలియడం లేదని ఆస్పత్రిలో చేర్చారు. భార్య చేసిన కూరకు వంక పెట్టిన ఆ భర్తగారు పద్నాలుగు రోజులు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది.
ఒకతను పెదవులపై వేలు పెట్టుకుని మాస్కు ఎందుకు పెట్టుకోలేదంటూ పని మనిషికి సైగ చేసాడు. అతని ఐదేండ్ల కూతురు అంతా చూసి -
'అమ్మా.. నాన్న పనిమనిషిని ముద్దు ఇవ్వమని అడుగుతున్నాడే'' అని చెప్పింది.
దాంతో ఆ ఇంట్లో రామ, రావణ యుద్ధం జరిగింది.
ముఖ్యమంత్రి లత్కోర్ బూటకానంద స్వామి దగ్గరకు వెళ్లాడు.
''స్వామీ కరోనా రావడానికి గల కారణమేమిటి?'' అని అడిగాడు. అతనడగగానే బూటకానంద స్వామి ఇలా చెప్పాడు -
ఒకానొక రోజు జంతువులన్నీ నల్లమల అడవిలో సమావేశమయ్యాయి. రోజురోజుకీ ప్రపంచంలో మాంస భక్షణ పెరిగిపోతున్నది. ఇలాగే కొనసాగితే భూమ్మీది జంతువులు లేకుండా పోతాయి. దీన్ని అరికట్టడానికి ఏం చేస్తే బాగుంటుందని జంతువులు చర్చించాయి. చర్చించి త్రిమూర్తుల వద్దకెళ్లి తమ సమస్య గురించి చెప్పాలని నిర్ణయించాయి.
ముందుగా జంతువులన్నీ కలిసి వైకుంఠం వెళ్లాయి. విష్ణుమూర్తి శేషతల్పంపై నిద్రిస్తున్నాడు. లక్ష్మీదేవి ఆయన కాళ్లు వత్తుతున్నది. సముద్ర కెరటాలకు శేష తల్పం పైకీ, కిందకీ ఊగుతున్నది. చల్లగాలి వీస్తున్నది.
''రక్షించండి ప్రభూ'' అంటూ జంతువులు మొత్తుకున్నాయి. విష్ణువు కండ్లు తెరిచాడు.
''మీకొచ్చిన కష్టమేమిటి'' విష్ణువు అడిగాడు.
జంతువులన్నీ ఒక్కసారిగా తమ కష్టాల్ని చెబుతుంటే అంతా గందరగోళంగా మారింది. ఏ జంతువు ఏం చెబుతున్నదో విష్ణుమూర్తికి అర్థం కాలేదు.
''ఏ ఒక్క జంతువో మాట్లాడితే బాగుంటుంది'' అని ఆయన అన్నాడు.
జంతువుల తరుపున ఒక ఎద్దు ముందుకొచ్చింది. ''దేవా! భూలోకంలో రోజూ జనం మమ్మల్ని కోసం చంపుతున్నారు. మసాలా వేసి మా మాంసంతో రకరకాల వంటలు వండుకుంటున్నారు. బిర్యానీ చేసుకుంటున్నారు. పక్షులను చంపి తింటున్నారు. చేపలనూ, రొయ్యలనూ కూడా వదలడం లేదు. ఓ దేశంలో చివరకు ఎలకలనూ, పాములనూ, బొద్దింకలను కూడా తినేస్తున్నారు. ఇలాగే కొనసాగితే భూమ్మీద మేము లేకుండా పోతాం. కొత్త అవతారం ఎత్తైనా మమ్మల్ని మీరు రక్షించాలి'' అని ఎద్దు అన్నది.
విష్ణుమూర్తి చిలకలా నవ్వాడు.
