Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ రచయిత లేదా రచయిత్రి, తాను దశాబ్దాల క్రితం రాసిన రచనలను మళ్ళీ చదివి పరిశీలించుకోవటం సహజంగా వారికి ఆసక్తి కలిగించే విషయం. అనుభవ రాహిత్యం, నాటి ఆలోచనలలో కొంత అపరిపక్వత, ఎంతగా తెలిసి రాశామనుకున్నా, అభిప్రాయాల మార్పు, అసంబద్ధత కనిపించవచ్చు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనుకొనే రచయితలైతే అవకతవకలు, తప్పులు కనపడకపోవచ్చు. పాఠకులను దారి తప్పించే వ్యాఖ్యలు కూడా, సమర్థనీయంగా వారే భావించవచ్చు.
తెలుగు నవలా సాహిత్యంలో రంగ నాయకమ్మ స్త్రీవాద రచయిత్రిగా తిరుగు బాటు సృష్టించారు. తన మొదటి నవల 'కృష్ణవేణి' 64ఏండ్ల క్రితం 1959లో రాసారు. 19వ ఏట కౌమారంలోని ఆమె నవల ఆశ్చర్యం అనిపిస్తుంది. 70 ఏండ్ల వయస్సులో సుమారు అర్ధ శతాబ్ది తరువాత, యిక ఆ నవల పునర్ముద్రణ వద్దను కున్నా, పాఠకుల ఒత్తిడికి తలవొగ్గి 8వ ముద్రణకు అంగీకరించారు. 7వ ముద్రణకు 1975లో 'కొత్త ముందుమాట' నాటికే ఆమెకు ఆ నవల పట్ల అసంతృప్తి వుంది. ఆ నవల కథా వస్తువు, రచనా విధానం రెండింటినీ విడివిడిగా పరిశీలించి, అవకతవకలు ఎన్నో కన్పించడంతో యిక ఆ నవలే వద్దనుకున్నారు. కాని కొత్త చదువరులు, ఆ పుస్తకం కావాలని తెగ అడుగుతూ వుంటే, 38 ఏండ్ల కాలంలో చదువరుల అభిమాన వాదనలకు, అభ్యర్థనలకు తలొగ్గి, 'మాట తప్పి' ఒప్పుకున్నారు. ఆ విధంగా 1959లో సీరియల్‌గా వచ్చిన కృష్ణవేణి, 35 ఏండ్ల తరువాత, సర్దుళ్ళూ, దిద్దుళ్ళూ, 145 ఫుట్ నోట్స్ జతపరిచారు. ''నేను ఇదే ఘట్టాన్ని ఇప్పుడు రాస్తే, ఇలా రాస్తాను'' మొదటి ముద్రణలో సుఖాంతంగా ముగిసిన కథ రెండవ ముద్రణలో దు:ఖాంతంపు వింత'', ''తప్పులే లేకుండా వుండాలంటే ఎలా వుండాలి'', ''కథని ముగించే నాలుగు రకాల ముగింపులతో'' మళ్ళీ ప్రచురింపచేసారు. అందువల్ల కృష్ణవేణి, నవలా సాహిత్యంలో వినూత్నత సృష్టించింది.
రంగనాయకమ్మకు తన లేతవయస్సు కథానాయకురాలంటే తర్వాత అసంతృప్లి కలిగిందనుకోవడంలో సందేహం లేదు. నాటి కృష్ణవేణిని, ఒక కాలేజీ విద్యార్థినిగా నవల నడిపించారు. రచయిత్రిగా ఆ తొలి నవల రాసిన కాలంలో, ఆమెకూ, యిరవై ఏండ్ల వయస్సే. కాలేజీకి సిటీ బస్సులో వెళ్ళే అమ్మాయికి, విద్యార్థినికి అయాచితంగా, మాధవ్‌తో పరిచయం, యువత మధ్య కలం స్నేహాలు, ఫొటోలు యిచ్చుకోవడాలు, ఇంజనీరుగా ఆఫీసు పని మీద వచ్చిన మాధవ్, పార్క్‌కు పిలిస్తే వెళ్ళడం, క్రమేపీ ప్రేమికునిగా అతడే భర్తగా కావాలని వాంఛ. యింతలోనే, తనకు మూడేండ్ల క్రితమే పెండ్లి అయిందని మాధవ్ రాయడం, ఇంజనీరింగ్ చదువు తర్వాత, నాలుగేండ్ల కిందనే ఉద్యోగంలో స్థిరపడిన, అందులోనూ వివాహితుడైన మాధవ్‌తో, వయస్సు తేడా వున్నా పెండ్లి చేసుకోవాలనే నిర్ణయం. ఈ కథనం తొలి ఘట్టంలో, ఆ రోజుల కుటుంబ నేపథ్యంలో కృష్ణవేణి పాత్రను, ప్రేమ ముసుగులో పెండ్లి తాపత్రయం స్పష్టమవుతోంది. కాని రచయిత్రికి అప్పటికే, ప్రగతిశీల భావాలు అంకురించడంతో, పెండ్లి - ప్రేమ జంజాటంలో యిరుక్కున్న కృష్ణవేణి ''ప్రేమమయుడైన మాధవ్‌ను దూరం చేసుకుంటున్న నేనెంత దౌర్భాగ్యురాలిని'' అనుకుంటుంది. ఆమె అంత తొందరగా, మాధవ్‌ను కాదని, శ్యామసుందర్‌ను పెండ్లి చేసుకోవడంపై, రంగనాయకమ్మ 108వ ఫుట్‌నోట్‌లో ఇలా వ్యాఖ్యానించారు ''ఆ ప్రశ్నలేవీ అప్పుడు నాకు లేవు''. రచయిత్రి కుతూహలం అంతా కథా ప్రారంభంలో, తన కలం స్నేహితుడు మాధవ్‌కు రాసిన ఉత్తరం కాయితాలు నేల మీద ఎగిరే సంఘటన, శ్యామసుందర్లో రగిలిన చిచ్చు కనుక లేకపోతే ఉత్తరాల ప్రేమలేఖల ఈ మొత్తం కథ ఎట్లా జరుగుతుంది? అందుకనే రచయిత్రి, కృష్ణవేణిని అలా తీర్చిదిద్దారు. 134వ ఫుట్‌నోట్‌లో ప్రేమతో ఆటలాడే మనిషికి ఎవరి ప్రేమా దొరకకపోవడమే ప్రతిఫలం అవుతుందని కూడా అంటారు.
''ప్రేమించుకున్న జంటల అన్నింటిలోను ప్రేమ ఒకే స్థాయి, ఒకే ఔన్నత్యంతో ఉండదు. మాధవ్ ప్రేమా, కృష్ణవేణి ప్రేమా ఒకే స్థాయిలో లేవు. ఒకే చైతన్యంతో లేవు. అందుకే నాటి కృష్ణవేణి అతి చిన్న సాహసం కూడా చెయ్యలేకపోయింది. ఇదంతా చెప్పాలనే నేను ఈ కథ రాశానా? కాదు ఇదంతా నాకు అప్పుడు తెలియదు. తెలియకుండానే రాసిన సమాజంలో వుండే, ప్రేమల్లో వుండే ఒక నిజమే అందులో ప్రతిబింబించింది'' అంటారు రచయిత్రి సమర్థనీయంగా.
చలంగారి మైదానాన్ని ప్రస్తావిస్తూ రంగనాయకమ్మ, ప్రేమతో ఏర్పడని వైవాహిక సంబంధాన్ని నిరసించే చలం కథ, ప్రేమ అర్థాన్ని మార్చే ప్రేమ సౌందర్యాన్ని వికృతం చేసే మార్గంలోకి చదువరులను తీసుకుపోయి విడిచిపెడుతుందని కూడా తన అభిప్రాయం వ్యక్తం చేసారు. ఏ రచయిత అయినా వృద్ధాప్యందాకా జీవించే అవకాశం లభిస్తే తమ కథా వస్తువులలో, ఏమైనా పొరపాట్లు జరిగాయేమోనని పునర్విమర్శలు చేసుకోవాలని అంటూ, పొరపాట్లు కొన్ని తెలిసినా తన రచనలన్నింటినీ, మళ్ళీ పరిశీలించడం సాధ్యం కూడా కాదని స్పష్టం చేసారు. రచయితలకు సాధ్యం కాని పని పాఠకులే చేసుకోవాలన్నారు.
అప్పుడు ఆ కాలంలో ''ఎలా రాయాలో ఏమీ తెలీదు'' అన్న రచయితల తెలియనితనమే ఆ పాత్రల తెలియని తనం అవుతుంది. ప్రేమ విలువని ఎగరగొట్టి, ప్రేమికులు కూడా... సాంప్రదాయక పెండ్లిండ్లతో చాలా సంతోషంగా వున్నారని చెప్తే అది చాలా అవాస్తవం. కథ ముగింపు ఏమైనా ప్రేమకు అవమానం లేకుండా జరగాలి. అదీ రంగనాయకమ్మ కృష్ణవేణి నవల ప్రస్తుత అభిప్రాయ సారాంశం.
- జయసూర్య, 9014948336