Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఇప్పుడేది రహస్యం కాదంటూ'' అంతరంగంలో అంతుచిక్కని ప్రశ్నలను వెలిబుచ్చలేని రహస్యాల వంటి ఆవేదనలను బహిర్గతం చేసిన ఇబ్రహీం ఇప్పుడు బహిరంగ ప్రకటనతో మన ముందుకొచ్చాడు. తొలి కవిత లోనే తన పదునెక్కిన కలాన్ని ఝుళిపించాడు.
''రాయి విసరడం అంటే ప్రశ్నించటం / తుపాకీ ఎక్కు పెట్టడం సమాధానం కాదు... / కాటు వేస్తుందని తెలిసినా / పడగ నీడనే నిలబడ్డాను కదాని / నమ్మకం మీదకు నీ ద్రోహపు విషం చల్లకు'' అంటూ సమకాలీన సమాజ స్థితులను తెలియజేసే అంశాన్ని ''హమీద్'' చిత్రం సాయంతో... మనల్ని ఆలోచింప జేయిస్తూ రాసిన కవిత. రాబోయే రోజుల్లో చాలామంది నోట పై రెండు లైన్లు మాట వింటామనడంలో ఎటువంటి సందేహం లేదు.
''పులి విడిసిన చొక్కా'' తో తన అభ్యుదయ భావజాలాన్ని చెప్పకనే చెప్పాడు. తన కవితలు చదువుతుంటే ఆలోచనల సుడిగుండాలలో తిరుగుతూ పూర్వపు దినాల నుంచి... వర్తమాన రోజుల దిగులుతో... భవిష్యత్తులోకి భయ పడుతూ తొంగిచూసేలా చేస్తుంది.
ఇబ్రహీం.. అక్షరాల సెగతో కవిత్వపు మంటలు మండించాడు. నేటి కవులలో ఇంతటి ధైర్యాన్ని చూసింది అరుదేనని అనవచ్చు. ఎన్నో ఏళ్లుగా లోపల దాచు కున్న బడబాగ్ని ఒక్కసారిగా విస్ఫోటనమై బహిరంగ ప్రకటనతో పేలింది. అందరి దృష్టి తన వైపు తిప్పుకునేలా చేయడమే కాదు అతని ధైర్యాన్ని మెచ్చుకునేలా చేసింది.
''ముని వేళ్ళను తెగ్గోసినా... / నా అక్షర తూటాలు / ఆకాశాన్ని నేలపై కూల్చగలవు..'' అన్న మాటలు తన రచనపై తనకున్న అచంచల ఆత్మ విశ్వాసాన్ని తెలియజేస్తుంది.
''మీరు మీరు చొక్కాలు మార్చుకొని / శత్రువుకి శత్రువు మిత్రుడై.. / దశావతారాల్లో ఏ యుగానికి హాని చేయని నన్ను .. / ఏకంగా దేశానికే ద్రోహినని పన్నుతున్న కుట్ర .. కాదా / నేను ఏ యుగంలో ని మతానికి శత్రువునైయ్యానో / కొంచెం విడమరచి చెప్పవూ'' అంటూ.. ''నేను నీకు శత్రువు నెట్లయితా?'' కవితలో రాసిన రాతలు ప్రతిపాటకుడిని ఆలోచింపజేస్తుంది.
చాప కింద నీరులా పాలకుల పన్నాగాలు.. ప్రవహింపజేసే.. ప్రయత్నం జరుగుతున్న వేళ... దశాబ్దాలుగా వివక్షకు గురవుతూ.. అడుగడుగు అనుమానపు చూపులు.. అవమానపు చేష్టలు.. భరిస్తూ అవని పోరల్ని చీల్చుకుంటూ ఒక్కసారిగా పైకెగసిన అగ్ని జలలా పారిన.. జ్వాలా ప్రవాహం .. నిర్గుణ్ కవిత్వం
'నాకెందుకు చెప్పలేదు నాన్న.. నేను పుట్టక ముందే ఈ మట్టికి శత్రువ య్యానని...' అనే కవితలో తన గోసను వెలిబుచ్చాడు..