''భూలోకంలో ప్రతి ఊళ్లో నా గుడి ఉంది. నా భక్తులున్నారు. రోజూ వాళ్లు నాకు పూజలు చేస్తుంటారు. నైవేద్యాలు పెడుతుంటారు. ముడుపులు చెల్లిస్తారు. తల నీలాలు సమర్పిస్తారు. వేంకటేశ్వరుణ్ని, రాముణ్ని, నరసింహస్వామిని, సత్యనారాయుణ్ని నేనే. వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాలతో నేనున్నాను. ఏటా నాకు రథోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుపుతారు. నా భక్తుల్లో ఎక్కువమంది మాంసాహారులు. జంతు భక్షణ లేకుండా చేస్తే వారు చిన్నబుచ్చుకుంటారు. నాకు పూజలు చేయడం మానేస్తారు. నా ఆలయాలకెవరూ రారు. నేను ఏం చెయ్యలేను'' అని విష్ణుమూర్తి అన్నాడు.
జంతువులన్నీ కైలాసం వెళ్లాయి. అపుడు శివుడు తాండవమాడుతున్నాడు. నంది ద్వారం వద్దే జంతువులను నిలిపేసాడు. శివ తాండవమయ్యాక నంది జంతువులను లోపలికి పోనిచ్చాడు.
''మీకేం కావాలి? మీరెందుకొచ్చారు?'' అని శివుడు జంతువులను అడిగాడు.
జంతువుల తరుపున ఒక మేక ముందుకొచ్చింది.
''శివా! భూలోకంలో ప్రతి దినమూ వేలాది సంఖ్యలో మనుషులు మమ్మల్ని చంపుతున్నారు. మా మాంసంతో రకరకాల వంటలు వండుతున్నారు. శాఖాహారం మంచిదని తెలిసినా మాంసా హారాన్ని వారు వదలడం లేదు. మేకలనూ, కోళ్లనూ, చేపలనూ వారు తినని రోజరటూ లేదు. పక్షులనూ చంపి తింటున్నారు. ఇలా అయితే భూమ్మీద జంతువులు లేకుండాపోతాయి. మీరే మమ్మల్ని కాపాడాలి''
''మీ బాధ నాకర్థమైంది. మాంసాహారుల్లో ఎందరో నా భక్తులున్నారు. వారు రోజూ నాకు పూజ చేస్తారు. అభిషేకం చేస్తారు. మారేడు దళాలతో పూజిస్తారు. భూలోకంలో విష్ణుమూర్తికి ఎన్ని ఆలయాలున్నాయో నాకూ అన్ని ఆలయాలున్నాయి. శైవ క్షేత్రాలున్నాయి. శివరాత్రి ఉపవాసమంటారు. రాత్రి జాగరణ చేస్తారు. ఆ కారణంగా నా భక్తుల్ని మాంసాహారానికి దూరం చెయ్యలేను'' అని శివుడన్నాడు.
''మేము కూడా నిన్ను పూజిస్తున్నామే. నీ వాహనం ఎద్దు. నెమలి కుమార స్వామి వాహనం. ఎలక గణపతి వాహనం. పాము నీ మెడలో హారంగా ఉంది. పెద్దపులి ఆదిపరాశక్తికి వాహనం. జంతువులే దేవతల వాహనాలు. ఎలగైనా మీరే మమ్మల్ని ఆదుకోండి. భక్త సులభుడనే పేరు నిలుపుకోండి'' అని ఎద్దు అన్నది.
''ఆయుష్షు తీరితే ఎవరైనా చావక తప్పదు. ఆయుష్షు మూడి మీరు చస్తుంటే నన్నేం చేయమంటారు'' అని శంకరుడన్నాడు.
కైలాసం నుంచి జంతువులన్నీ బ్రహ్మ వద్దకు వెళ్లాయి. విష్ణుమూర్తికీ, శివునికీ చెప్పినట్లే ఆయనకూ చెప్పాయి. తమను రక్షించమని వేడుకున్నాయి.
