Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల సాహిత్యం బహుముఖీనమై వెలుగుతోంది. రచన, విమర్శ, వికాసం విషయంలోనే కాదు పరిశోధన లోనూ ఇవ్వాళ్ల తెలుగు బాల సాహిత్యం విశేష రూపంగా వెలుగుతోంది. ఈ నేపథ్యంలోనే స్వయంగా కవి, రచయిత, బాల సాహితీవేత్త, ఉపాధ్యాయుడు, పరిశోధకుడు, బాల వికాస కార్యకర్తగా పనిచేస్తున్న ప్రతిభావంతుడు డా. గౌరవరాజు సతీశ్ కుమార్.
అక్టోబర్ 12, 1957లో ఉమ్మడి మెదక్ జిల్లా జోగి పేటలో సతీశ్ కుమార్ జన్మించారు. రంగమ్మ- శ్రీనివాస రంగారావు వీరి అమ్మానాన్నలు. ఉపాధ్యాయునిగా తన ఉద్యోగ జీవితం ప్రారంభించిన సతీశ్ కుమార్ తెలుగు ఉపన్యాసకులుగా పదవీ విరమణ చేశారు. తన ఆసక్తితో సాయంకాల కళాశాలలో ఛాత్రోపా ధ్యాయులకు తెలుగు బోధనా పద్ధతులు బోధించారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూర విద్య విద్యార్థులకు కౌన్సిలర్‌గా సేవలందించారు. ఉపాధ్యాయులుగా సర్వశిక్షా అభియాన్ నిర్వహించిన అనేక కార్యశాలల్లో, 'కరదీపిక' రచనల్లో భాగస్వామి అయ్యాడు. బడిలో పాఠాలు చెబుతూనే అనేక రేడియో పాఠాల రచనలు చేశారు. సర్వశిక్ష వారికోసం ఆంగ్లం నుంచి తెలుగులోకి పలు అనువాదాలు చేశారు.
సతీశ్ కుమార్ ప్రధానంగా బాలల కోసం రచనలు చేసినప్పటికీ 'అక్షరాలు' పేరుతో కవితా సంపుటి ప్రచురించారు. వీరు ప్రచురించిన మరో ప్రేమ కవితల సంపుటి 'మిథునం'. కవిగా వివిధ పత్రికల్లో వీరి రచనలు అచ్చయ్యాయి. వ్యాసకర్తగా, విమర్శకునిగా వందకు పైగా వివిధ పత్రికలు, సంకలనాలు సంచికలలో రచనలు పచురించబడ్డాయి. 'సలాం హైద్రాబాద్' మాస పత్రికలో పిల్లల కాలంను నిర్వహించడమే కాకుండా, 'బాల మంజీర' కు సహ సంపాదకులుగా, సర్వశిక్షా అభియాన్ వారి బాల సాహిత్య మండలిలో సహ సంపాదకులుగా ఉన్నారు. జాగృతి, ఓయు సాహితీ వేదిక, రంజని తెలుగు సాహితీ సమితి, తెలుగు వెలుగు సాహితీ సమితి వంటి అనేక సంస్థల కవి సమ్మేళనాలు, ఉత్సవాలలో పాల్గొన్నారు. ఆయా సంస్థల సంచికలలో వీరి కవితలు, వ్యాసాలు వచ్చాయి. ఇవే కాకుండా ఇటీవల ప్రధాన స్రవంతిగా వెలుగుతున్న సామాజిక మాధ్యమాల గ్రూప్‌లలో వీరి రచనలు అనేకం వచ్చాయి. 'అల' అంతర్జాల పత్రికలో ఏకంగా నూటా యాభైకి పైగా కవితలు వచ్చాయి.
