Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నడినెత్తిమీదకు సూర్యుడొచ్చాడు.
అమ్మో నగర రోడ్ల మీద ట్రాఫిక్ పలచబడింది.
ఇళ్ళ నుంచి తెచ్చుకొన్న టిఫిన్ డబ్బాల మూతల్ని ఎన్జీవోలు తీసారు.
ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు.
జోక్స్ వేసుకుని నవ్వుకున్నారు.
పొలమారితే అరచేత్తో మాడు కొట్టుకున్నారు.
మీల్స్ హోటళ్లు కిటకిటలాడుతున్నాయి.
సీటు దొరకని వాళ్లు సీట్ల ఖాళీ కోసం ఎదురుచూస్తున్నారు. రోడ్డుకొక పక్కన కూర్చున్న మోచీ తెగిన చెప్పు ఉంగటాన్ని కుడుతున్నాడు. గుడి ముందున్న బిచ్చగాడు సిల్వర్ బొచ్చెలోని చిల్లర లెక్కబెట్టుకొంటున్నాడు. నిప్పులతో కూడిన వై ఆకారపు మట్టి పాత్రను ఎడమచేత్తో పట్టుకుని అందులో ఊదువేసి నెమలీకల కట్టతో విసరగా లేచిన ఊదు పొగతో సువాసన వెదజల్లి ఫకీరు అడుక్కొంటున్నాడు.
లత్కోర్ చికెన్ బిర్యానీ తిన్నాడు. చారు తాగాడు. ఇంతకు ముందైతే తినగానే కాసేపు కునుకు తీసేవాడు. ఎన్నికలు రావడంతో రాత్రిపూటే అతనికి నిద్ర పట్టడం లేదు. ఇక పగటి నిద్ర మాటెక్కడిది? పళ్లలో ఇరుక్కొన్న చికెన్ ముక్కల్ని టూత్‌పిక్‌తో తీసుకుంటూ ఆలోచనల్లో అతను ఈతకొడుతున్నాడు. సాధారణంగా ఎవరికీ అంత తొందరగా అతను అపాయింట్మెంట్ ఇవ్వడు. ఎన్నికలు రావడంతో ఏ చెట్టులో ఏ పండుందో అనుకుని ఎవరికి పడితే వారికి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు.
కిరాయి జెనాలను వెంటబెట్టుకుని మహామంత్రి దగ్గరకు కప్పయ్య వెళ్లాడు.
'నమస్తే' అన్నాడు.
'నమస్తే, నమస్తే బాగున్నారా?'
'మీ దయ వల్ల బాగున్నాను.'
''ఏంటిలా వచ్చావు?'
చక్కెరకొచ్చి గిన్నెదాచలేదు అతను
'ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం' అన్నాడు.
'మీ నియోజకవర్గంలో చాలా మంది ఎమ్మెల్యే టిక్కెట్టు కావాలంటున్నారు.'
'నియోజకవర్గంలో మా కులస్తులే ఎక్కువ మంది ఉన్నారు'
'మీ కులస్తులందరూ నీకే ఓట్లు వేస్తారనే గ్యారంటీ ఉందా?' అని లత్కోర్ అడిగాడు.
'ఉంది. కులం కులం ఒక్కటి. ఎదురు యాడాది ఎంకటీ అని వెనుకట ఒకడున్నాడు'
'మీ కులస్తుల గురించి నువు పెద్దగా చేసిందేమీ లేదని అంటున్నారే'
'నేను చేసినా చెయ్యకపోయినా మా కులస్తులందరూ నాకే ఓట్లేస్తారు'
'అదెలా?'
'దీనికొక కత వినండి. ఒకసారి అడవిలో ఎన్నికలు జరిగాయి. చెట్లన్నీ ఓట్లు వేసాయి' అంటూ కప్పయ్య ఇంకేమో చెప్పబోతుంటే లత్కోర్ అడ్డు తగిలి -
'ఆ ఎన్నికల్లో ఎవరు పోటీ చేశారు' అని అడిగాడు
'నదీ, గొడ్డలీ పోటీ చేశాయి.'