''మిమ్మల్ని పుట్టించినట్లే మనుషుల్ని నేను పుట్టించాను. నుదుటి రాత రాసాను. మీ తలరాతను నేను మార్చలేను. నేనేమిటి ఎదరూ మార్చలేరు. నేను మిమ్మల్ని కాపాడలేను'' అని బ్రహ్మ అన్నాడు.
ఆఖరి ప్రయత్నంగా జంతువులన్నీ ఆదిపరాశక్తి వద్దకు వెళ్లాయి. తమకొచ్చిన కష్టాన్ని ఆమెకు చెప్పాయి. వాటి మాటల్ని విని ఆమె చలించి పోయింది.
''మీరేం విచారించకండి. భూలోకంలో ఎవరూ మీ జోలికి రాకుండా చూస్తాను. మీరు అకాల మరణం చెందినట్లే మానవులూ అకాల మరణం చెందేటట్లు చేస్తాను. నిర్భయంగా వెళ్లండి. నిశ్చింతగా ఉండండి'' అని ఆదిపరాశక్తి అన్నది.
జంతువులన్నీ సంతోషించాయి. ఆమెకు మొక్కి వెళ్లిపోయాయి.
జంతువులకిచ్చిన వాగ్దానాన్ని ఆదిపరాశక్తి నిలబెట్టుకుంది. ఎలకలు, పాములు, బొద్దింకలతో పాటు సకల జీవులను తినే దేశంలో కరోనా వైరస్ సృష్టించింది. మొదట అక్కడ ఓ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. క్రమంగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలకూ పాకింది.
దిక్కుమాలిన రాష్ట్రంలో ఆలయా లన్నీ మూతపడ్డాయి. మొదటి సారిగా వేంకటేశ్వరుని ఆలయం మూత పడింది. దేవుళ్లకు పూజలు లేకుండా పోయాయి. దాంతో శివుడు, విష్ణువు ఆందోళన చెందారు. దివ్యదృష్టితో చూసారు. వారికి విషయమంతా తెలిసింది. మాంసభక్షణ నిలిపేందుకు ఆదిపరాశక్తికి కరోనా వైరస్ సృష్టిర చినట్లు వారు గ్రహించారు. ఆది పరాశక్తి వద్దకు వెళ్లారు.
అయిగిరి నందిని నందిత మేదిని అంటూ స్తుతించారు.
''ఏమిటిలా వచ్చారు'' అని ఆదిపరాశక్తి వారినడిగింది.
''అమ్మా! భూలోకంలో ఆలయాలన్నీ మూతపడ్డాయి. మమ్మల్ని ఎవరూ పూజించడం లేదు. ఇదంతా కరోనా మూలంగా జరిగింది'' అని వారు చెప్పారు.
''జంతు వధ నాపడానికే కరోనా వైరస్ సృష్టించాను'' అని ఆదిపరాశక్తి అన్నది.
''అయితే మాకిక పూజలు లేనట్లేనా''
''ఓపిక పట్టండి. కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ తయారయ్యాక మామూలు పరిస్థితి ఏర్పడుతుంది. ఆలయాలు తెరుస్తారు. మీకు పూజలు చేస్తారు. అంతవరకూ ఇంతే'' అని ఆదిపరాశక్తి అన్నది.
