Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాను రాయడం మొదలుపెట్టిన నాటి నుంచి కన్నుమూసే వరకు కలాన్ని నడిపించిన కవియోధుడు, రచయిత, పరిశోధకుడు, చరిత్రకారుడు, నిఘంటుకర్త, ఆధ్యాత్మిక భావదీప్తి, అనువాదకుడు, కథకుడు, నవలాకర్త, జీవిత చరిత్రకారుడు, శతాధిక శతకకర్త, వ్యాఖ్యానకారుడు, నాటకకర్త వెరసి మహా మనిషి, తెలంగాణ తేజోదీప్తి కపిలవాయి లింగమూర్తి. ఈయన రచనలు, చేసిన పనులు చూస్తే ఒక మనిషి జీవించి ఉన్నకాలంలో ఇన్ని రచనలు చేయగలమా అనిపించకమానదు. 13 శతకాలు, 2 సంకీర్తనా సంపుటాలు, 5 ఉదాహరణ కావ్యాలు, 7 వచనగేయ పద్యకృతులు, 7 కావ్యాలు, 9 ఆధ్యాతిక రచనలు, 6 నవలలు, వచన రచనలు, 3 కథా సంపుటాలు, 6 వ్యాఖ్యానాలు, సంకలనాలు, 4 నాటకాలు, 1 నిఘంటువు, 2 పీఠికా గ్రంథాలు, 1 అనువాదం, 51 గ్రంథాలు పరిష్కారం, సంకలనాలు, 3 జీవిత, ఆత్మకథా రచనలు, 6 సంచికలకు సంపాదకత్వం, వ్యాస సంపుటాలు, ఇతరాలు మరో మూడు మెరసి 136 ముద్రితాలు, 26 అముద్రితాలు... కపిలవాయి రచనలు.
ఈ మహారచయిత 31మార్చి, 1928న నేటి నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం జినుకుంటలో పుట్టారు. తల్లిదండ్రులు మాణిక్యమ్మ- వెంకటాచలం. ఉపాధ్యాయులుగా నాగర్ కర్నూలు జాతీయోన్నత పాఠశాలలో, తరువాత ఉపన్యాసకునిగా పాలెం ప్రాచ్య కళాశాలలో పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ తెలుగు చదివారు. వీరి విశేష కృషిని గౌరవించి 2014లో తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేటుతో సత్కరించింది. కవిగా కపిలవాయి లింగమూర్తి చేపట్టి సుసంపన్నం చేయని ప్రక్రియ, రూపం లేదనడం అతిశయోక్తికాదు. అందుకు పైన పేర్కొన్న పుస్తకాల సంఖ్య నిదర్శనం. వీరి మౌళిక రచనలు ఒక ఎత్తైతే, నిరంతర పరిశోధకునిగా ఈయన పరిష్కరించిన 51 గ్రంథాలు ఒక ఎత్తు.
'చక్రతీర్థ మహాత్య్మం', 'శ్రీమత్ ప్రతాపగిరి ఖండం' వంటి ప్రౌఢ కావ్యాలు మొదలుకుని 'పాలమూరు జిల్లా దేవాలయాలు', 'సోమశిల దేవాలయాల చరిత్ర' వంటి అనేక రచనలు వీరి రచనల్లో ఉన్నాయి. ఎంతగా సంప్రదాయ సాహిత్యాన్ని సుసం పన్నం చేశారో, ఈ కోవలోనేవారు 'పామర సంస్కృతం' పేరుతో దాదాపు 6000 పైగా పదాలతో తెచ్చిన పాలమూరు మాండలిక పద నిఘంటువు. పుట్టిన నేలనే కాదు తనను ఇంగా మలచిన తన సామాజిక నేపథ్యాన్ని, కవిగా, రచయితగా, కావ్యకర్తగా ''మతులు పోగొట్టే యతులు, అలంకార మదగజ కుంబస్థలాలను బద్ధలు కొట్టిన లాక్షణికుడు. సంగీతం, సాహిత్యం, సంస్కృతి అనే మూడు విభూతిరేఖలను నిత్యం నుదిటిన ధరించిన 'కవికుల వైతాళికుడు'. వివిధ శాస్త్రాలలో ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శిచిన దార్శనికుడు'' పిల్లల కోసమూ రాయడం విశేషం. 162 రచనలు చేసిన కపిల వాయి పిల్లల కోసం రాశాడు. 162 వివిధ సత్కారాలు, పురస్కా రాలు అందుకున్నారు. అవేకాక ఆయన రాసిన 'ఉమామహేశ్వరం' స్థల పురాణం వంటి అనేక కథలు నేను చదువుకున్నప్పుడు, బడిలో పాఠం చెప్పిన్పుడు పాఠ్యపుస్తకాలలో ఉన్నాయి.