''బొట్టుకు టోపీకి మధ్య నువ్వు విల విలలాడిపోతావని.. / ఎక్కడ చూసినా, ఏ పత్రిక చదివినా / నన్ను శత్రువుగా చూపిస్తున్నాడు.., / నా చిన్ననాటి దోస్తు లకు సుపారీ ఇచ్చి / నా మీద ఎగదో స్తున్నాడు.. / నా జాడ మీద చూపుల నిఘాను మోహరిస్తున్నాడు... / నా బిడ్డల పరువును బజారులో వేలం వేస్తున్నాడు..'' అంటూ ఇబ్రహీం చెప్తున్నది తన గోస మాత్రమే కాదు.. ఇది తన జాతి గోస...ఆధిపత్య మతోన్మాదుల ఆగడాలు.. పెచ్చు మీరు తున్న తీరును ప్రశ్నిస్తాడు కవి.
పీడన ప్రతిఘటన కోరుతుంది.. తిరుగుబాటుకై కొత్తదారులు వెతుకు తుంది.. కవి విశ్వంలో ఏ మూలన దుర్నీతి జరిగినా తన కలంతో పంచనామా చేస్తాడు.. అసాంఘిక చర్యలను అమాయ కులపై రుద్దినప్పుడు.. అనుమానపు వేధిం పులు అల్పులను కాకుల్లా పొడుస్తున్న ప్పుడు... నేనున్నానంటూ ఇబ్రహీం కలం.. గళమెత్తి కయిత రూపంలో అభాండాల తెరను...ఖండ ఖండాలుగా చేస్తుంది.
మార్పు అనేది సహజమైన ప్రక్రి యని.. కాలానుగుణంగా మనిషి ఆలోచ నలో.. ఆచరణలో.. అహర్యంలో మార్పు అనివార్యమని...
''పేగుల్లో లేకున్నా / పైకి కనిపిం చాలనే / చిగురుల దర్పాల వాసనలోంచి బయటపడేసుకోవాలని... / అశాస్త్రీయం లోంచి... శాస్త్రీయ దృక్పథంలోకి.... / వేరుతనాల పాతదనంలోంచి../ కొత్త దనంలోకి మారాలని'' 'పెట్టుడు మచ్చ' కవితలో కవి కోరుకుంటాడు.
అమ్మపై.. అవనిపై రాయని కవి ఉండడు. అందునా అమ్మను దూరం చేసు కున్న ఇబ్రహీం తన బాధను.. ప్రేమను ..పదాల రూపంలో పేజీల కొద్దీ గుమ్మరిం చాడు. ''మా అమ్మ'' ... ''చెప్పే వెళ్లాల్సిందమ్మా'' కవితలు చదివితే అది మనకర్థమవుతుంది.
కఠినమైన నిజాలు కళ్ళ ముందు కనబడుతున్నా... భయమనే గంతలు కట్టుకున్న మనకు బహిరంగ ప్రకటన ద్వారా వాస్తవ స్థితిని నివేదించాడు.
ఈ పుస్తకం ఒకసారి చదివితే అర్థమ వుతుంది.. వ్యవస్థ విస్మరిస్తున్న లౌకిక వాదం గురించి.. మతాల పేరిట మనుషుల్ని చీలుస్తున్న వైనం గురించి.. అవమానాల పాలవుతున్న అణగారిన వర్గాల గురించి.. ఈ కవి ఏ భాషకు... ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకుండా ఎక్కడ ఏ భాష అవసరమనుకుంటే అక్కడ ఆ భాషను మాడలికాన్ని స్వేచ్ఛగా ఉపయోగించుకున్నాడు.
ఏదేమైనా ఇటువంటి రచన చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ధిక్కార స్వరంతో.. దీటైన పదజాలంతో తను చెప్పదలుచుకున్న విషయాన్ని ఎటువంటి తెరలు లేకుండా బహిరంగం గా ప్రకటించిన కవి ఇబ్రహీం నిర్గుణ్.. కాదు కాదు ఇబ్రహీం నిర్భరు...
- నయీమ్ పాష
99089 16783