బాల సాహిత్యం రాయడం ఎంత యిష్టమో పరిశోధన అంటూ కూడా సతీష్ కుమార్‌కు అంత యిష్టం, ఆ యిష్టం, ప్రేమ 'బాల గేయాలు - భక్తి ప్రబోధం' సాధికారిక పరిశోధన చేయిం చింది. ఈ గ్రంథం తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ పరిశోధనగా స్వర్ణ పతకం గెలుచుకుంది. బాల సాహిత్యంలో ప్రధానమైన దేశభక్తి, మాతృభక్తి, గురుభక్తి ఇలా అనేక అంశాలతో పాటు తెలుగు బాల గేయాల వెలుగు ప్రస్థానాన్ని యిందులో చర్చించాడు సతీష్ కుమార్. ఈ రచనకు గాను యిటీవల వాసరవేణి పరుశరాం బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు. ఇదే కాక మరో ఇరవైకిపైగా పురస్కారాలు వీరి ఖాతాలో ఉన్నాయి.
బాలల కోసం రాశిలోనూ, వాసిలోనూ ఎన్నదగిన రచనలు చేసిన సతీశ్ కుమార్ 'బాల గేయాలు', 'బాలల కోసం రష్యా జానపద కథలు', 'బాలల కోసం దేశ దేశాల కథలు', 'బహుమతి' పేరుతో బాలల కథా సంపుటి ప్రచురించారు. ఇంకా 'బాలల కోసం ప్రియదర్శిని', 'బాలల కోసం విలియం షేక్స్పియర్', 'బాలల కోసం స్వామి వివేకానంద', 'బాలల కోసం గౌతమ బుద్దుడు' మొదలగు మహనీయులు, మహా పురుషుల జీవిత కథలను పిల్లల కోసం రచించారు. 'అమ్మ-బొమ్మ', బాల గేయాలు, మరో రెండు పిల్లల బొమ్మల జపాన్ జానపద కథలు, 'నాన్నా చెప్పవూ' పేరుతో గౌరవరాజు కూర్చిన పిల్లల పుస్తకాలు రానున్నాయి.
దేశదేశాల కథలను పిల్లల కోసం ఏరి కూర్చిన సతీష్ కుమార్ బాల గేయాలను కూడా విజ్ఞాన, వినోద గేయాలతో పాటు రైమింగ్‌తో కూడిన లయలను కూడా రాశారు. 'మాకుందో పిల్లి / దానిపేరు లిల్లి / తిరుగుతుంది గల్లి / చేస్తుంది లొల్లి' వంటి సరదా అయిన గేయాలే కాకుండా, 'అమ్మకు నేను బొమ్మను / బొమ్మకు నేనే అమ్మను / అమ్మకు నేనే ముద్దేగా / బొమ్మకు నేనే ముద్దేగా/ అమ్మా బొమ్మ ముద్దేగా / అమ్మా బొమ్మా నాదేగా' వంటి బాల గీతాలు వీరు రాశారు. అమ్మను గురువుగా, దైవంగా, ఇంటిని గుడిగా, బడిగా బోధిస్తూ సతీష్ కుమార్ చక్కని గేయాన్ని రాశారు. అందులో ఆయన, 'ప్రతి ఇల్లూ ఒక బడి / ప్రతి ఇంటా ఒక ఒక గుడి / ప్రతి బడిలో ఒక గురువు / ప్రతి గుడిలో ఒక దైవం / గురువూ, దైవం ఒకరేగా / ఆ ఒకరూల అమ్మేగా' అంటూ అమ్మను గురించి అద్భుతంగా చెబుతారు. పిల్లలను నవ్వుతూ వెలిగే దీపాలుగా వర్ణించిన సతీష్ కుమార్ వారు రంగుల లోగిలిలో ఆడే అద్భుతాలుగా వర్ణిస్తారు. కవి, రచయిత, అనువాదకులు, బాలల కోసం నిరంతరం తపించి ఇరవై అయిదుకు పైగా ముద్రిత అముద్రిత బాలల పుస్తకాలను రాసిన బాల సాహితీవేత్త డా.గౌరవరాజు సతీశ్ కుమార్. జయహో బాల సాహిత్యం.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548