బాలల కోసం వందలాది పద్యాలు, శతకాలు రాసినప్పటికీ కపిలవాయి రాసిన బాల సాహిత్యంలో మనకు ప్రధానంగా కనిపించేవి 'ఉప్పనూతల కథ' బాలల నవల. 'పద్య కథా పరిమళం' బాలల కథా సంపుటాలతో పాటు వివిధ సందర్భాల్లో రాసిన బాల గేయాలు. అదే కోవలో గీత పద్యాలతో రాసిన 'సహనామ శతకం' గొప్ప తెలుగు బాల సాహిత్యంలో గొప్పరచన. ఉప్పనూతల కథ అచ్చంపేట తాలూకాలోని ఒక ప్రసిద్ధ గ్రామం, ఇక్కడ కేదారేశ్వరాలయం ఉంది. ఈ ఆలయ ఆవిర్భావం మొదలుకుని మనల్ని ఈ కృతి హిమాలయాల్లోని కేదారేశ్వరం వరకు తీసుకుపోతుంది. ఇందులో అక్కడక్కడా శ్లోకాలు, పద్యాలు, జానపద గీతాలు పిల్లలకు ఆసక్తిని కలిగిస్తాయి. మరో రచన 'పద్య కథా పరిమళం' మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కోసం వచ్చిన రచన. ప్రసిద్ధ/వివిదాస్పద పద్యాలకు కల్పనలు చేకూర్చి పిల్లలకు దీనిని కానుగా అందించారు కలిలవాయి. 'పల్లెటూళ్లు చల్లన- పట్నాలు వెచ్చన / ప్రకృతిలో పచ్చదనం - పట్నంలో చిక్కునా/ పల్లె మనకు తల్లి వడి - పట్నమంటె తండ్రి బడి' అంటూ సాగే వీరి గేయాలు కూడా విలక్షణమైనవే. విలక్షణమైన వీరి రచన సహనామ శతకం, ఇది కొలతం శతకం. తన కుమారుడు కిశోర్బాబుకు గణిత శాస్త్రంను పరిచయం చేసేందుకు దీనిని రాశారట. ఈ ఏకార్ధ మకుట శతకంతో సాగిన ఈ శతకంలో అన్ని కొలతలు అంటే దాన్యం, మందు, భూమి, పైకం లెక్క, తెలంగాణ లెక్క, కప్పు, ఔన్స్ ఇలా ప్రతి లెక్కను వివరంగా పిల్లల కోసం వ్యవరించారు. ప్రౌఢసాహ్యింతో పాటు బాల సాహిత్యాన్ని వెలిగించిన కవన విశ్వకర్మ డా.కపిలవాయి లింగమూర్తి నవంబర్ 2, 2018న శివైక్యం చెందారు. ఈ ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాల తివిక్రముడు తెలంగాణ సాహిత్య చరిత్రకు అక్షరాల గోలుకొండ... కావ్య గిరుల చార్మినార్... కావ్యరచనా సోమశిల... కవన దుందుభి. జయహో! కపిలవాయి!
- డా|| పత్తిపాక మోహన్, 9966229548