Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరి మనుషుల స్వభావం స్వార్థపూరితంగా ఉంటది. మనుషులతోని అవసరం ఉన్నదనుకుంటే నవ్వుకుంట నమస్తే పుట్టుకుంట మాట్లాడుతరు. అటు పోయేప్పుడు ఇటు పోయేప్పుడు చిరునవ్వులు కురిపిస్తరు. ఏదైనా పని అవసరం అయితదని అనుకున్నప్పుడే అట్ల చేస్తరు. ఇటువంటి మనుషులను 'అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ - అక్కెర తీరినంక ఉత్తనారాయణ' అని అంటరు. ఏదైనా పని గట్టెక్కింది ఇగ అతనితో పని లేకుంటే మల్ల ఆయన దిక్కు కూడా చూడరు. మాట్లాడరు. చూసినా చూడనట్టు అంజన్ కొడతరు. ఇప్పటి తరంలో ఎక్కువ మంది ఇట్లనే వ్యవహరిస్తున్నరు. వీల్లనే 'ఒడ్డెక్కినంక ఓడ మల్లప్ప - ఒడ్డు దిగినంక బోడ మల్లప్ప' అని కూడా వ్యవహరిస్తారు. వాళ్ల పని ఒడ్డు ఎక్కడమే వాళ్లకు కావాల్సింది ఒడ్డెక్కుడు అంటే పని అయిపోవుడు అని అర్థం. అప్పుడు మల్లప్ప అని గౌరవించడం ఇక పని అయిన తర్వాత బోడ మల్లప్ప అనే బాపతు అని సోదాహరణగా చెప్పుతారు. సామెతలు మనుషుల సామూహిక స్వభావానికి ఏది కరెక్ట్‌గా సరిపోయే వాటిని వాడతారు.
దున్నపోతు ఈనిందంటే...
ఇంకో సామెత వింటే నవ్వు వస్తది 'దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కొట్టుల కట్టేయమన్నట్లు' అనేది వాడతారు. పై వాళ్లు అంటే పై అధికారులు లేదా ఆనాటి పల్లె వాతావరణంలో పెద్ద కులపు వాళ్లు కావచ్చు, వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహారం ఉండేది. ఇప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఏం చేయమంటే అది చేయడమే కింది స్థాయి అధికారుల విధి. అది తప్పు, చెయ్యకూడదని తెలిసినా కూడా చెప్పింది చెయ్యడమే దిన చర్య. ఈ సందర్భంలో 'దున్నపోతు ఈనింది' అని అనంగనే అసలు దున్నపోతు అంటే ఆడదా మగదా అనే ఆలోచన కూడా చేయకుండా దుడ్డెను కొట్టంల కట్టేయమని ఆదేశం ఇచ్చినట్లు కన్పిస్తది. ఇదంతా మీది నుంచి ఏం చెప్పితే అదే బానిస లెక్క చేయాలి కానీ ఇది ఇట్ల ఎట్ల అయితది అని క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. నేనా అధికారిని నీవా అనే ప్రశ్న కూడా వస్తది. దున్నపోతు పోతు జాతి కిందకు వస్తది దీనికి సంతానం కల్గది కదా అనే ఆలోచన సైతం రాదు. వచ్చినా నోర్ముసుకునుడే. ఇదే పరంపర ఇప్పుడు రాజకీయ పార్టీల్లో కూడా దర్శనం ఇస్తున్నయి. స్వంత నిర్ణయం తీసుకుని చాట్లు వాడే మాట ఈ సామెత.
- అన్నవరం దేవేందర్, 9440763479