''కరోనా వైరస్ వైరస్ కాదు. అది విష్ణుమూర్తి అవతారం. ఎవరైతే మాంసాన్ని తింటున్నారో వారిని శిక్షించడానికి విష్ణుమూర్తి దీన్ని భూలోకం పంపాడు. ముఖ్యంగా దేవుడు ఆ దేశానికి గుణపాఠం చెప్పదలిచాడు. ఆ దేశస్తులంతా శాఖాహారులుగా మారాలి. కరోనా వైరస్ వ్యాప్తి ఆగిపోవాలంటే ముందు దేవుడు శాంతించాలి. ఆ దేశ అధ్యక్షుడు ముందుగా కరోనాదేవి విగ్రహాన్ని నెలకొల్పి క్షమాపణ కోరాలి. ఇప్పటి నుంచి మాంసం అనబోమని ఆ దేశస్తులందరూ ఆ విగ్రహం ముందు ప్రమాణం చేయాలి. చెంపలేసుకోవాలి. ముక్కు నేలకు రాయాలి. కరోనా దేవికి సాష్టాంగ ప్రణామం చెయ్యాలి. అలా చేస్తే కరోనా వైరస్ పోతుంది.'' అని అఖిల భారత హిందూ మహాసభల అధ్యక్షుడు స్వామి చక్రపాణి సెలవిచ్చారు.
బూటకానంద స్వామి సలహా మేరకు ముఖ్యమంత్రి లత్కోర్ కరోనా వినాశన యాగం చేసారు.
లిలిలి
ఆ రోజు చీకటి పల్లె ఊరు నడుమ జనం గుమిగూడారు. ఆ ఊరు నడుమ పెద్ద మర్రి చెట్టుంది. దానికింద పెద్ద బల్ల పీట వేసారు. దాని మీద హరికథ క్షమించాలి మందు కథ చెప్పడానికి హరిదాసు మళ్లీ క్షమించాలి మందుదాసు నిలబడి ఉన్నాడు. అతని మెడలో పూలదండ ఉంది. ఓ చేతిలో చిడతలున్నాయి. అతనికో పక్క హార్మోనిస్టు మరో పక్క విద్వాంసుడు ఉన్నారు.
వినాయకా నను వినాబ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజా వినాయకా అనే ప్రార్థనతో అతను మందు కథ మొదలుపెట్టాడు.
పూర్వం ముల్లోకాల్లో మానసికాందోళనలు పెరిగిపోయాయి. ఏం చేస్తే అవిపోతాయో తెలియక దేవతలు అల్లల్లాడిపోయారు.
చివరికి నారదుని సలహా మేరకు మందరగిరిని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని దానవుల సహాయంతో పాల సముద్రాన్ని చిలికారు. అమృతంతో పాటు పాల సమద్రం నుంచి సుర పుట్టింది. సుర తాగిన వారికి మానసిక ఆందోళనలు మటుమాయమయ్యాయి. సురను తాగడం వల్ల దేవతలు సురులయ్యారు. ఈ కాలంలో కూడా రకరకాల పేర్లతో సుర దొరుకుతున్నది.
ఇందుగలదందులేదని
సందేహము వలదు మందు
ఎందెందు వెతకి చూసిన అందందే గలదు
మందు మందు భాగ్యుడు కంటే
చెప్పిన కథే చెప్పకుండా ఊరూరా పదిరోజుల నుంచీ మందు కథ చెబుతున్నాడు. గొంతు పట్టేసింది. గాత్ర సౌలభ్యం కోసం పెగ్గు...
మందుదాసు అలా అనగానే ఓ మందు భక్తుడు అతనికి పెగ్గు విస్కీ ఇచ్చాడు. దాన్ని ఒక్క గుక్కలో తాగి
పట్టపగలే వెన్నెల వాన కురిపించేది మందు
కష్టాల్ని మరిపించి మురిపించే ముద్దుగుమ్మ మందు
హద్దుల్ని చెరిపి ఆనందాబ్దిలో మునకలేయించేది మందు
కన్ను గీటి పిలిచే మల్లెపూల సందు దిల్పసందు మందు
అని రాగయుక్తంగా మందుదాసు పద్యం పాడాడు.
ఒక తాగుబోతు మందుకొట్టి గుడి ముందు నుంచి వెళుతున్నాడు. ఇతనికి గుడి పూజారి కనిపించాడు.
''ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పదేది?'' అని తాగుబోతు పూజారినడిగాడు.
''గుడి గొప్పది'' పూజారి చెప్పాడు.