'ఈ రెండింటిలో ఏది గెలిచింది?'
'చెట్లకు నీళ్లిచ్చే నది గెలిచింది'
'మీరు చెప్పింది తప్పు. నది గెలవలేదు. గొడ్డలి గెలిచింది'
''తమను నరికేసే గొడ్డలికి చెట్లెందుకు ఓటు ్ల వేసాయి' అని మహామంత్రి అడిగాడు.
'ఈ ప్రశ్ననే చెట్ల నడిగితే ఏం చెప్పాయంటే...'
'ఏం చెప్పాయి..'
'గొడ్డలి మమ్మల్ని నరికేస్తున్నా దానికమర్చిన కర్ర మా నుంచి వచ్చిందే. మా కులందే' అని చెట్లు చెప్పాయి.
'అంటే నువ్వు మంచి చెయ్యకపోయినా మీ కులస్తులందరూ ఓట్లేసి నిన్ను గెలిపిస్తారంటావు'
'అవును. మీరేమైనా చేసి నాకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇప్పించండి. మీరిస్తారనే నమ్మకంతో ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టేశాను.' అని కప్పయ్య అన్నాడు.
'చూద్దాంలే..' అని లత్కోర్ అన్నాడు.
కప్పయ్య అనుకున్నది. ఇంకొకటయ్యింది. అతను పువ్వు అనుకున్నది. ముల్లైంది. కచ్చితంగా వస్తుందనుకున్న ఎమ్మెల్యే టిక్కెట్టు రాలేదు.
అతను కోపంతో వెర్రెత్తి ఊగిపోయాడు. తన దగ్గిరి వాళ్లను కలిసి, వాళ్ల సలహా మేరకు రెబల్ క్యాండేట్‌గా నామినేషన్ దాఖలు చేసాడు.
బొచ్చె పార్టీ నాయకులు ఆఖరికి లత్కోర్ కూడా ఎంత చెప్పినా అతను వినలేదు. నామినేషన్ వెనక్కి తీసుకోలేదు. దాంతో అతణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసారు.
'నన్ను సస్పెండ్ చేస్తే భయపడతానా? ఉడత ఊపులకు చెట్టెక్కడైనా కదులుతుందా?' అని కప్పయ్య అడిగాడు.
బొచ్చెపార్టీ ఎమ్మెల్యే పేనయ్యకు ఎమ్మెల్యే టిక్కెట్టిచ్చింది. తన చెంచాలకు అతను దావతిచ్చాడు. వాళ్లు తాగి కడుపులో చోటు లేనంత తిన్నారు. ఎండలోనూ, వానలోనూ అతని తరుపున ప్రచారం చేస్తామని అమ్మతోడు, అయ్యతోడంటూ ఒట్టుపెట్టారు.
అయ్యగారి దగ్గరకెళ్లి పేనయ్య ఆయన కాళ్లు మొక్కారు.
'విజయీవ' అని ఆయన ఆశీర్వదించాడు. ఆయనకతను తన జాతకాన్ని ఇచ్చాడు. తన జాతక ప్రకారం ఏ దినం, ఏ సమయంలో నామినేషన్ వేస్తే మంచిదో చెప్పమన్నాడు. మంగళవారం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్లకు మంచి ముహూర్తముంది. ఆ ముహూర్తంలో నామినేషన్ వేస్తే గెలుపు ఖాయమని అతనికి అయ్యగారు చెప్పారు.
పేనయ్య నాదస్వరాన్ని పిలిపించాడు.
బ్యాండ్ మేళానికి బయానా ఇచ్చాడు.
డప్పుల వాళ్ళను రప్పించాడు.
పటాకులు తెప్పించాడు.