''గుడి గొప్పదైతే భూమి మీద ఎందుకుంది?''
'భూమే గొప్పది'
''భూమి గొప్పదైతే ఆదిశేషుడెలా మోస్తున్నాడు''
''ఆదిశేషుడే గొప్పవాడు''
''ఆదిశేషుడే గొప్పవాడైతే శివుడు మెళ్లో ఎందుకేసుకున్నాడు''
''శివుడే గొప్పవాడు''
''శివుడు గొప్పవాడైతే కైలాసంలో ఎలా ఉన్నాడు''
''నువ్వే చెప్పు. అందరికన్నా గొప్పవాడెవడో'' అని విసిగిపోయిన పూజారి తాగుబోతునడిగాడు.
''ఫుల్ బాటిల్ మందుకొట్టి రెండు కాళ్లపై ఎవడు నిలబడతాడో వాడే అందరికన్నా గొప్పవాడు'' అని తాగుబోతు చెప్పాడు.
మందుదాసు చిడతలు వాయిస్తూ చిందులేస్తూ-
ఉందిలే మందు సీసా సందూసందునా
అందరూ మందెయ్యాలి నందానందనా
కొందరికోసం అందరు తాగి
అందరి కోసం కొందరు ఊగి
బీదా ధనికా తేడా లేక అందరూ
మందు కొట్టి ఊగుచూనుందురూ
అంటూ మందు కీర్తన ఆలపించాడు.
మందుకొట్టిన వాడు తనను తాను మరిచిపోతాడు. తన ఇల్లునూ మరిచిపోతాడు. ఎలా అంటారా? ఇలా -
ఇస్తారి, సత్నారి ప్రాణ స్నేహితులు. వారిద్దరిదీ ఒకే ఊరు. అంతేగాదు, వారు ఒకే వీధిలో ఉండేవారు. ఒక బళ్లోనే చదువుకున్నారు. ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. చెల్లెలు పెండ్లి ఉండటంతో ఇస్తారి భార్య పుట్టింటికి వెళ్లింది.
ఆ రాత్రి మందు పార్టీకి ఇస్తారి సత్నారిని పిలిచాడు. వస్తూ వస్తూ వేయించిన జీడిపప్పు, చికెన్ ఫ్రై, మిక్చర్; మిర్చి బజ్జీలు, బిర్యానీ పొట్లాలు తీసుకుని సత్నారి, ఇస్తారి ఇంటికెళ్లాడు. ఇద్దరూ మందుకొడుతూ కూర్చున్నారు. మధ్య మధ్యలో జీడిపప్పు, మిర్చిబజ్జీలు, మిక్చర్ తినసాగారు. మందుకొడుతూ వాళ్లు మాటల్లో పడ్డారు. ఆ మాటా ఈ మాటా అయ్యాక వారి దృష్టి సినిమాల మీద పడింది.
''హీరోయినంటే కరీనాకపూరే హీరోయిన్'' అని సత్నారి అన్నాడు.
''హీరోయినంటే దీపికా పదుకొనేనే హీరోయిన్'' అని ఇస్తారి అన్నాడు.
''త్రీ ఇడియట్స్ సినిమా జూసినవా?''
''చెన్నై ఎక్స్‌ప్రెస్ సిన్మాజూసినవా? గా దాంట్ల దీపికా యాక్షన్ జూసినవా?''
''హీరోయిన్ అంటే కరీనానే అంటే దీపిక అంటవేంది?''
''ఊరోనివి నీకేమెర్క''
''ఉచ్చల శాపలు బట్టెటోనివి నీకేమెర్క''
''యూ గెటౌట్''
''యూ గెటౌట్''
నిషా తలకెక్కడంతో అది తన ఇల్లే అన్న సంగతి యాదిమర్సి సత్నారి తన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
తరువాయి వచ్చేవారం....
- తెలిదేవర భానుమూర్తి
99591 50491