ఊరేగింపు ముందు వాటిని కాల్పించే ఏర్పాట్లు చేశాడు.
ప్రతి వీధిలో పూల దండలు మెడలో పడేటట్లు చూసాడు.
అట్టహాసంగా ఊరేగింపుతో వెళ్లి నామినేషన్ వేసాడు. గెలుపు పిల్ల పుట్టక ముందే పేరు పెట్టేశాడు.
ఎప్పటిలా కాకుండా తెల్లవారు జామునే నిద్రలేచి పేనయ్య మార్నింగ్ వాక్కు వెళ్లాడు.
టిఫిన్ సెంటర్ నుంచి వస్తున్న సాంబారు వాసనతో పాటు అతనికి ఓటు వాసన వచ్చింది.
రోడ్డు ఊడుస్తున్న సఫాయి వాళ్ల చీపుళ్ల చప్పుళ్లలో అతనికి నోట్ల ఫెళఫెళలు వినిపించాయి.
దుకాణం ముందు మార్వాడీ సేటు జల్లిన జొన్నలకోసం మూగిన పావురాళ్లలో అతనికి ఓటర్లు కనిపించారు.
హోటల్‌కెళ్లి అతను అందరికీ టిఫెన్లు పెట్టించాడు. టీ తాగించి ఓట్లడిగాడు. స్వయంగా ఛారుచేస్తూ ఫోటోకు ఫోజిచ్చాడు. అతను చేసిన ఛారు చక్కెర పానకంలా ఉందని కొందరన్నారు.
పేనయ్య స్నానం చేసాక బొట్టుపెట్టుకున్నాడు. ధోతి కట్టుకున్నాడు. కండువా కప్పుకుని రామాలయం వెళ్లాడు. దేవుడికి కాకుండా దేవాలయానికొచ్చిన భక్తులకు ముందుగా దండం పెట్టాడాఉ. పూజ చేసాక హారతి పళ్లెంలో నూర్రూపాయల నోటూ, హుండీలో ఐదువందల రూపాయల నోటూ వేసాడు.
'చూసావా! దేవీ ఐదు వేల రూపాయల వంతున ఇచ్చి ఓట్లు కొంటాడు. నా హుండీలో ముష్టి ఐదు వందల నోటు వేసాడు' అని రాముడన్నాడు.
'తొందరపడకండి నాథా! అతనేమని మొక్కుతాడో ఒకసారి చూడండి' అని సీతాదేవి అన్నది.
'రామా! నన్ను గెలిపిస్తే నీకు బంగారు బాణం, సీతమ్మకు బంగారు గాజులూ, కమ్మలూ చేయిస్తాను.' అని పేనయ్య మొక్కాడు.
'ఇంతకీ వీడు సొంత సొమ్ముతో ఇవన్నీ చేయిస్తాడా దేవీ?' అని రాముడడిగాడుజ
'అమాయకంగా అడుగుతారేమీ నాథా! వీడెక్కడైనా సొంత సొమ్ముతో చేయిస్తాడా? సర్కారు సొమ్ముతో చేయించి ఇస్తాడు' అని నవ్వుతూ సీతాదేవి చెప్పింది.
చెంచాలు వెంటరాగా గుడి నుంచి ఇంటికెళ్లకుండా పేనయ్య చౌరస్తా వరకూ నడిచే వెళ్లాడు. మధ్యలో కనిపించిన వారిపై మాటల మందు చల్లాడు. చౌరస్తాలోని కూరల దుకాణంలోకి వెళ్లాడు. తక్కెడ తీసుకున్నాడు. దండి కొట్టకుండా కూరలమ్మాడు. కూరలమ్ముతూ ఫోటోలు దిగాడు. అవి పేపర్లలో వచ్చేట్లు ఏర్పాట్లు చేసుకున్నాడు.
తరువాయి వచ్చేవారం...
- తెలిదేవర భానుమూర్తి
99591 50491